తగ్గిన రోడ్డు ప్రమాదాలు, చోరీలు

ABN , First Publish Date - 2020-12-29T06:33:35+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి నెలల తరబడి లాక్‌డౌన్‌ విధించడంతో ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, చోరీలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు బాగా తగ్గాయని రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు, చోరీలు
మాట్లాడుతున్న రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు  కూడా....

 హత్యలు సైతం తగ్గుదల

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడమే కారణం

భారీగా కొవిడ్‌ ఉల్లంఘన కేసులు

రెట్టింపు మొత్తంలో గంజాయి పట్టివేత

ఏజెన్సీలో తగ్గుతున్న మావోల ప్రాభవం

రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు

 పోలీసు శాఖ వార్షిక నివేదిక విడుదల


విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి నెలల తరబడి లాక్‌డౌన్‌ విధించడంతో ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, చోరీలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు బాగా తగ్గాయని రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం రూరల్‌ పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో 2020కి సంబంధించి పోలీసు శాఖ వార్షిక నివేదికలోని పలు అంశాల గురించి వివరించారు. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కేసులు భారీగా నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యిందని చెప్పారు. గత ఏడాది అన్ని రకాల కేసులు 6,982 నమోదవ్వగా, ఈ ఏడాది 12,874 కేసులు నమోదయ్యాయని, వీటిలో కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కేసులు 8,235 వున్నాయని తెలిపారు. వీటిని మినహాయిస్తే గత ఏడాది కంటే 2,343 కేసులు తక్కువ నమోదైనట్టు చెప్పారు.


సగానికిపైగా తగ్గిన ఇళ్లల్లో దొంగతనాలు

లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇళ్లల్లో దొంగతనాలు గత ఏడాది కంటే 52 శాతం తగ్గాయన్నారు. 2019లో 190 కేసులు నమోదవ్వగా, 2020లో 91 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. వివిధ చోరీ కేసులకు సంబంధించి గత ఏడాది రూ.2,62,53,486 విలువగల సొత్తు అపహరణకు గురికాగా ఈ ఏడాది రూ.1,69,68,220 విలువ గల ఆస్తి చోరీ అయ్యిందన్నారు.   


13 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు

లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డు ప్రమాదాలు గత ఏడాదితో పోలిస్తే 13 శాతం తగ్గాయన్నారు. 2019లో 349 రోడ్డు ప్రమాదాల్లో 370 మంది మృతిచెందగా, ఈ ఏడాది 292 ప్రమాదాల్లో 302 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. చిన్నపాటి రోడ్డు ప్రమాదాల విషయానికివస్తే గత ఏడాది 570 ఘటనల్లో 944 మంది గాయపడ్డారని, ఈ సంవత్సరం 510 ఘటనల్లో 739 మంది గాయపడ్డారన్నారు. 


పది శాతానికి తగ్గిన డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

గత ఏడాది డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు 5,188 నమోదయ్యాయని, ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా 536 కేసులు మాత్రమే నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. అతివేగంగా వాహనాలు నడిపినందుకు ఈ ఏడాది 1,281 మందిపై కేసులు నమోదుచేయగా, గత ఏడాది 743 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 


40 శాతం తగ్గిన హత్యలు

గత ఏడాది 52 మంది హత్యకు గురికాగా ఈ ఏడాది 30 మంది హత్యకు గురయ్యారన్నారు. వీటిలో మావోయిస్టులు హత్య చేసిన కేసులు తప్ప మిగిలిన కేసులను పోలీసులు ఛేదించారన్నారు. 


82 శాతం పెరిగిన గంజాయి స్వాధీనం

గత ఏడాదితో పోలిస్తే 82 శాతం అధికంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 2019లో 23,192 కిలోల గంజాయి పట్టుకోగా, ఈ ఏడాది 42,343 కిలోల గంజాయి పట్టుకున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి 243 కేసులు నమోదు చేశామన్నారు.  

మహిళలపై దాడులకు సంబంధించి 459 నమోదయ్యాయని, వీటిల్లో గృహహింస కేసులు 146 ఉన్నాయని ఎస్పీ తెలిపారు. జూదానికి సంబంధించి 786 దాడులు నిర్వహించి, 3,519 మందిని అరెస్టు చేసి రూ.68,45,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 77 కేసులు నమోదుకాగా 53 శాతం కేసులకు సంబంధించి నిర్ణీత రెండు నెలల సమయంలో ఛార్జిషీటు దాఖలు చేశామన్నారు. అనకాపల్లిలో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌కు 468 ఫిర్యాదులు రాగా 422 కేసుల్లో కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించామన్నారు. ఐదు పర్యాయాలు లోక్‌అదాలత్‌ నిర్వహించి 3,226 కేసులు పరిష్కరించామన్నారు. నాటుసారాకు సంబంధించి 1,959 కేసులు నమోదుచేసి 1,152 మందిని అరెస్టు చేశామని, 136 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. 


ఏజెన్సీలో తగ్గుతున్న మావోల ప్రాభవం

ఏజెన్సీలో మావోయిస్టుల ప్రాభవం తగ్గుతున్నదని, ఒడిశా సరిహద్దులోని కొన్ని గ్రామాల్లో మాత్రమే వారి కార్యకలాపాలు వున్నాయని ఎస్పీ చెప్పారు. గతంతో పోల్చితే మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ తగ్గిందని, దీంతో అసహనంతో వున్న మావోయిస్టులు....పోలీస్‌ ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను హత్య చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మూడుసార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని, 27 కేసులు నమోదు చేశామని, మావోయిస్టులెవరూ లొంగిపోలేదని చెప్పారు. 14 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని, ఏడుగురు మావోయిస్టులు, 15 మంది మిలీషియా సభ్యులను అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌, ఓఎస్డీ సతీశ్‌కుమార్‌, నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌సిన్హా, డీఎస్పీలు ఎస్‌.అప్పలనాయుడు, ప్రవీణ్‌కుమార్‌, పి.శ్రీనివాసరావు, ఎం.మహేశ్వరరావు, శాంతకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T06:33:35+05:30 IST