రేషన్‌ బియ్యం పక్కదారి

ABN , First Publish Date - 2020-11-25T06:54:59+05:30 IST

పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి, మిల్లర్లకు అమ్ముకోవడం పలువురికి ప్రధాన వృత్తిగా మారింది.

రేషన్‌ బియ్యం పక్కదారి
రామికమతం పోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యం

గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్న దళారులు

కిలో రూ.10-12కు కార్డుదారుల నుంచి కొనుగోలు

మరో రూ.4-5 కలుపుకుని మిల్లర్లకు విక్రయం

పాలిష్‌, రీసైక్లింగ్‌ చేసి మార్కెట్‌కు తరలింపు

కిలో రూ.30-35కు అమ్మకం

రూ.10కు అమ్ముకున్న బియ్యాన్నే రూ.40కు కొనుగోలు చేస్తున్న కార్డుదారులు

లబ్ధిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్న కొంతమంది రేషన్‌ డీలర్లు

మొక్కుబడిగా పౌర సరఫరాల శాఖ తనిఖీలు

డీలర్ల నుంచి నెలవారీ మామూళ్లే కారణమని ఆరోపణలు

విజిలెన్స్‌, పోలీసులు పట్టుకున్న కేసులే అధికం


(విశాఖపట్నం/కోటవురట్ల/రావికమతం-ఆంధ్రజ్యోతి)


పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి, మిల్లర్లకు అమ్ముకోవడం పలువురికి ప్రధాన వృత్తిగా మారింది. కొన్నిచోట్ల కార్డుదారులు ఈ-పోస్‌ యంత్రంలో వేలిముద్రలు నమోదు చేసి, బియ్యం తీసుకెళ్లకుండా రేషన్‌ డీలర్‌ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఆయా డీలర్లు ఈ బియ్యాన్ని రైస్‌ మిల్లర్లకు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రేషన్‌ బియ్యాన్ని మరోసారి పాలిష్‌ పట్టించి, బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్న రైస్‌ మిల్లర్లు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. అనధికార లెక్కల ప్రకారం జిల్లాలోని పట్టణ, మైదాన గ్రామీణ ప్రాంతంలో ప్రతి నెలా రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న బియ్యంలో 40 శాతం వరకు చేతులు మారుతున్నాయి.

కరోనా వైరస్‌ ప్రబలకముందు ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డుదారులకు నెలకొకసారి కిలో రూ.1 చొప్పున ఒక్కొక్కరికి ఐదు కిలోల వంతున బియ్యం పంపిణీ చేసేది. లాక్‌డౌన్‌ అమలుతో చాలామందికి ఉపాధి లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రెండుసార్లు ఉచితంగా బియ్యం అందజేస్తున్నాయి. నెలకు ఒకసారి బియ్యం ఇచ్చేటప్పుడే గ్రామీణ ప్రాంతంలో కార్డుదారుల నుంచి కిలో రూ.10 నుంచి రూ.12లకు దళారులు కొనుగోలు చేసి రైస్‌ మిల్లర్లకు, బియ్యం వ్యాపారులకు అమ్ముకునేవారు. ఏప్రిల్‌ నుంచి నెలకు రెండుసార్లు బియ్యం ఇస్తుండడంతో ఈ అక్రమ వ్యాపారం రెట్టింపు అయ్యింది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం లావుగా వుండి నాణ్యత లేకపోవడం, అన్నం ముక్క వాసన వస్తుండడం వల్ల వాటిని తినలేకపోతున్నామని, అందుకే దళారులకు అమ్ముకుంటున్నామని పలువురు కార్డుదారులు చెబుతుండడం ఈ సందర్భంగా గమనార్హం. 


రేషన్‌ డీలర్ల అక్రమ వ్యాపారం

జిల్లాలో పలువురు రేషన్‌ డీలర్లు కూడా బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఈ-పోస్‌ యంత్రంలో కార్డుదారుల వేలిముద్రలు నమోదు చేసుకుని, కిలోకు రూ.10 నుంచి రూ.12 చొప్పున వారికి ఇచ్చేసి బియ్యాన్ని తమ వద్దనే ఉంచేసుకుంటున్నారు. ‘అనువైన సమయం’ చూసుకుని రేషన్‌ బియ్యాన్ని రైస్‌ మిల్లులకు లేదా వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. కిలోకు కనీసం రూ.5 చొప్పున ఆదాయం పొందుతున్నట్టు తెలిసింది. జిల్లాలో ఈ తరహాలో రేషన్‌ బియ్యం చేతులు మారుతున్నప్పటికీ పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నెలలో ఒకటి, రెండు మండలాల్లో రేషన్‌ డిపోలను తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. రేషన్‌ డీలర్ల నుంచి ప్రతి నెలా పౌర సరఫరాల శాఖలో ఎవరి వాటా వారికి అందుతున్నదని, అందుకే డిపోల్లో తనిఖీలు, డీలర్లపై నిఘా పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఐదారు నెలల్లో పట్టుబడిన రేషన్‌ బియ్యంలో అధిక శాతం పోలీసులు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నవే కావడం గమనార్హం.


పక్క జిల్లా రైస్‌ మిల్లులకు తరలింపు

ప్రభుత్వం అందజేస్తున్న రేషన్‌ బియ్యాన్ని కార్డుదారుల నుంచి కొనుగోలు చేయడం, వాటిని తిరిగి వ్యాపారులకు లేదా రైస్‌ మిల్లులకు విక్రయించడం పలువురికి ప్రధాన ఉపాధిగా మారింది. కోటవురట్ల మండలం ఆక్సాహెబ్‌పేట కేంద్రంగా రేషన్‌ బియ్యం కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన కొందరు ఆక్సాహెబ్‌పేట, ఎస్‌ఆర్‌పేట గ్రామాల మధ్య స్థావరాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. రేషన్‌ డిపోల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైన తరువాత వారం పాటు వీరు మోపెడ్‌లు, సైకిళ్లపై గ్రామాల్లో తిరుగుతూ కార్డుదారుల నుంచి బియ్యం కిలో రూ.10 నుంచి రూ.12కు కొనుగోలు చేస్తున్నారు. అనంతరం బస్తాల్లో నింపి, కోటనందూరు మండలంలోని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లు కిలో రూ.14 నుంచి రూ.16 చొప్పున కొనుగోలు చేసి, మిల్లులో మరోసారి పాలిష్‌ పట్టిస్తున్నారు. అనంతరం కిలో రూ.30 నుంచి రూ.35 చొప్పున బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. రేషన్‌ బియ్యం అమ్ముకున్న కార్డుదారులు అవే బియ్యాన్నే కిలో రూ.40లకుపైబడి కొనుగోలు చేస్తున్నారు.  


ఈ నెలలో...

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఈ నెల 9వ తేదీన రాంబిల్లి మండలం నారాయపురం జంక్షన్‌ వద్ద వ్యాన్‌లో తరలిస్తున్న 15 క్విం టాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. తదుపరి చర్యలను నిమిత్తం పోలీ సులకు అప్పగించారు.  ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

నవంబరు 10వ తేదీన రావికమతం మండలం మేడివాడ నుంచి బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ఒక రైస్‌ మిల్లుకు తరలిస్తున్న 56 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రావికమతం పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్‌ డ్రైవర్‌తో పాటు బియ్యం సరఫరా చేస్తున్న వ్యక్తిపై 6ఏ కింద కేసు నమోదు చేశారు. 

ఈ నెల 14వ తేదీన గొలుగొండ మండలం గుండుపాల-అయ్యన్నపాలెం జంక్షన్‌ మధ్య ఆటోలో తరలి స్తున్న 12 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పౌరసర ఫరాల శాఖ అధికా రులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరి పారు. పాకలపాడు రేషన్‌ డిపోకు చెందిన బియ్యంగా గుర్తించి, సంబం ధిత డీలర్‌పై 6ఏ కింద నమోదు చేశారు. 

Read more