‘సింహాచలం’ భూములకు ప్రత్యామ్నాయంగా 1000 ఎకరాలు

ABN , First Publish Date - 2020-12-06T06:19:20+05:30 IST

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

‘సింహాచలం’ భూములకు  ప్రత్యామ్నాయంగా 1000 ఎకరాలు
సమావేశమైన మంత్రులు, ఇతర నేతలు, అధికారులు

ఇప్పటికే 580 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వం

మరో 500 ఎకరాలు ఇవ్వాలని ప్రతిపాదన

పంచ గ్రామాల భూ సమస్యపై తాడేపల్లిలో కమిటీ సమావేశం

త్వరలో శారదా పీఠాధిపతితో భేటి


అమరావతి/విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములకు బదులుగా వెయ్యి ఎకరాలను దేవస్థానానికి ఇవ్వాలనే ప్రతిపాదనను తీసు కొచ్చింది. ఈ అంశంపై నియమించిన కమిటీ సమావేశం శనివారం తాడే పల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. దేవస్థానానికి చెందిన 420 ఎకరాల్లో సుమారు 12 వేల మంది నివాసం ఉంటున్నారు. ఈ భూముల విలువ సుమారు రూ.3400 కోట్లు వుంటుందని అధికారులు అంచనా వేశారు. అందుకు బదులుగా దేవస్థానానికి ఇచ్చేందుకు 580 ఎకరాలను జిల్లా అధికారులు గుర్తించారు. వాటి విలువ రూ.1400 కోట్లు ఉంటుంది. దీంతో ఆలయ భూములకు, ప్రభుత్వం ఇచ్చే భూములకు మధ్య తేడా సుమారు రూ.2 వేల కోట్లు వుండడంతో దేవస్థానానికి మరో 500 ఎకరాలు ఇవ్వాలనే ప్రతిపాదనను ఈ సమావేశంలో చేశారు. ఆ మేరకు భూములు ఎక్కడున్నాయో చూడాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. దీనిపై మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం వెయ్యి ఎకరాల పైగా అయితే దేవస్థానం భూమి విలువకు సరిపోవచ్చునని, అప్పుడు కోర్టులో అడ్డంకులు వుండవని భావిస్తున్నారు. కానీ, ఆలయ భూములు నగరంలో వుండడం వల్ల వాటి విలువ భారీగా ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూములు నగరానికి దూరంగా, ఏజెన్సీకి సమీపంలో వున్నాయనే వాదన ఉంది. వాటి విలువ చాలా తక్కువగా వుంటుందని, వాటిని పంచ గ్రామాల భూములకు ప్రత్యా మ్నాయంగా చూపడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో...ఈ ప్రతిపాదనకు కోర్టు అంగీకరిస్తేనే సమస్య పరిష్కారానికి వీలుం టుంది. ఈ సమస్యపై విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి సమక్షంలో మరోమారు చర్చించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.


ఎవరికీ నష్టం లేకుండా పరిష్కారం

- మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అటు దేవస్థానం, ఇటు ఆక్రమణదారులకు నష్టం లేకుండా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, అక్కడ కూడా ఒప్పించాల్సి ఉందన్నారు. ఆక్రమిత భూములను క్రమబద్ధీకరిస్తే దేవస్థానానికి రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపేణా వస్తుందని,భూమికి భూమి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. త్వరలోనే ప్రజలకు తీపికబురు చెబుతామని విశ్వాసం వ్యక్తంచేశారు. కొవిడ్‌ వల్ల కమిటీ సమావేశం ఆలస్యమైందని, ఈ అంశం కోర్టులో వున్నందున ఎలా పరిష్కరించాలనే దానిపై చర్చించామని దేవదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సమావేశంలో విశాఖ ఇన్‌చార్జ్‌ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T06:19:20+05:30 IST