పరిమితుల మేరకే పరిశ్రమల్లో ర సాయనాలు

ABN , First Publish Date - 2020-06-21T09:11:10+05:30 IST

జిల్లాలోని పరిశ్రమలన్నీ ప్రభుత్వం అనుమతించిన మేరకు మాత్రమే రసాయనాలు నిల్వ చేయాలని, అంతకు మించి

పరిమితుల మేరకే పరిశ్రమల్లో ర సాయనాలు

మూడు నెలలకోసారి మాక్‌డ్రిల్‌ 

కలెక్టర్‌ వినయ్‌చంద్‌


విశాఖపట్నం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పరిశ్రమలన్నీ ప్రభుత్వం అనుమతించిన మేరకు మాత్రమే రసాయనాలు నిల్వ చేయాలని, అంతకు మించి చేయకూడదని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ఆయన పరిశ్రమల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని పరిశ్రమలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా పరిశ్రమల్లో ముడి పదార్థాలు, ఉత్పత్తులు, వాటి వల్ల జరిగే ప్రమాదాలు, నివారణకు తీసుకోవలసిన చర్యలపై సిబ్బందికి అందరికీ అవగాహన కల్పించాలన్నారు.


అన్నీ తెలిసిన సీనియర్‌ అధికారి ప్రతి పరిశ్రమలో ఉండాలని స్పష్టంచేశారు. హెచ్‌పీసీఎల్‌, పాలిమర్స్‌, స్టీల్‌ప్లాంట్‌ తదితర పరిశ్రమలతోపాటు ప్రైవేటు పరిశ్రమలు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా మాక్‌డ్రిల్‌ నిర్వహించాలన్నారు. జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ నుంచి ఎటువంటి సహకారం కావాలో తెలియజేయాలని కోరారు. జిల్లాలో ప్రమాదకరమైన పరిశ్రమలు 20 వరకు ఉన్నాయని, వాటితో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి పరిశ్రమలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పనిసరిగా జరగాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ సృజన, ఫ్యాక్టరీసీ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, అగ్నిమాపక శాఖాధికారులు, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-21T09:11:10+05:30 IST