కుల, మతాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక

ABN , First Publish Date - 2020-12-26T05:25:24+05:30 IST

అవినీతి, వివక్షకు తావులేకుండా కుల, మతాలకు అతీతంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులను ఎంపిక చేశామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

కుల, మతాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక
మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి

మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాసరావు

వాలిమెరక జుత్తాడలో ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం


పెందుర్తి, డిసెంబరు 25: అవినీతి, వివక్షకు తావులేకుండా కుల, మతాలకు అతీతంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులను ఎంపిక చేశామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ గ్రామంలో శుక్రవారం జిల్లా స్థాయి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ అర్హులు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఇంటి స్థలం వస్తుందన్నారు. పేదవాడికి ఇళ్లు ఇస్తామంటే టీడీపీ కక్ష సాధింపుతో కోర్టుకు వెళుతోందన్నారు. పేదోడికి ఇల్లు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి  అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో పార్టీ జెండా మోసిన వారికే పథకాలు అందేవని, వైసీపీ అధికారంలోకి వచ్చాక  నేరుగా వలంటీర్లు ఇంటికి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ పుట్టిన ఊరు జుత్తాడ గ్రామంలో ఇళ్ల పట్టాభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2.96 లక్షల మందికి పట్టాలు ఇవ్వనున్నామన్నారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, ఎంపీ సత్యవతి సంయుక్తంగా మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలతో పాటు వారికి చీరలు అందజేశారు. తొలుత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మంత్రి ముత్తంశెట్టి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ విశాఖ రూరల్‌ జిల్లా  అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోడిగుడ్ల దేవిసాంబ, నాయకులు నక్క కనకరాజు, బీఎన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-26T05:25:24+05:30 IST