మంచి పోలీసింగ్‌ అందిస్తా

ABN , First Publish Date - 2020-06-16T11:28:44+05:30 IST

జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు మంచి పోలీసింగ్‌ అందిస్తానని రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం

మంచి పోలీసింగ్‌ అందిస్తా

శాంతిభద్రతలు కాపాడుతా

రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు

అట్టాడ బాబూజీ నుంచి బాధ్యతల స్వీకారం

ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా ఉంచుతాం 

గిరిజనులు మాతోనే ఉన్నారు

గంజాయి సాగు, రవాణా, సారాపై మరింత నిఘా


విశాఖపట్నం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు మంచి పోలీసింగ్‌ అందిస్తానని రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అట్టాడ బాబూజీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, ఏజెన్సీలో గిరిజనులు అభివృద్ధి కోరుకుంటున్నారన్నారని, ఆదివాసీలు...మావోయిస్టులతో కాకుండా పోలీసులతోనే వున్నారని అన్నారు. ఏజెన్సీవాసుల సమస్యలు పరిష్కరిస్తూ, వారికి అన్నిరకాల సేవలు అందిస్తూ మరింత స్నేహపూర్వకంగా ఉంటామన్నారు. గంజాయి సాగు, రవాణాను అరికట్టడానికి మరింత నిఘా పెడతామని చెప్పారు. నాటుసారా అదుపు కోసం ఒక విభాగం పనిచేస్తూ విస్తృతంగా దాడులు చేస్తున్నదని, దీనిపై మరింత దృష్టి సారిస్తామన్నారు. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా ఉంచుతామన్నారు. శాంతి భద్రతలు, మావోయుస్టు కార్యకలాపాలు, గంజాయి సాగు, రవాణాకు సంబంధించి ప్రతి అంశమూ ముఖ్యమేనని, అందువల్ల ఏదో ఒక్కదానిపైనే ప్రత్యేకించి ఫోకస్‌ పెట్టడం వుండదని ఎస్పీ స్పష్టంచేశారు.


సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని పెండింగ్‌ కేసులు పరిష్కరిస్తానన్నారు. అంతకుముందు కార్యాలయానికి వచ్చిన కృష్ణారావుకు ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌, చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, నర్సీపట్నం ఏఎస్పీ ప్రేమ్‌ తహీర్‌ సిన్హా, అడిషినల్‌ ఎస్పీ బి.అచ్యుతరావు, ఇతర అధికారులు రాజ్‌కమల్‌, ఎస్‌.అప్పలనాయుడు తదితరులు స్వాగతం పలికారు. పలువురు పోలీస్‌ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా బొడ్డేపల్లి కృష్ణారావు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా, రేంజ్‌ డీఐజీ వీఎల్‌కే రంగారావు, కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, జిల్లా జడ్జి భానుమతిలను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2020-06-16T11:28:44+05:30 IST