తాత్కాలిక రైతుబజార్లపై ఆధిపత్యం కోసం.. రెండు ప్రభుత్వ శాఖల మధ్య పోరు

ABN , First Publish Date - 2020-03-27T16:11:20+05:30 IST

నగరంలోని మైదానాల్లో ఏర్పాటుచేస్తున్న తాత్కాలిక రైతుబజార్లపై..

తాత్కాలిక రైతుబజార్లపై ఆధిపత్యం కోసం.. రెండు ప్రభుత్వ శాఖల మధ్య పోరు

రెవెన్యూ వర్సెస్‌ పోలీస్‌

కొత్త రైతుబజార్లపై ఆధిపత్యానికి పోరు

పెదవాల్తేరు రైతుబజార్‌ అటెండర్‌పై లాఠీ ఝళిపించిన పోలీస్‌ అధికారి

ఎస్టేట్‌ అధికారి, సహాయకుడి అరెస్టు

జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లిన మార్కెటింగ్‌ శాఖ ఏడీ 

మంత్రి సమక్షంలో పంచాయితీ

ఇలాగైతే సిబ్బంది పనిచేయలేరని ఆందోళన

అర్బన్‌ మహిళా తహసీల్దార్‌తోను వివాదం

తమ అధికారులకు తహసీల్దార్‌ వార్నింగ్‌ ఇచ్చారంటూ ముత్తంశెట్టికి ఫిర్యాదు

కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): నగరంలోని మైదానాల్లో ఏర్పాటుచేస్తున్న తాత్కాలిక రైతుబజార్లపై ఆధిపత్యం కోసం రెండు ప్రభుత్వ శాఖల మధ్య పోరు నడుస్తోంది. ప్రభుత్వం అన్నీ తమనే చూసుకోవాలని చెప్పిందని పోలీసు ఉన్నతాధికారులు అంటుండగా, అక్కడ వ్యవహారాలు పర్యవేక్షించాల్సింది తామేనంటూ రెవెన్యూ అధికారులు, మార్కెటింగ్‌ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తలెత్తిన వివాదానికి సంబంధించి పెదవాల్తేరు రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి, అక్కడి అటెండర్‌ను బుధవారం రాత్రంతా మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. ఇలాగైతే రైతుబజార్ల సిబ్బంది పనిచేయలేరని మార్కెటింగ్‌ శాఖ ఏడీ కాళేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేసేంత వరకు వెళ్లింది. 


పెదవాల్తేరు రైతుబజార్‌కు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రైతుబజార్‌ను ఏయూ మైదానంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దానికి పోలీసుల సహకారం తీసుకున్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించే డీసీపీ రంగారెడ్డి బుధవారం ఉదయం ఐదు గంటలకే మైదానానికి చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కొంత మంది గుమిగూడడంతో వారిపై లాఠీ ఝళిపించారు. ఆ క్రమంలో ఆ రైతుబజార్‌ అటెండర్‌ నరేశ్‌ను కూడా రెండు దెబ్బలు వేశారు. దాంతో అతను.. తాను బజార్‌ స్టాఫ్‌ అని, కొట్టవద్దని కోరాడు. అక్కడి నుంచి ‘ఈగో’ సమస్య మొదలైంది. ‘ఏం స్టాఫ్‌ అయితే కొట్టకూడదా?’ అంటూ మరో దెబ్బ వేశారు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావు? అంటూ ప్రశ్నించారు.


‘రైతులను పెదవాల్తేరు బజార్‌ నుంచి ఏయూ మైదానానికి తరలించడానికి వెళ్లానని’ చెప్పగా...‘ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో...’ అంటూ హూంకరించారు. ‘ఇక్కడ రైతులు ఎవరు, ఎక్కడ దుకాణం పెట్టుకోవాలి? రేట్లు ఎంతో చెప్పేసి వెళతానంటే’ ‘‘నువ్వేమీ చెప్పనక్కర్లేదు...ముందు ఇక్కడి నుంచి వెళ్లు’ అంటూ డీసీపీ గద్దించారు. దాంతో ఆ అసిస్టెంట్‌...‘అదేంటి సార్‌, మాకు రక్షణగా వుంటారని మిమ్మల్ని పిలిస్తే...మమ్మల్నే కొడుతున్నారు?’ అంటూ ప్రశ్నించాడు. దాంతో డీసీపీ...‘అంటే...నువ్వు పిలిస్తే మేము రక్షణకు రావాలా?’ అంటూ ఇంకోటి వేసి పంపించేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి రైతుబజార్‌ ఈఓ జగదీశ్‌ అక్కడకు వెళ్లి డీసీపీని కలిశారు.


‘ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావు’ అంటూ ఆయన్ను డీసీపీ ప్రశ్నించారు. హోల్‌సేల్‌ బజార్‌కు ధరలు నిర్ణయించే డ్యూటీకి వెళ్లానని చెప్పగా, ఇంత లేటుగా వస్తావా?...కస్సుబుస్సులాడారు. తరువాత ‘మీరిద్దరూ స్టేషన్‌కు రండి...’ అంటూ పంపించేశారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ఈఓ జగదీశ్‌ను స్టేషన్‌కు పిలిచి లోపల వేసేశారు. అక్కడికి వచ్చిన ప్రతి పోలీస్‌ అధికారి రెండు దెబ్బలు వేసేసి వెళ్లిపోయారు. ‘రైతుబజార్‌ మీ అబ్బ సొమ్ము రా! మేము వస్తే క్యూలో నిల్చోమంటారా?...’ అంటూ ఎవరికి నచ్చినట్టు వారు వ్యాఖ్యానాలు చేశారు. రాత్రి పది గంటలకు అసిస్టెంట్‌ నరేశ్‌ను కంచరపాలెంలో ఇంటి నుంచి తీసుకొచ్చి స్టేషన్‌లో వేశారు. ఈ సంగతి సిబ్బంది ద్వారా తెలుసుకున్న మార్కెటింగ్‌ శాఖ ఏడీ కాళేశ్వరరావు విషయాన్ని జేసీ శివశంకర్‌ దృష్టికి గురువారం ఉదయం తీసుకువెళ్లారు.

 

అర్బన్‌ తహసీల్దార్‌తో మరో వివాదం

ఎంవీపీ కాలనీ రైతుబజార్‌కు ప్రత్యామ్నాయంగా సమీపంలోనే ఏఎస్‌ రాజా మైదానంలో మరో బజార్‌ను బుధవారం ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం 8 గంటలకు అక్కడ రద్దీ బాగా ఎక్కువగా ఉంది. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అర్బన్‌ తహసీల్దార్‌ జ్ఞానవేణి లోపల జనాలు ఎక్కువగా వున్నారని, కాసేపు గేట్లు మూసేయాలని అక్కడ సీఐని కోరారు. దానికి ఆయన కుదరదని తేల్చిచెప్పారు. తహసీల్దారుగా ఏమీ జరగకుండా చూసుకోవలసిన బాధ్యత వుందని, మండల మేజిస్ట్రేట్‌గా చెబుతున్నానని, గేట్లు వేయాలని కోరగా, పోలీసు అధికారులు నిరాకరించారు.


...ఈ రెండు విషయాలు జేసీ శివశంకర్‌ అక్కడకు ఆకస్మిక తనిఖీకి వచ్చిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు వివరించారు. అక్కడే వున్న డీసీపీ రంగారెడ్డికి కూడా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, కొంచెం సర్దుకోవాలని సూచించారు. దానికి డీసీపీ రంగారెడ్డి మాట్లాడుతూ... ఎవరికైనా ముందు క్రమశిక్షణ అవసరమని వ్యాఖ్యానించారు. ‘ఐ విల్‌ సీ యువర్‌ ఎండ్‌’ అని తమ అధికారులకు తహసీల్దార్‌ వార్నింగ్‌ ఇచ్చారంటూ ప్రత్యారోపణ చేశారు. దానిని వెంటనే జ్ఞానవేణి ఖండించారు. అక్కడే వున్న మార్కెటింగ్‌ ఏడీ కాళేశ్వరరావు కల్పించుకొని... ఇలా అరెస్టులు చేస్తే... పని చేయడానికి రాలేమని రైతుబజార్ల సిబ్బంది చెబుతున్నారని, దీనివల్ల ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.


ఇంతలో మీడియా ప్రతినిధులు అక్కడకు చేరడంతో ఈ విషయాలపై వేరే దగ్గర చర్చిద్దామని జేసీ ఆ సంభాషణ ముగించారు. అయితే ఈలోగా రైతుబజార్ల సిబ్బందిపై పోలీస్‌ అధికారి మరో ఆరోపణ చేశారు. ఉల్లిపాయలు కిలో రూ.26 అయితే రూ.50 చొప్పున అమ్ముతున్నారంటూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వెంటనే ఆయన స్పందించి ఉల్లి అమ్ముతున్న కౌంటర్‌ దగ్గరకు వెళ్లి...రేటు ఎంత అని ప్రశ్నించారు.


అక్కడి డ్వాక్రా మహిళ కిలో రూ.26 అని చెప్పడంతో మంత్రి, జేసీ అంతా వెనక్కి వచ్చేశారు. ఈ ఘటన తరువాత ఏమి జరిగిందో తెలియదు గానీ పోలీస్‌ స్టేషన్‌లో వున్న ఈఓ జగదీశ్‌, అసిస్టెంట్‌ నరేశ్‌లను 11 గంటల సమయంలో విడిచిపెట్టారు. అయితే వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఏమని కేసు పెట్టారో కూడా తెలియదని మార్కెటింగ్‌ శాఖాధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-03-27T16:11:20+05:30 IST