అప్పన్న సేవకుల ఆకలి కేకలు!

ABN , First Publish Date - 2020-11-27T06:03:24+05:30 IST

అందరి మొర ఆలకించే సింహాద్రి అప్పన్న తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడా...అని సేవకులు ఎదురుచూస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేవస్థానంలో పనిచేసే సిబ్బందికి సక్రమంగా జీతాలు అందడం లేదు.

అప్పన్న సేవకుల ఆకలి కేకలు!

ఇప్పటికీ చేతికందని సెప్టెంబరు, అక్టోబరు నెలల వేతనాలు

చేతిలో రూ.5 కోట్ల నిధులు

జీతాలు చెల్లించాలని సిబ్బంది వేడుకోలు

అంగీకరించని చైర్‌పర్సన్‌

బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని ఆదేశం

ఆగస్టు మినహా మార్చి నుంచి జూలై వరకూ సగం జీతమే చెల్లింపు 

వారానికి ఒక్కరోజే ఈఓ రాక

ఎవరికీ పట్టని సింహాచలం సమస్యలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అందరి మొర ఆలకించే సింహాద్రి అప్పన్న తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడా...అని సేవకులు ఎదురుచూస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేవస్థానంలో పనిచేసే సిబ్బందికి సక్రమంగా జీతాలు అందడం లేదు. ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల్లో సగం జీతాలే ఇచ్చారు. ఆలయం పూర్తిగా మూసివేయడం వల్ల వారు కూడా గట్టిగా అడగలేకపోయారు. ఆగస్టు నుంచి అందరికీ పూర్తి జీతాలు ఇవ్వాలని అప్పటి దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఆగస్టులో మాత్రమే పూర్తి జీతాలు ఇచ్చారు. సెప్టెంబరు నెల జీతం ఇప్పటివరకూ ఇవ్వలేదు. అక్టోబరు నెలవి కూడా ఇవ్వాల్సి ఉంది. ఇంకో నాలుగు రోజులు ఆగితే నవంబరు కూడా ముగిసి డిసెంబరు వస్తుంది. అంటే మూడు నెలల జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది.


నెలకు వ్యయం రూ.2.3 కోట్లు

దేవస్థానంలో జీతాలు, పెన్షన్లు, సెక్యూరిటీ తదితరాలన్నింటికీ నెలకు రూ.2.3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం చూసుకుంటే ఒక్క హుండీ ద్వారానే నెలకు సగటున రూ.1.3 కోట్లు వస్తుంది. దర్శనం, ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవల రూపేణా వచ్చే ఆదాయం అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇవికాకుండా స్థలాలు, దుకాణాల లీజులు, కల్యాణ మండపాల అద్దెల ద్వారా ఆదాయం వస్తుంది. సాధారణ సమయాల్లో జీతాలకు ఏనాడూ ఇబ్బంది ఎదురుకాలేదు. కరోనా వల్ల ఆలయం మూసివేతతో సమస్య తలెత్తింది. ఇప్పుడు  మూడు నెలల జీతాలు, పెన్షన్ల కోసం రూ.7 కోట్లు, అంతకు ముందు నాలుగు నెలల సగం జీతాల బకాయిలు ఇంకో రూ.4 కోట్లు కలిపి...మొత్తం రూ.11 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు నెల అయ్యేసరికి జీతం అందకపోతే..కుటుంబంలో అనేక సమస్యలు. పెన్షనర్లకు అయితే ఇక చెప్పనక్కర్లేదు. 


రూ.5 కోట్లు వచ్చినా...

ఇటీవల దేవస్థానానికి రూ.5 కోట్ల నిధులు వచ్చాయి. దేవస్థానానికి చెందిన స్థలాన్ని ఏపీ ట్రాన్స్‌కోకు లీజుకు ఇచ్చారు. అందుకుగాను పాక్షిక చెల్లింపుగా వారు రూ.5 కోట్లు ఇచ్చారు. అందులో నుంచి జీతాలు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు. అయితే చైర్‌పర్సన్‌ సంచయిత మాత్రం దీనికి అంగీకరించడం లేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఆ మొత్తం జీతాలకు వినియోగించకూడదని, తాను సూచించిన బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని ఆదేశించారని తెలిసింది. దీనిని ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఒకసారి ఇలాగే రూ.7 కోట్ల నిధులు వస్తే ఉద్యోగుల జీతభత్యాలకు ఉపయోగించారని, ఇప్పుడు కూడా ఆ విధంగానే చేయాలని కోరుతున్నారు. ఫలానా ఆదాయం నుంచే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలనే నిబంధనలు ఏమీ లేవని అంటున్నారు. అయితే చైర్‌పర్సన్‌ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. దీనిపై ట్రస్టుబోర్డులో చర్చిద్దామంటే... సమావేశాలు కూడా నిర్వహించడం లేదు. 


ఈఓ ఇక్కడుండేది వారానికి 3 గంటలే!

అన్నవరం దేవస్థానం ఈఓ త్రినాథరావుకు సెప్టెంబరులో ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అన్నవరంలో ఎక్కువ పనులు వుండడంతో అధిక సమయం ఆయన అక్కడే గడుపుతున్నారు. వారానికి ఒకసారి ఇక్కడకు వస్తున్నారు. ప్రయాణ సమయం ఆరు గంటలు పోతే...ఓ మూడు గంటలు ఆలయంలో ఉంటున్నారు. అప్పుడే అన్ని ఫైళ్లు చూసి వెళుతున్నారు. దాంతో ఇక్కడి సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు.

Read more