లా అండ్ ఆర్డర్‌కు రోడ్ సేఫ్టీ పెట్రోలింగ్ బాధ్యత
ABN , First Publish Date - 2020-11-04T03:05:23+05:30 IST
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు సేఫ్టీ పెట్రోలింగ్ బాధ్యతలను శాంతిభద్రతల విభాగానికి అప్పగించాలని సీపీ మనీష్‌కుమార్ సిన్హా నిర్ణయించారు.
సెట్ కాన్ఫరెన్స్‌లో సీపీ మనీష్‌కుమార్ సిన్హా
విశాఖపట్నం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు సేఫ్టీ పెట్రోలింగ్ బాధ్యతలను శాంతిభద్రతల విభాగానికి అప్పగించాలని సీపీ మనీష్‌కుమార్ సిన్హా నిర్ణయించారు. ఈమేరకు మంగళవారం నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో జాతీయ రహదారిని కలిగివుండే పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ రోడ్డు సేఫ్టీ పెట్రోలింగ్ వాహనాలను కొంతకాలం కిందట సమకూర్చారు. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో వాహనాన్ని ఇచ్చి, ఆ వాహనంలో ఒకో షిప్టులో ఒక హెడ్‌కానిస్టేబుల్, ఒక డ్రైవర్, ఒక కానిస్టేబుల్ లేదా హోంగార్డు తమ స్టేషన్ పరిధి ఉన్నంతవరకూ జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్‌లు జరిగినా, ప్రమాదాలు జరిగినా తక్షణం అక్కడకు చేరుకుని ట్రాఫిక్ పునరుద్ధరణ, ఇతర సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొన్నాళ్ల కిందట జాతీయరహదారిపై డాక్టర్ సుధాకర్ ఉదంతంలో ట్రాఫిక్ పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో పోలీస్‌శాఖను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులను రోడ్డు సేఫ్టీ పెట్రోలింగ్ నుంచి తప్పించి లా అండ్ ఆర్డర్‌కు అప్పగించాలని సీపీ నిర్ణయించారు. ఆ వాహనంలో ఒక్కో షిఫ్టులో లా అండ్ ఆర్డర్ నుంచి ఒక హెడ్‌కానిస్టేబుల్ ఇన్‌చార్జిగా ఉంటూ ఏఆర్‌కు చెందిన డ్రైవర్, కానిస్టేబుల్‌ను విధులకు కేటాయిస్తారు. దీనివల్ల ట్రాఫిక్ సిబ్బందిని ఇతర విధులకు వినియోగించుకునేందుకు వీలు కలగడంతోపాటు ఏఆర్ సిబ్బంది సేవలను వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నది సీపీ భావనగా పోలీసులు పేర్కొంటున్నారు.