రైతు బేజార్‌

ABN , First Publish Date - 2020-12-06T06:09:55+05:30 IST

‘కొండ నాలుకకు మందు వేస్తే...ఉన్న నాలుక ఊడిపోయింది’అనే చందంగా ఉంది మార్కెటింగ్‌ శాఖాధికారుల తీరు. ఉన్నతాధికారి ఒకటి చెబితే...కింది స్థాయి అధికారులు మరొకటి చేస్తున్నారు.

రైతు బేజార్‌

మూడేళ్లుగా రెన్యువల్‌ కాని కార్డులు

...ఆ కార్డుల్లో ఏ పంట అయితే నమోదు చేశారో అది మాత్రమే విక్రయించాలని మార్కెటింగ్‌ శాఖాధికారుల పట్టు

...లేనిపక్షంలో వెనక్కి పంపుతున్న వైనం

పంటలు మారుస్తూ ఉంటామని రైతులు చెప్పినా పట్టించుకోని సిబ్బంది

జేసీ చెప్పిందొక్కటి... కింది స్థాయి సిబ్బంది చేస్తున్నదొకటి!!


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘కొండ నాలుకకు మందు వేస్తే...ఉన్న నాలుక ఊడిపోయింది’అనే చందంగా ఉంది మార్కెటింగ్‌ శాఖాధికారుల తీరు. ఉన్నతాధికారి ఒకటి చెబితే...కింది స్థాయి అధికారులు మరొకటి చేస్తున్నారు. రైతుబజార్లలో బినామీలు ప్రవేశించారని, పండించిన పంటలు కాకుండా వేరే కూరగాయలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి...మార్కెటింగ్‌ శాఖాధికారులను సమావేశపరిచి ఆరా తీశారు. రైతులకు ఇచ్చిన కార్డులపై ఏ కూరగాయలు పండిస్తున్నట్టు నమోదు చేశారో..అవే అమ్మేలా చూడాలని సూచించారు. రైతులు వారి పొలాల్లో పండిస్తున్న పంటల గురించి అక్కడి గ్రామ సచివాలయ ఉద్యాన అధికారి లేదా వ్యవసాయాధికారి, వీఆర్‌ఓతో ధ్రువీకరించిన పత్రం రైతుబజార్లలో సమర్పించాలని ఆదేశించారు. అంటే... రైతులు తాజాగా ఏ పంటలు పండిస్తున్నారో...ఆ సమాచారం ఈఓలకు తెలియజేసి, వాటిని అమ్ముకోవచ్చునని దాని అర్థం. కానీ మార్కెటింగ్‌ శాఖాధికారులు పరమానంద శిష్యుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. మూడేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన కార్డులపై ఏ పంట రాసి వుంటే అవే అమ్మాలని, ఇంకేమీ అమ్మకూడదని చెబుతున్నారు. అలా ఎవరైనా చేస్తే..వారిని బజారు నుంచి పంపించేస్తున్నారు.

 

ఏ పంట అయినా నాలుగు నెలలే!!

ఏ రకం కూరగాయల పంట వేసినా నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. ఆ తరువాత పంట మార్చి సీజన్‌ వారీగా వేరే రకం వేసుకుంటారు. ఒక్క దొండ పాదు మాత్రం రెండేళ్ల వరకు ఉంటుంది. మిగిలినవన్నీ నాలుగు నెలలతో అయిపోతాయి. ఇకపోతే...నిబంధనల ప్రకారం బజార్లకు వచ్చే రైతులకు ఆరు నెలలకు ఓసారి కార్డులను రెన్యువల్‌ చేయాలి. ఆ సమయంలో ఏ పంట వేశారో అది దానిపై నమోదుచేయాలి. అయితే రైతుల కార్డులను మూడేళ్లుగా రెన్యువల్‌ చేయలేదు. దాంతో మూడేళ్ల క్రితం నమోదు చేయించుకున్న పంటలే అమ్మాలని మార్కెటింగ్‌ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ‘ఆ పంట ఇప్పుడు లేదు. కొత్తది వేశాం. పండించిన సరకే తెచ్చి అమ్ముతున్నాము’ అని రైతులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘జాయింట్‌ కలెక్టర్‌ ఊరుకోరు...అంటూ వారిని బయటకు పంపుతున్నారు. దాంతో ఇప్పుడు కొన్ని రైతుబజార్లలో బీన్స్‌ పిక్కలు (తెల్లవి), గ్రీన్‌పీస్‌, క్యాప్సికమ్‌, కర్రపెండలం, స్వీట్‌ కార్న్‌ వంటివి అమ్మడం లేదు. రైతులు ఎవరైనా వాటిని తెచ్చినా మార్కెటింగ్‌ ఏడీకి భయపడి ఈఓలు బయటకు పంపేస్తున్నారు. జేసీ సూచన ప్రకారం ప్రకారం పండించిన పంటను గ్రామ సచివాలయం ద్వారా సర్టిఫై చేయించుకుంటే అనుమతించాలి. కానీ మార్కెటింగ్‌ అధికారులు దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు తెచ్చుకొమ్మని రైతులకు చెప్పడం లేదు.  


తనిఖీలకు ప్రత్యేక బృందాలు

రైతుబజార్లలోని స్టాళ్లలో బినామీలు వున్నారని, వేరే ఉత్పత్తులు అమ్ముతున్నారని ప్రచారం జరగడంతో తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జేసీ వేణుగోపాలరెడ్డి ఆదేశించారు. దీనికి ఒక కమిటీని వేశారు. అందులో వ్యవసాయాధికారి, ఉద్యాన అధికారి, మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. కార్డు పొందిన రైతు గానీ, వారి నామినీ గాని స్టాల్‌లో విక్రయాలు చేసుకోవచ్చు.ఉల్లి, బంగాళాదుంపలు, టమాటా స్టాళ్లు తీసుకున్న డ్వాక్రా సంఘాలు వారే విక్రయించాలి. వేరేవారు ఉండకూడదు. ఇకపోతే కొంతమంది నెలకు రూ.12 వేల వరకు అద్దె చెల్లిస్తూ గృహమిత్ర దుకాణాలు నిర్వహిస్తున్నారు. వారిలో కొందరు సహాయకులను పెట్టుకొని నడుపుకుంటున్నారు. అయితే కొన్ని బజార్లలో కొబ్బరికాయలు, తమలపాకులు మాత్రమే విక్రయిస్తామని స్టాళ్లు తీసుకున్నవారు అనధికారంగా వాణిజ్య రకాలైన పండ్లను విక్రయిస్తున్నారు. వాటికి ప్రత్యేకంగా స్టాళ్లు వున్నా...మార్కెటింగ్‌ శాఖ అధికారుల ఆశీస్సులతో భారీ వ్యాపారాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-06T06:09:55+05:30 IST