కలవర పరి‘చేను’!

ABN , First Publish Date - 2020-11-27T06:02:39+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుఫాన్‌ తీరం దాటినప్పటికీ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం పడుతూనే ఉంది.

కలవర పరి‘చేను’!
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో నీటి మునిగిన వరి పనలను గట్టుకు చేర్చేందుకు రైతు రమణ ప్రయత్నం

  అన్నదాతల్లో దడపుట్టిస్తున్న నివర్‌ తుఫాన్‌ 

  ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న చిరుజల్లులు

 కొన్ని మండలాల్లో మోస్తరు వర్షాలు 

 చేతికందే దశలో కొన్నిచోట్ల నేలకొరిగిన వరి పంట

  మరికొన్ని చోట్ల పొలాల్లో నీరు చేరడంతో తడిసిముద్దయిన పనలు


నక్కపల్లి/ ఎస్‌.రాయవరం, నవంబరు 26 : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుఫాన్‌ తీరం దాటినప్పటికీ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం పడుతూనే ఉంది.  దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వరి పంట చేతికందే సమయంలో వర్షం కురుస్తుండడం అన్నదాతలను కలవర పరుస్తోంది. ఎస్‌.రాయవరం, నక్కపల్లి మండలాల్లో పండిన పంట తడుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల వరిపనులు నీటిలో మునిగాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.  ఇదిలావుంటే,  నక్కపల్లిలో 4.2 సెం.మీ, ఎస్‌.రాయవరం మండలంలో 4.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. 


నర్సీపట్నం మండలంలో..

నర్సీపట్నం అర్బన్‌ : తుఫాన్‌ కారణంగా మండలంలో  గురువారం ఉదయం నుంచి గాలులతో కూడిన చిరుజల్లులు కుస్తుండడం అన్నదాతలను కలవర పరుస్తోంది. దీంతో చెట్టుపల్లి, వేములపూడి, ధర్మసాగరం, అమలాపురం, గబ్బాడ, గురందొరపాలెం, ఓ.ఎల్‌.పురం, యరకన్నపాలెం, నీలంపేట తదితర ప్రాం తాల్లో వరి చేళ్లు నేలవాలుతున్నాయి. 


గొలుగొండ మండలంలో..

 గొలుగొండ/కృష్ణాదేవిపేట: మండలంలో ఈ ఏడాది 1230 హెక్టార్లలో వరినాట్లు పడగా, ప్రస్తుతం 450 హెక్టార్లలో పంట కోత దశకు చేరుకుంది. ఇటువంటి తరుణంలో వర్షాలు కురు స్తుండడంతో అన్న దాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొలుగొండ, పాతమల్లంపేట, పాకలపాడు, కొత్తమల్లంపేట, జోగంపేట, చీడిగుమ్మల, గుండుపాల, ఏటిగైరంపేట, రావణాపల్లి, కొమిర, పుత్తడిగైరంపేట, కొత్తమల్లంపేట గ్రామాల్లో పలుచోట్ల గాలులకు వరిపంట నేల వాలడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. 

 

మాకవరపాలెం మండలంలో..

మాకవరపాలెం : నివర్‌ తుఫాన్‌ రైతుల్లో గుబులు రేపుతోంది.  గురువారం ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తుండడంతో చేతికి అందే సమయాల్లో పంట పరిస్థితి ఏమిటని దిగులు చెందు తున్నారు.  మాకవరపాలెం, తామరం, కొండలఅగ్రహారం, లచ్చన్నపాలెం, పైడిపాల గ్రామాల్లో వరిచేళ్లు నేలకొరిగాయి.

 

కశింకోటలో...

కశింకోట: కశింకోటలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. మండల కేంద్రంలో వారపు సంత తడిసి ముద్దయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. వరింపట చాలా గ్రామాల్లో నేలకొరిదింది.

 

కోటవురట్ల మండలంలో..

కోటవురట్ల : తుఫాన్‌ కారణంగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందు తున్నారు. బుధవారం రాత్రి నుంచి పడుతుండడంతో వరితో పాటు పత్తిపంటలో నీరు చేరడం కలవర పరుస్తోంది.  కోటవురట్ల,  కైలాసపట్నం, జల్లూరు, లింగాపురం, అన్నవరం గ్రామాల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. 

 

పాయకరావుపేట మండలంలో..

పాయకరావుపేట/ పాయకరావుపేట రూరల్‌ : తుఫాన్‌ వల్ల బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పట్టణంలో పలుచోట్ల నీరు నిలిచింది. మండలంలోని రైతన్నల్లో ఆందోళన నెలకొంది. కొద్ది రోజుల్లో పంట చేతికి అందనున్న తరుణంలో గాలులతో కూడిన వర్షాలకు వరి పంట నేలకొరు గుతుండడం కలవర పరుస్తోంది.  తహసీల్దార్‌ అంబేడ్కర్‌, ఏవో సౌజన్య అరట్లకోట, మంగవరం గ్రామాలలో పంటలను పరిశీలించారు.

  

నాతవరం మండలంలో..

నాతవరం : తుఫాన్‌ వల్ల కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో వరిపంట నేలకొరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.  నాతవరంతో పాటు గునుపూడి, కృష్ణాపురం, ఎంబీపట్నం మన్యపురట్ల, తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. 

 

 ఎలమంచిలి మండలంలో..

ఎలమంచిలి/ఎలమంచిలి రూరల్‌ : తుఫాన్‌ కారణంగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పలు గ్రామాల్లో నీటమునగ్గా, చాలాచోట్ల నేలకొరుగుతుండడం అన్నదాతలను కలవర పరుస్తోంది. మండలంలో ఈ ఏడాది సుమారు మూడు వేల హెక్టార్లలో వరి పంట  సాగులో ఉంది.  సోమలింగపాలెం, తెరువుపల్లి, రామారాయుడుపాలెం, కొక్కిరాపల్లి, మర్రిబంద, ఏటికొప్పాక, పులపర్తి, లైనుకొత్తూరు తదితర పలు గ్రామాల్లో రైతులు నేలకొరిగిన పంటను చూసి మదనపడుతున్నారు.

 

 రాంబిల్లి మండలంలో..

రాంబిల్లి : మండలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గాలులకు వరి పంట నేలకొరిగిపోవడంతో  పాలుపోసుకొని గింజకట్టే సమయంలో తమకేమిటీ కష్టమని మదనపడుతున్నారు. మండల వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఆదుకోవాలని అంతా కోరుతున్నారు.  

 

అచ్యుతాపురం మండలంలో..

అచ్యుతాపురం రూరల్‌ :  తుఫాన్‌ కారణంగా మండలంలోని ఎర్రవరం, ఉప్పవరం, ఎం.జె.పురం, అందలాపల్లి గ్రామాల్లో నేలవాలిన వరి పంటను గురువారం వ్యవసాయాఽధికారి పి.రంగాచారి పరిశీలించారు. 236 హెక్టార్లలో పంట నీటిముంపునకు గురైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. గింజ పాలుపొసుకొని గట్టిపడే దశలో ఉన్నందున నష్టశాతం ఎక్కువగా ఉండవచ్చునన్నారు. 


మునగపాక మండలంలో..

మునగపాక : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి, చెరకు రైతులు నష్టపోయారు. బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు కురుస్తుండడంతో కోతకు వచ్చిన వరి పంట చాలా చోట్ల నేలకొరిగింది. బెల్లం తయారు చేసే రైతులకు కూడా ఈ వర్షం తీవ్రంగా నష్టం కలిగించింది.  

అనకాపల్లిలో 25.2 ఎం.ఎం వర్షపాతం

అనకాపల్లి టౌన్‌ : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో అనకాపల్లిలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వర్షపాతం 25.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రోడ్లపై అమ్మకాలు సాగించే చిరు వ్యాపారులు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని రహదారులన్నీ తడిసి ముద్దయ్యాయి. 

Read more