అపురూప దర్శనం...భక్తులకు లేదు అవకాశం

ABN , First Publish Date - 2020-04-26T09:40:10+05:30 IST

ఏడాదికోసారి లభించే అపురూప దర్శనం...సింహాద్రి అప్పన్న నిజరూపం. చందనోత్సవం రోజు లభించే ఈ దర్శనభాగ్యం ఈ ఏడాది భక్తులకు లేదాయే.

అపురూప దర్శనం...భక్తులకు లేదు అవకాశం

 తొలిసారి అంతరంగికంగా అప్పన్న చందనోత్సవం

వైదిక సిబ్బంది, ఆలయ ధర్మకర్తల కుటుంబీకులకే అవకాశం

 


సింహాచలం: ఏడాదికోసారి లభించే అపురూప దర్శనం...సింహాద్రి అప్పన్న నిజరూపం. చందనోత్సవం రోజు లభించే ఈ దర్శనభాగ్యం ఈ ఏడాది భక్తులకు లేదాయే. కరోనా కల్లోలం, లాక్‌డౌన్‌ కారణంగా కేవలం వైదిక సిబ్బంది, ఆలయ ధర్మకర్తల కుటుంబంతోనే ఈ ఏడాది వార్షిక చందనోత్సవం నిరాడంబరంగా ముగియనుంది. శనివారం  దేవస్థానం కార్యనిర్వాహణాధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలకమండలి చైర్‌పర్సన్‌ తప్ప ఇతర పాలకమండలి సభ్యులు లేదా ఇతర రాజకీయ, అధికార ప్రముఖులు ఎవరినీ అనుమతించడం లేదని, అందరూ సహకరించాలని కోరారు. ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు, ధర్మకర్తల చైర్‌పర్సన్‌ సంచయితా గజపతి ఒక్కరికి మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు తానే స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించన్నుట్లు తెలిపారు.  స్వామి దర్శనానికి భక్తులను, ప్రముఖులను అనుమతించనందున కొండపై పోలీసుల బందోబస్తు అవసరం లేదన్నారు.


అందువల్ల కొండపైకి వచ్చే దారుల వద్ద ఎవరూ రాకుండా కట్టడి చేసేందుకు పరిమిత సంఖ్యలో పోలీసుల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. తెల్లవారు జామున 2 గంటలకు అర్చకులు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి సంప్రదాయ కార్యక్రమాల అనంతరం చందనం ఒలుపును పూర్తిచేస్తారని తెలిపారు. ధర్మకర్తల  నిజరూప దర్శనం పూర్తయ్యాక సహస్రఘటాభిషేకం నిర్వహించి  తొలివిడత చందనాన్ని స్వామికి సమర్పిస్తారని చెప్పారు. ఆర్జిత సేవలైన నిత్యకల్యాణం, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన, సహస్ర నామార్చన, అష్టోత్తర శతనామార్చనలను కూడా  భక్తులు ఆన్‌లైన్‌ చేయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు.


గోపాలపట్నం సీఐ పి.రమణయ్య మాట్లాడుతూ చందనోత్సవాన్ని వైదిక సిబ్బంది పూర్తిగా అంతరంగికంగా నిర్వహిస్తున్నందున సింహగిరికి చేరుకునే పాత, కొత్త టోల్‌గేట్ల వద్ద, మెట్లమార్గం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఉత్సవ వేళ భక్తులకు దర్శనభాగ్యం లభించక పోవడంపై మాజీ కేంద్ర మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వాట్సాప్‌లో ఆవేద వ్యక్తం చేస్తూ మెసేజ్‌ పంపారు. ‘కరోనా దృష్ట్యా భక్తులంతా స్వామిని ఇంట్లోనే  మనసులో ధ్యానం చేసుకోండి. వైరస్‌ నుంచి యావత్‌ భారతదేశాన్ని రక్షించాలని ప్రార్థించండి‘ అని సూచించారు. 

Updated Date - 2020-04-26T09:40:10+05:30 IST