త్రిశంకు స్వర్గంలో సెజ్ పరిశ్రమలు
ABN , First Publish Date - 2020-12-07T05:48:54+05:30 IST
అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లోని రసాయన, బల్క్‌డ్రగ్ కంపెనీలకు.... వ్యర్థజలాల శుద్ధి పెద్దసమస్యగా మారింది. పూడిమడక వద్ద నిర్మించిన వ్యర్థజలాల శుద్ధి ప్లాంట్(ఈటీపీ) పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు.

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో ఈటీపీ సమస్య
పూర్తిస్థాయిలో పనిచేయని ప్లాంట్
రసాయన, బల్క్‌డ్రగ్ పరిశ్రమల్లో పేరుకుపోతున్న వ్యర్థజలాలు
రాంకీ ఈటీపీకి తరలించ వద్దంటున్న పీసీబీ
ఉత్పత్తిని తగ్గించేసిన సెజ్ కంపెనీలు
నేడు ఏపీఐఐసీ అధికారులతో యాజమాన్యాలు భేటీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లోని రసాయన, బల్క్‌డ్రగ్ కంపెనీలకు.... వ్యర్థజలాల శుద్ధి పెద్దసమస్యగా మారింది. పూడిమడక వద్ద నిర్మించిన వ్యర్థజలాల శుద్ధి ప్లాంట్(ఈటీపీ) పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. దీనికితోడు సాంకేతిక సమస్యలు, పీసీబీ నిబంధనలు ప్రతిబంధకాలుగా మారాయి. మరోవైపు సెజ్ పరిశ్రమల నుంచి వ్యర్థజలాలను పరవాడ ఫార్మాసిటీలోని రాంకీ ఈటీపీకి పంపవద్దని పీసీబీ ఆదేశించింది. దీంతో సెజ్‌లోని కంపెనీల వద్ద పెద్దమొత్తంలో వ్యర్థజలాలు పేరుకుపోయాయు. పలు కంపెనీలు ఉత్పత్తులను భారీగా తగ్గించుకున్నాయి.
అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లో 100కుపైగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం 40 నుంచి 50 రసాయన, బల్క్‌డ్రగ్ పరిశ్రమలు వున్నాయి. ఉత్పత్తుల తయారీ తరువాత వచ్చే వ్యర్థజలాలను శుద్ధిచేసిన తరువాతే సముద్రంలోకి విడిచిపెట్టాలి. ఇందుకోసం ఏపీఐఐసీ అధికారులు పూడిమడక వద్ద ఈటీపీ నిర్మాణం చేపట్టారు. (అయితే సెజ్‌లో 2012-13 నుంచే పరిశ్రమలు ఏర్పాటు అవుతుండడంతో వ్యర్థజలాలను ట్యాంకర్ల ద్వారా పరవాడ ఫార్మాసిటీలో రాంకీ ప్లాంట్‌కు తరలిస్తున్నారు.) వివిధ కారణాల వల్ల ఈ ప్లాంట్ నిర్మాణం వేగవంతంగా జరగలేదు. పరిశ్రమల యజమానులు చొరవ తీసుకుని గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో చివరకు రూ.72.62 కోట్లతో తొలిదశలో 1.5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఈటీపీ నిర్మించారు. దీని నిర్వహణ కోసం ‘అచ్యుతాపురం ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఏఈటీపీఎల్)’ను ఏర్పాటు చేశారు. కాగా రెండు నెలల క్రితం ట్రయల్ రన్ నిర్వహించారు. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా వ్యర్థ జలాలు శుద్ధి కాకపోడంతో పీసీబీ అధికారులు ప్లాంట్ నిర్వహణను నిలిపివేశారు. తరువాత సాంకేతిక సమస్యలు పరిష్కారమైనప్పటికీ పరిశ్రమల డిమాండ్‌కు తగినంతగా ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో ఆయా పరిశ్రమల్లో భారీగా వ్యర్థజలాలు పేరుకుపోయాయి.
రాంకీకి తరలించొద్దు
కాగా పూడిమడక వద్ద ఈటీపీ ఏర్పాటైనందున ఎస్‌ఈజడ్‌లోని పరిశ్రమల వ్యర్థజలాలను రాంకీ ప్లాంట్‌కు పంపవద్దని పీసీబీ ఉన్నతాఽధికారులు ఆదేశించారు. ఇదే సమయంలో అచ్యుతాపురం పరిశ్రమల నుంచి వ్యర్థజలాలు తీసుకోవద్దని రాంకీ యాజమాన్యంపై ఫార్మాసిటీలోని కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో సెజ్‌లోని రసాయన, బల్క్‌డ్రగ్ కంపెనీల్లో వ్యర్థజలాల నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. దీనివల్ల ఉత్పత్తులు తగ్గించుకున్నట్టు సమాచారం. ఈటీపీ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యోగుల వేతనాలు, కంపెనీ నిర్వహణ, రుణ బకాయిల చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈటీపీ సమస్య పరిష్కారానికి సోమవారం ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో కంపెనీల ప్రతినిధులు భేటీకానున్నారు.