రిజిస్ట్రేషన్లు లాక్‌..ఆదాయం డౌన్‌

ABN , First Publish Date - 2020-05-18T09:06:20+05:30 IST

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో విశాఖపట్నం జిల్లా ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా

రిజిస్ట్రేషన్లు లాక్‌..ఆదాయం డౌన్‌

2019-20లో 72.91 శాతమే లక్ష్యసాధన

లక్ష్యం రూ.1,136.5 కోట్లు.... రూ.828.67 కోట్ల వసూళ్లు

విశాఖ సిటీలో రూ.826.94 కోట్లకుగాను రూ.595.57 కోట్లు...

గ్రామీణంలో రూ.309.56 కోట్లకుగాను రూ.233.10 కోట్ల ఆదాయం

ఏప్రిల్‌లో జీరో... మేలో అంతంత మాత్రమే!


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో విశాఖపట్నం జిల్లా ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ఆఖరులో ముమ్మరంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్లు... కరోనా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో నిలిచిపోయాయి. దీంతో ఆదాయం తగ్గిపోయి, లక్ష్యానికి దూరంగా నిలిచింది. తరువాత లాక్‌డౌన్‌ కొనసాగంతో ప్రస్తుత ఆర్థిక సంవ్సతరం(2020-21)లో ఏప్రిల్‌ మొత్తం రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు మూతపడ్డాయి. ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. మే నెలలో గత వారం రోజుల నుంచి కార్యాలయాలు తెరుస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఒకరి తరువాత మరొకరిని మాత్రమే లోపలికి పిలుస్తూ రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి. అయినప్పటికీ ప్రధాన కార్యాలయాల్లో రోజుకు పదికి మించి రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. అంతే కాకుండా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు ప్రజలు రాకపోకలు సాగించే అవకాశం లేకపోవడం వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తే తప్ప ఆదాయం పుంజుకోదని అధికారవర్గాలు భావిస్తున్నాయి.


ఆదాయ లక్ష్యంలో 28.09 శాతం లోటు

గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ జిల్లాకు రూ.1,136.5 కోట్ల ఆదాయం లక్ష్యాన్ని ఉన్నతాధికారులు విధించారు. వీటిలో విశాఖ సిటీలోని ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రూ.826.94 కోట్లు లక్ష్యం ఇవ్వగా రూ.595.57 కోట్లు(72.02 శాతం) మాత్రమే వచ్చింది. అనకాపల్లి రిజిస్ర్టేషన్‌ కార్యాలయం పరిధిలోని 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు  రూ.309.56 కోట్లు లక్ష్యం ఇవ్వగా, రూ.233.10 కోట్లు(75.30 శాతం) మాత్రమే సాధించారు. జిల్లా మొత్తంగా చూసుకుంటే రూ.1,011.49 కోట్లకుగాను రూ.828.67 కోట్లు(72.91)శాతం మాత్రమే వసూలైంది. 

Updated Date - 2020-05-18T09:06:20+05:30 IST