‘రెడ్‌’సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-12-15T06:25:21+05:30 IST

విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధికి రైల్వే నుంచి పెద్దగా సహకారం అందడం లేదు. కొత్త సౌకర్యాలు సమకూరడం లేదు సరి కదా...ఉన్నవి కూడా పూర్తిగా అందుబాటులోకి తేవడం లేదు.

‘రెడ్‌’సిగ్నల్‌

పర్యాటక అభివృద్ధికి సహకరించని రైల్వే

కొత్తవి రావు...ఉన్నవి నడవవు!!

డిమాండ్‌ ఉన్నా అరకు-కిరండోల్‌ రైలుకు అదనపు బోగీలు జత చేయడంలో జాప్యం

ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క విస్టాడోమ్‌ కోచ్‌ కూడా నిలిపివేత

బొర్రాలో స్టాప్‌ ఎత్తివేత

పర్యాటకుల అసంతృప్తి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధికి రైల్వే నుంచి పెద్దగా సహకారం అందడం లేదు. కొత్త సౌకర్యాలు సమకూరడం లేదు సరి కదా...ఉన్నవి కూడా పూర్తిగా అందుబాటులోకి తేవడం లేదు. జిల్లాలో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అరకులోయ అన్నింటికంటే ముందుంటుంది. సీజన్‌, వారాంతాల్లో వేలాది మంది అరకులోయ వెళుతుంటారు. సరైన రైలు సౌకర్యం లేకపోవడం వల్ల అత్యధికులు ప్రస్తుతం రోడ్డు మార్గాన వెళుతున్నారు. విశాఖపట్నం-కిరండోల్‌ మధ్య నడిచే రైలు రోజుకు ఒక్కసారే నడుస్తుంది. దీనికి విపరీతమైన డిమాండ్‌. నిత్యం కిక్కిరిసి ఉంటుంది. ప్రయాణికులు ఎక్కువగా వుండే మార్గంలో రైళ్లకు అదనపు బోగీలు సమకూర్చడం ఆనవాయితీ. రైల్వేకు లాభదాయకం కూడా. అయితే కిరండోల్‌ రైలుకు మాత్రం అదనపు బోగీలు పెట్టడం లేదు. పర్యాటక శాఖాధికారులు కొన్ని కోచ్‌లు గానీ, కొన్ని సీట్లు గానీ తమకు కేటాయిస్తే...ప్రయాణికులను ప్యాకేజీల ద్వారా తీసుకువెళతామని, రైల్వేకి గ్యారంటీ ఆదాయం ఇస్తామని, అవసరమైతే ఎంఓయూ కూడా చేస్తామని రైల్వే అధికారులను సంప్రతించారు. దానికీ వారి నుంచి ప్రతిస్పందన లేదు. 


ఏదీ విస్టాడోమ్‌ కోచ్‌?

అనేక ప్రతిపాదనలు చేసిన మీదట మూడేళ్ల క్రితం రైల్వే శాఖ విశాఖపట్నానికి విస్టాడోమ్‌ కోచ్‌ (అద్దాల పెట్టె)ని మంజూరుచేసింది. దీనిని విశాఖపట్నం-కిరోండల్‌ రైలుకు జత చేశారు. 2017 ఏప్రిల్‌ నెలలో ప్రారంభించారు. దీనికి అన్ని వైపులా అద్దాలు ఉంటాయి. బయట దృశ్యాలన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి. సీట్లు కూడా 360 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిరుగుతాయి. అరకు ప్రయాణంలో ఘాట్‌ రోడ్డు, అందమైన లోయలు, గుహలు (టన్నెల్స్‌) చాలా ఆహ్లాదం కలిగిస్తాయి. విస్టాడోమ్‌ కోచ్‌ ద్వారా వాటిని స్పష్టంగా చూసే అవకాశం వుండడంతో దీనికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. టిక్కెట్‌ ధర కూడా బాగా ఎక్కువ. అదే రైలులో అన్‌రిజర్వ్‌డ్‌ బోగీలో ప్రయాణిస్తే విశాఖ నుంచి అరకు (139 కి.మీ...) టిక్కెట్‌ ఖరీదు రూ.75. అదే విస్టాడోమ్‌ కోచ్‌కు యితే రూ.750. అంటే పది రెట్లు ఎక్కువ. అయినా ఒకే కోచ్‌ కావడం, అందులో కేవలం 40 సీట్లు మాత్రమే వుండడంతో రెండు నెలల ముందే సీట్లు నిండిపోయేవి. దాంతో మరిన్ని విస్టాడోమ్‌లు కావాలని ఈ ప్రాంత ప్రతినిధులు లేఖలు రాశారు. నాటి విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అదనంగా మరో ఐదు కోచ్‌లు కావాలని కోరారు. గత ఏడాది సెప్టెంబరులో విశాఖ-విజయవాడ డబుల్‌ డెక్కర్‌ రైలు ప్రారంభించడానికి వచ్చిన రైల్వే మంత్రి...అదనపు విస్టాడోమ్‌ కోచ్‌లు ఇస్తామని, తయారీలో వున్నాయని చెప్పారు. ఏడాది అయింది. ఈలోగా కరోనా వచ్చింది. దాంతో వాటి ఊసే లేకుండా పోయింది. 


18 నుంచి మళ్లీ మొదలు

కరోనా నేపథ్యంలో రైళ్లన్నీ రద్దయిపోయాయి. ఒక్కొక్క దాన్ని ప్రత్యేక రైలు పేరుతో పునరుద్ధరిస్తున్నారు. ఇది పర్యాటక సీజన్‌. అరకుకు ఎక్కువ మంది వెళతారు. ఆదివారం ఒక్కరోజే బొర్రా గుహలను ఏడెనిమిది వేల మంది సందర్శించారు. ఈ నేపథ్యంలో అరకు రైలు ఎంత అవసరమో తెలుస్తోంది. రైల్వే అధికారులు ఎట్టకేలకు స్పందించి ఈ నెల 18 నుంచి విశాఖ-కిరండోల్‌ రైలును పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే అందులో విస్టాడోమ్‌ కోచ్‌ లేకపోవడం గమనార్హం. దీనిపై రైల్వే అధికారులను ప్రశ్నిస్తే..ఆ కోచ్‌ను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం కష్టమని, అందుకే నడపడం లేదని సమాధానమిచ్చారు.


బొర్రాలో స్టాప్‌ ఏదీ?

కిరండోల్‌ రైలుకు బొర్రా స్టాప్‌ చాలా కీలకం. విశాఖ నుంచి వెళ్లే ప్రయాణికులు బొర్రాలో దిగి అక్కడ గుహలు చూసుకొని, అటు నుంచి అరకులోయ వెళతారు. ఇప్పుడు రైల్వే అధికారులు 18 నుంచి నడిపే ప్రత్యేక రైలుకు బొర్రా స్టాప్‌ తీసేశారు. దీనిపై పర్యాటకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బొర్రాలో కేవలం రెండే నిమిషాలు ఆపుతారని, దానిని తీసేయడం సబబు కాదని అంటున్నారు. బొర్రాలో హాల్ట్‌ను ఏర్పాటుచేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.

Read more