టార్గెట్ అయ్యన్న
ABN , First Publish Date - 2020-06-18T09:38:44+05:30 IST
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సీనియర్ నేతలపై..

ఏడాది వైసీపీ పాలనలో ఏడు కేసులు నమోదు
గడచిన వారంలోనే 3?
ప్రభుత్వ పాలనపై ఘాటైన విమర్శలే కారణమా?
పదవిలో ఉన్నా లేకపోయినా అదే దూకుడు
నర్సీపట్నం(విశాఖపట్నం): రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం సీనియర్ నేతలపై కన్నేసిన వైసీపీ ప్రభుత్వం తాజాగా ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తున్నది. ఈ ఏడాది కాలంలో ఆయనపై కఠిన సెక్షన్లలతో కూడిన ఏడు కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు, మూడు గడచిన వారం వ్యవధిలో నమోదు చేసినవి కావడం గమనార్హం.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను ఉటంకిస్తూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అందుకే అయన్ను టార్గెట్ చేశారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధికారంలో వున్నా లేకపోయినా బహిరంగ సభల్లోనూ, పత్రికా విలేఖరుల సమావేశాల్లోనూ అయ్యన్న దూకుడుగా మాట్లాడుతుంటారు. అయ్యన్నపాత్రుడు బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాలు, మీడియా సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలపైనే ఈ ఏడాది కాలంలో ఏడు కేసులు నమోదయ్యాయి.
పరస్పర ఆరోపణలు
ఎన్నికల్లో ఓటమి అనంతరం కొద్ది నెలలపాటు మౌనంగా వున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇటీవల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనను, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అయ్యన్న విమర్శించినప్పుడల్లా, ఆయనపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ ధ్వజమెత్తుతున్నారు. దాంతో రెండు పార్టీల నాయకులు వీడియా సందేశాల ద్వారా పత్రికా ప్రకటనలు జారీచేస్తున్నారు.
ఇక నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న మత్తు డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్, అరెస్టు వ్యవహారంపై జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడే అసలు వివాదానికి కారణమన్న ఉద్దేశంతో అధికార పార్టీ ఆయనపై కన్నేసినట్టు తెలిసింది. ఇటీవల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల సేకరణలో అవినీతి జరిగిందంటూ అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడిన సందర్భంలో తమను కించపరిచే రీతిలో వ్యాఖ్యానించారంటూ కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదుచేశారు.
అదేవిధంగా సోమవారం నర్సీపట్నం మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టినందుకు కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు నమోదుచేశారు. అలాగే తనను కించపరిచేలా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడారంటూ నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు నిర్భయ చట్టం కింద ఆయనపై కేసు నమోదుచేశారు.