స్వేదం చిందింది.. ‘మార్గం’ దొరికింది!

ABN , First Publish Date - 2020-10-28T16:26:02+05:30 IST

గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు దారి లేదు..

స్వేదం చిందింది.. ‘మార్గం’ దొరికింది!

శ్రమదానంతో రహదారి నిర్మించిన గిరిజనం 


పాడేరురూరల్‌: గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు దారి లేదు. రహదారి ఏర్పాటు చేయాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. అత్యవసర స్థితిలోనూ ఎదురవుతున్న అవస్థలను అధిగమించేందుకు గ్రామస్థులం తా ఏకమయ్యారు. శ్రమదానంతో రోడ్డు నిర్మించారు. మండలంలోని సలుగు పంచాయతీ బిడారిగరువు గ్రామంలో 41 కుటుంబాలకు చెం దిన సుమారు 200 మంది నివశిస్తున్నారు. గ్రామానికి రహదారి లేక అత్యవసర వైద్యసేవలకూ నోచుకోలేకపోతున్నామని, ప్రభుత్వ పథకాలు చేరువకావడం లేదని అధికారులకు ఎన్ని వినతులు అందిం చినా ఫలితం లేకపోవడంతో గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో రహదారి నిర్మాణం చేసుకుంటున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత రహదారిని నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని కోరుతున్నారు.


కలిసి కదిలి...గోతులు పూడ్చి  

పాడేరు/జి.మాడుగుల: ఇటీవలి వర్షాలకు జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ గంగాదేవీగుడి గ్రామానికి వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు  గ్రామానికి చెందిన యువకులు నిర్ణయించారు. మట్టి రోడ్డుకు మరమ్మతులు చేసి, ఆటోలు, బైక్‌లు రాకపోకలు సాగించేందుకు అనువుగా మార్చా రు. శ్రమదానం చేసిన యువతను గ్రామస్థులు అభినందించారు.


పసిని వాసులకు తప్పని డోలీ మోత

అనంతగిరి: వర్షాలు తగ్గి వారం గడుస్తున్నా మండలంలోని రొంపల్లి పంచాయతీ పసిని వాసులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. తాటిపూడి జలాశయం వెనుక భాగంలో ఉన్న గ్రామస్థులు చిలకలగెడ్డ పంచాయతీ దాసరితోట వద్ద  గోస్తనీ నది దాటి రావాలి. వర్షాలకు ఉప్పొంగిన ప్రవాహం తగ్గకపోవడంతో కొండల్లో సుమారు 7 కిలోమీటర్లు నడిచి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం పనసలపాడుకు చేరుకుని, అక్కడి నుంచి వాహనాలలో ఎస్‌.కోట, అనంతగిరి  చేరుకోవాలి. అదే తరహాలో గర్భిణులను ప్రసవాలకు సైతం డోలీ కట్టుకుని మోసుకుంటూ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. మంగళవారం గ్రామానికి చెందిన జన్ని రాములమ్మను ప్రసవం కోసం డోలీ కట్టి పనసలపాడు మీదుగా ఎస్‌.కోట సీహెచ్‌సీకి ఇదిగో ఇలా తరలించారు. 

Updated Date - 2020-10-28T16:26:02+05:30 IST