ఎగిరిపోయిన సీ ప్లేన్!
ABN , First Publish Date - 2020-11-03T06:19:28+05:30 IST
సీ ప్లేన్. గాలిలో ఎగురుతూ, సముద్రంలో నడిచే విమానం. ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ చేతులమీదుగా గుజరాత్‌లో సబర్మతి నదిలో మూడు రోజుల క్రితం ప్రారంభించారు.
నాలుగేళ్ల క్రితం వుడా అధికారుల ప్రతిపాదన
కమిషనర్‌లు మారగానే ప్రతిపాదనలు బుట్టదాఖలు
ఇప్పుడు విశాఖలో మటుమాయం... విజయవాడలో సాకారం
పర్యాటక మంత్రి ఇక్కడి వారే అయినా దక్కని ప్రాజెక్టు
కృష్ణా నదిలో ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సీ ప్లేన్. గాలిలో ఎగురుతూ, సముద్రంలో నడిచే విమానం. ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ చేతులమీదుగా గుజరాత్‌లో సబర్మతి నదిలో మూడు రోజుల క్రితం ప్రారంభించారు. దేశంలో మొదటి సీ ప్లేన్ ప్రాజెక్టు అదే. అయితే నాలుగేళ్ల క్రితమే విశాఖపట్నంలో సీ ప్లేన్ నడపాలని విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ (వుడా) ప్రతిపాదించింది. నాడు వుడా వైస్ చైర్మన్‌గా వున్న బాబూరావునాయుడు కైలాసగిరిపై స్కై టవర్, బీచ్‌లో సీ ప్లేన్ ప్రాజెక్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఆ తరువాత వుడా...విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)గా మారింది. బసంత్‌కుమార్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో వీటితో పాటు రోప్ కార్ ప్రాజెక్టును కూడా తెర పైకి తెచ్చారు. కైలాసగిరి రోప్‌వే తరహాలో తెన్నేటి పార్క్ నుంచి కింది వరకు రోప్‌కార్ నడపాలని ప్రతిపాదించారు. ఇవన్నీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రాజెక్టులు. ఆ తరువాత కమిషనర్‌గా వచ్చిన కోటేశ్వరరావు వీటి గురించి ఏనాడూ ప్రస్తావించలేదు. ఆ ప్రతిపాదనలు మూలకు చేరాయి. కమిషనర్ మారినప్పుడల్లా వీఎంఆర్‌డీఏ ప్రాధామ్యాలు మారిపోతున్నాయి.
ఏ అధికారి వచ్చినా పర్యాటక నగరమైన విశాఖకు కొత్త ప్రాజెక్టు అందించడానికి ప్రయత్నించడం ఆనవాయితీగా వస్తోంది. బీచ్ రోడ్డులో టీయూ-142, సీ హ్యారియర్ ఆ విధంగా వచ్చినవే. బసంత్‌కుమార్ కమిషనర్‌గా వున్నప్పుడు విశాఖ ఉత్సవ్‌లో హెలీ టూరిజం ఏర్పాటుచేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అసలు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన జరగడం లేదు. పాత వాటిని పూర్తిచేయడం, రాష్ట్ర ప్రభుత్వం అప్పగించే ఆర్థిక బాధ్యతలు నెత్తిన వేసుకోవడమే కనిపిస్తోంది.
మంత్రి ఇక్కడి వారే అయినా...?
రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి విశాఖ జిల్లాకు చెందినవారే అయినప్పటికీ పర్యాటకంగా విశాఖకు కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చే ప్రయత్నాలు పెద్దగా జరగడం లేదు.
మ్యూజియాలకు ఆదరణ లేకపోయినా...!
విశాఖపట్నంలో మ్యూజియాలకు పెద్దగా ఆదరణ లేదు. వాటి వల్ల ఆదాయం కూడా రావడం లేదు. కైలాసగిరిపై ఏర్పాటుచేసిన తెలుగు మ్యూజియం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అక్కడ రివాల్వింగ్ స్టేజ్ పెట్టారు. దానిని నిర్వహణ భారమని తిప్పడం లేదు. అక్కడకు వెళ్లే సందర్శకులు కూడా తక్కువే. ఇప్పుడు వీఎంఆర్‌డీఏ కాపులుప్పాడలో హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటుకు నడుం కట్టింది. దానికి రూ.80 కోట్లు వెచ్చిస్తున్నారు.
ఇప్పటికైనా ప్రయత్నించాలి
విశాఖలో హెలీ టూరిజం, సీ ప్లేన్ వంటి ప్రాజెక్టులకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే విశాఖపట్నం పోర్టు సీ క్రూయిజ్ టెర్మినల్ నిర్మిస్తోంది. వీఎంఆర్‌డీఏ కూడా ఆ దిశగా ప్రయత్నించాల్సి ఉంది. పర్యాటక మంత్రి కూడా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది.
విజయవాడకు సీ ప్లేన్
సీ ప్లేన్ ప్రాజెక్టు కోసం కేంద్రం ప్రతిపాదనలు ఆహ్వానించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి దరఖాస్తు చేశారు. అయితే ఇక్కడి వీఎంఆర్‌డీఏ అధికారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో...విజయవాడ అధికారులు కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద సీ ప్లేన్ నడుపుతామంటూ ముందుకువచ్చారు. అందుకు కేంద్రం ఆమోదించింది. దేశంలోని 14 ప్రాంతాల్లో సీ ప్లేన్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో విజయవాడ ఉంది. విచిత్రం ఏమిటంటే..దాని పేరే ‘సీ ప్లేన్’. అంటే సముద్రంలో ఎగిరేది అని. కానీ విచిత్రంగా వీఎంఆర్‌డీఏ అధికారుల ఉదాశీనత వల్ల సముద్రం వున్న విశాఖ నగరానికి కాకుండా ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజీకి వెళ్లిపోయింది. ఇదీ మన అధికారుల పనితీరు.