స్విమ్మింగ్‌పూల్‌లో యువకుడి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-09-20T16:30:59+05:30 IST
చెడు స్నేహం ఓ యువకుడి ప్రాణాలు బలిగొన్న ఘటన అచ్యుతాపురం మండలం..

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): చెడు స్నేహం ఓ యువకుడి ప్రాణాలు బలిగొన్న ఘటన అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద గల ఓ రిసార్ట్స్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ లక్ష్మణరావు, బంధువులు తెలిపిన వివరాలివి...గాజువాక బీసీ రోడ్డు సీతారామ్‌నగర్‌లో వుంటున్న గొలుగొండ పవన్‌సాయి (19) శుక్రవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకని ఎనిమిది మందితో కలసి కొండకర్ల ఆవ సమీపంలో వున్న గౌరీ వెంకట ఈశ్వర హనుమాన్ (జీవీఈహెచ్) రిసార్ట్ట్స్కు వచ్చాడు. అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ..స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపారు.
అకస్మాత్తుగా పవన్‌సాయి స్విమ్మింగ్‌పూల్‌లో అపస్మారక స్థితికి చేరాడు. కొన ఊపిరితో వున్న అతడ్ని స్నేహితులు బైక్‌పై గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం పవన్‌సాయి కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా అతడి మృతదేహాన్ని ఇంటి బయట వున్న ఒక బల్లపై పెట్టి వెళ్లిపోయారు. శనివారం వేకువజామున పవన్‌సాయిని చూసిన కుటుంబ సభ్యులు ప్రాణం వుందని భావించి తిరిగి అదే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చనిపోయిన వ్యక్తిని మళ్లీ తీసుకువచ్చారేమిటని వైద్యులు ప్రశ్నించడంతో వారికి స్నేహితులపై అనుమానం వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించి, పవన్‌సాయి చిన్నాన్న కన్నా గాజువాక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గత విద్యా సంవత్సరం పవన్ సాయి పదో తరగతి పాసయ్యాడు. అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతిచెందడంతో నాన్నమ్మ వద్ద వుంటూ..చిన్నాన్న కన్నా సంరక్షణలో పెరుగుతున్నాడు. రిసార్ట్సులో పవన్‌సాయిని అతడి స్నేహితులే చంపేసి వుంటారని బంధువులు అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాకుండా రిసార్ట్సు యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని బంధువులు అచ్యుతాపురం పోలీసు స్టేషన్ ముందు శనివారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు.
ఇదిలావుండగా, రిసార్ట్సు ఇంకా ప్రారంభం కాకుండానే ఈ పార్టీ ఏర్పాటు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అచ్యుతాపురం ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని చెప్పారు. మద్యం ఎక్కువ తాగడం వల్ల నీటిలో మునిగిపోయి ఊపిరి ఆడక మృతి చెందివుండవచ్చునని ఎస్ఐ అనుమానం వ్యక్తం చేశారు. పవన్‌సాయి స్నేహితులను పిలిపించి విచారించామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణను కొనసాగిస్తామని ఎస్ఐ వివరించారు.