క్వార్టర్లీ రిటర్న్స్‌... మంత్లీ పేమెంట్‌

ABN , First Publish Date - 2020-12-30T06:01:35+05:30 IST

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రిటర్నుల దాఖలుకు సంబంధించి నూతన సంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి వస్తున్నదని విశాఖపట్నం డివిజన్‌ ఎస్‌జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు.

క్వార్టర్లీ రిటర్న్స్‌... మంత్లీ పేమెంట్‌
జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌.శ్రీనివాసరావు


1 నుంచి జీఎస్‌టీ రిటర్నులకు కొత్త విధానం

నెలనెలా పన్ను చెల్లించాల్సిందే

పన్ను ఆలస్యంగా చెల్లిస్తే 18 శాతం వడ్డీ, ఆలస్యంగా రిటర్నులు సమర్పిస్తే రూ.5 వేలు జరిమానా 

జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌.శ్రీనివాసరావు


విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రిటర్నుల దాఖలుకు సంబంధించి నూతన సంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి వస్తున్నదని విశాఖపట్నం డివిజన్‌ ఎస్‌జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌జీఎస్‌టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు. ఇప్పటివరకు వ్యాపారులు మూడు నెలలకు ఓసారి రిటర్న్‌లు సమర్పించి, పన్నులు కూడా క్వార్టర్లీ చెల్లిస్తున్నారని ఇకపై ఈ విధానం మారనుందన్నారు. ‘క్వార్టర్లీ రిటర్న్స్‌...మంత్లీ పేమెంట్‌ (క్యుఆర్‌ఎంపీ)’ పేరుతో కొత్త విధానం అమలులోకి వస్తుందన్నారు. దీని ప్రకారం మూడు నెలలకు ఓసారి రిటర్నులు సమర్పించి, ప్రతి నెలా పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏడాదికి రూ.5 కోట్ల టర్నోవరు మించని వ్యాపారులు అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. అయితే ఈ విధానం ఆప్షనల్‌ మాత్రమేనని, తప్పనిసరి కాదని ఆయన స్పష్టంచేశారు. పన్ను కట్టేవారంతా ఈ విధానంలోకి ఆటోమేటిక్‌గా మారిపోతారన్నారు. ఇందులో వ్యాపార స్వభావం బట్టి ఇన్వాయిస్‌ ఫర్నిషింగ్‌ ఫెసిలిటీ (ఐఎఫ్‌ఎఫ్‌) అనే విధానం కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. పన్నును నెల నెలా కొంత మొత్తం ఫిక్స్‌డ్‌గా చెల్లించుకోవచ్చునని, అందులో మొదటి నెల 35 శాతం, రెండో నెల 35 శాతం, మూడో నెల మిగిలినది చెల్లించి క్వార్టర్‌ పూర్తయ్యేసరికి మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు.  ఏ విధంగా పన్ను చెల్లించినా రిటర్నులు మాత్రం మూడు నెలలకొకసారి 22వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు. పన్ను ఆలస్యంగా చెల్లిస్తే 18 శాతం వడ్డీ, ఆలస్యంగా రిటర్నులు సమర్పిస్తే రూ.5 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. రూ.100 కోట్ల పైబడి టర్నోవరు చేసే వ్యాపారులు 2021 జనవరి నుం చి ఈ-ఇన్వాయిస్‌ల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని, ఇది తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేశారు. 


నెలకు రూ.300 కోట్ల ఆదాయం

విశాఖపట్నం డివిజన్‌లో ఎస్‌జీఎస్‌టీ నెలకు రూ.300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని జేసీ శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలోని పెట్రోలియం సంస్థల నుంచి వచ్చే ఆదాయం అదనంగా ఉంటుందన్నారు. ఎక్సైజ్‌ విభాగం నుంచి వచ్చే ఆదాయం అమరావతిలో జమ అవుతుందని చెప్పారు.  


ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాచారం

రిటర్నులు సమర్పించనివారు, పన్ను కట్టని వ్యాపారుల సమాచారాన్ని ఇంటెలిజెన్స్‌ విభాగం ద్వారా సేకరించి, వారిపై దాడులు చేసి, పన్నులు వసూలు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.60 కోట్లు వసూలు చేశామన్నారు. ఇలాంటి కేసులో ఓ వ్యాపారిని కూడా అరెస్టు చేశామన్నారు. 


ఐదుగురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై కేసులు

విశాఖపట్నంలో పన్నులు ఎగ్గొట్టిన ఐదుగురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై కేసులు పెట్టామని వెల్లడించారు.

Updated Date - 2020-12-30T06:01:35+05:30 IST