అధికారుల నిర్లక్ష్యం-కౌలు రైతులకు శాపం

ABN , First Publish Date - 2020-11-08T05:29:30+05:30 IST

వ్యవసాయ సిబ్బంది నిర్లక్ష్యంతో కౌలు రైతులు రైతుభరోసా పథకానికి దూరమయ్యారు. రైతుభరోసా నగదు వేసినట్టు ప్రభుత్వం ప్రకటించగానే రైతులు బ్యాంకులకు వెళ్లారు.

అధికారుల నిర్లక్ష్యం-కౌలు రైతులకు శాపం
కొండపాలెం రైతుభరోసా కేంద్రం

రైతుభరోసా లాగిన్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయని వీఏఏలు

పథకానికి దూరమైన 412 మంది రైతులు


బుచ్చెయ్యపేట, నవంబరు 7: వ్యవసాయ సిబ్బంది నిర్లక్ష్యంతో కౌలు రైతులు రైతుభరోసా పథకానికి దూరమయ్యారు. రైతుభరోసా నగదు వేసినట్టు ప్రభుత్వం ప్రకటించగానే రైతులు బ్యాంకులకు వెళ్లారు. అకౌంట్‌లో నగదు లేకపోవడంతో గ్రామ సచివాలయాలకు పరుగులు తీశారు. తీరా ఈ ఏడాదికి రైతుభరోసా ఉండదని, వచ్చే ఏడాది చూద్దామని గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) తెలపడంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. రైతుభరోసా నగదు వస్తే అప్పులు తీర్చకుందామని ఆశించామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు. 


ఎందుకిలా..

 మండలంలోని 37 గ్రామాల్లో 419 మంది కౌలు రైతులు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించి వివరాలను గ్రామ సచివాలయాలకు అందజేశారు. వీటిని రైతుభరోసా లాగిన్‌లో వీఏఏలు అప్‌లోడ్‌ చేయలేదు. దీంతో రాజాంలో ఆరుగురు, విజయరామరాజుపేటలో ఒక్కరికి మాత్రమే రైతుభరోసా మంజూరైంది. ఈ విషయమై ఏవో వెంకటరాంప్రసాద్‌ను వివరణ కోరగా, తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

Updated Date - 2020-11-08T05:29:30+05:30 IST