ప్రైవేటు టీచర్ల పాట్లు

ABN , First Publish Date - 2020-06-22T09:47:05+05:30 IST

ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందిపై కరోనా ప్రభావం పడింది. ఫీజులు వసూలు కాలేదని చెప్పి అనేక సంస్థలు

ప్రైవేటు టీచర్ల పాట్లు

జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు

మార్చి నెల నుంచి నిలిపివేసిన కొన్ని యాజమాన్యాలు

ఫీజులు వసూలు కాలేదని చెప్పి జనవరి నెల నుంచి ఎగ్గొట్టిన మరికొన్ని యాజమాన్యాలు

పెండింగ్‌ ఫీజులు వసూలు చేస్తే కమీషన్లు ఇస్తామంటున్న ఇంకొన్ని 

కుటుంబ పోషణకు రోజువారీ, ఉపాధి హామీ కూలీలుగా మారుతున్న ఉపాధ్యాయులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) : ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందిపై కరోనా ప్రభావం పడింది. ఫీజులు వసూలు కాలేదని చెప్పి అనేక సంస్థలు జీతాలు చెల్లించకపోవడంతో అంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఉపాధ్యాయులు ఉపాధి హామీ పనులకు వెళుతుండగా, నగర పరిధిలో రోజువారీ కూలీ పనులకు, పెయింటింగ్‌ వర్క్స్‌కు వెళుతున్నట్టు ప్రైవేటు టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ నాయకులు చెబుతున్నారు. అరకొర జీతాలతో  నెట్టుకొస్తున్న తమ జీవితాల్లో కరోనా చీకట్లను మిగిల్చిందని, యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక అద్దెలు, కరెంట్‌ బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.


నాలుగు నెలలు జీతాల్లేవ్‌

జిల్లాలో ప్రైవేటు స్కూల్స్‌, కాలేజీలు సుమారు రెండు వేల వరకు వుంటాయని, అందులో టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కలిసి సుమారు 50 వేల మంది పనిచేస్తున్నారని యూనియన్‌ నాయకులు చెబుతున్నారు. ఇందులో సగం మందికి జనవరి నుంచి యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదని, మరికొన్ని కరోనాను బూచీగా చూపించి మార్చి నెల నుంచి జీతాలను నిలిపివేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా విద్యా సంవత్సరం ముగిసే ముందు విద్యార్థుల తల్లిదండ్రులు మిగిలిన ఫీజులు చెల్లిస్తారని, ఆ విధంగా వసూలు అయిన మొత్తాల నుంచి జనవరి నుంచి మే వరకు జీతాలను కొన్ని సంస్థలు చెల్లిస్తుంటాయని, ఈ ఏడాది కరోనా రావడంతో ఫీజులు పూర్తిస్థాయిలో రాలేదని చెప్పి అనేక సంస్థలు జీతాలు చెల్లించలేదని యూనియన్‌ నాయకులు పేర్కొంటున్నారు.


కొన్ని స్కూల్స్‌ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ పూర్తిస్థాయిలో ఫీజులనువసూలుచేసినా, ఉపాధ్యాయులకు మాత్రం అరకొర వేతనాలనే ఇస్తున్నాయని వారు చెబుతున్నారు. మార్చి నెలకు సంబంధించి యాజమాన్యం సగం జీతం చెల్లించిందని, ఆ తరువాత నుంచి రూపాయి ఇవ్వలేదని గాజువాకలోని  ఓ ప్రైవేటు  స్కూల్‌లో పనిచేసే మహిళా టీచర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల కొంతమంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని, అవి వసూలు చేసి తెచ్చిన ఉపాధ్యాయులకు కమీషన్‌ రూపంలో కొంత చెల్లిస్తామని కొన్ని యాజమాన్యాలు ఉపాధ్యాయులకు టార్గెట్లు కూడా విధించాయని అక్కయ్యపాలేనికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు తెలిపారు. నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఇచ్చే అరకొర జీతాలు పూర్తిగా నిలిపేయడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


ఆదుకోకుంటే ఆత్మహత్యలే: కాళ్ల లోకనాథం, ప్రైవేటు టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌, విశాఖ జిల్లా అధ్యక్షుడు

కరోనాతో స్కూల్స్‌ మూతపడడంతో యాజమాన్యాలు టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి జీతాలు చెల్లించడం మానేశాయి. కొన్ని విద్యా సంస్థలు మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు చెల్లిస్తుంటాయి. కొన్ని యాజమాన్యాలు జనవరి నుంచి మార్చి నెల వరకు జీతాలను ఒకేసారి ఏప్రిల్‌లో చెల్లిస్తుంటాయి. సరిగ్గా మార్చి నెలలోనే కరోనా రావడం, లౌక్‌డౌన్‌ ప్రకటించడంతో ఫీజులు వసూలు కాలేదని చెప్పి జీతాలు చెల్లించడం మానేశాయి. అంటే సుమారు ఆరు నెలలుగా కొన్ని యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం లేదు. మరికొన్ని యాజమాన్యాలు ఫీజులు వసూలైనా కాలేదని చెబుతూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్స్‌, కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే ఉపాధ్యాయుల ఆత్మహత్యలను చూడాల్సి వస్తుంది. 


ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం: మడ్డు జయరాం, యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు

కరోనా వల్ల నెలల తరబడి జీతాల్లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చేసేందుకు ఏ పని దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. నగర పరిధిలో పెయింటింగ్‌, ప్లంబింగ్‌ వర్కులు చేసేందుకు వెళుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆరు వేల నుంచి రూ.15 వేలలోపు వేతనాలతో పనిచేసేవారు వేలాది మంది ఉన్నారు. నెలల తరబడి జీతాలు లేకపోవడం వారంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తామంతా ఒకే కుటుంబమని చెప్పే యాజమాన్యాలు ఇటువంటి పరిస్థితుల్లో ఆదుకునేందుకు ముందుకురావాలి.


Updated Date - 2020-06-22T09:47:05+05:30 IST