23న ఒలింపిక్‌ దినోత్సవం

ABN , First Publish Date - 2020-06-21T09:13:42+05:30 IST

కొవిడ్‌-19 దృష్ట్యా భారత ఒలింపిక్‌ సంఘం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు స్టే యాక్టీవ్‌, స్టే స్ర్టాంగ్‌, స్టే హోమ్‌ నినాదంతో

23న ఒలింపిక్‌ దినోత్సవం

ఆన్‌లైన్‌లో క్విజ్‌ పోటీలు

అంతర్జాతీయ పతకాల విజేతలకు సన్మానం


విశాఖపట్నం(స్పోర్ట్సు), జూన్‌ 20: కొవిడ్‌-19 దృష్ట్యా భారత ఒలింపిక్‌ సంఘం  ఇచ్చిన మార్గదర్శకాల మేరకు స్టే యాక్టీవ్‌, స్టే స్ర్టాంగ్‌, స్టే హోమ్‌ నినాదంతో మంగళవారం విశాఖలో డిజిటల్‌ ఒలింపిక్‌ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ద ఒలింపిక్‌ అసోసియేషన్‌ విశాఖ అధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్‌ తెలిపారు. శనివారం ఏయూ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఒలింపిక్‌ దినోత్సవాన్ని పరిమిత సంఖ్యలో వినూత్న పద్ధతిలో నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.


ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు,  ప్రోత్సాహకులు, చిన్నారులను పరోక్షంగా భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీని నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 63 ప్రశ్నలతో కూడిన క్విజ్‌ ప్రశ్నపత్రాన్ని పత్రిక, రేడియో, సామాజిక మాద్యమాల ద్వారా విడుదల చేశామన్నారు. జవాబులను ఆదివారం రాత్రి ఎనిమిది గంటలలోపు ఫోన్‌: 9052667766 నంబరుకు వాట్సాప్‌ చేయాలని తెలిపారు. విజేతలను సోమవారం ఉదయం ప్రకటించి పోస్టల్‌ సర్వీసు ద్వారా బహుమతులు అందజేస్తామన్నారు.


అలాగే ఆకాశవాణిలో ఆదివారం సాయంత్రం 5:15 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో లైవ్‌ క్విజ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆసక్తిగలవారు ఫోన్‌:2727200 నంబరులో సంప్రదించాలని సూచించారు. కాగా 23వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఏయూ గ్రౌండ్‌లో  జరగనున్న ఒలింపిక్‌ దినోత్సవంలో అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఏయూ వ్యాయామ విద్య, క్రీడాశాస్త్రం సంచాలకులు ఆచార్య ఎన్‌.విజయ్‌మోహన్‌, ద ఒలింపిక్‌ సంఘం ప్రతినిధులు ఒలింపియన్‌ ఎంవీ.మాణిక్యాలు, కంచరాన సూర్యనారాయణ, బి.రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-21T09:13:42+05:30 IST