2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-26T06:14:58+05:30 IST

మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై బుధవారం రాజయ్యపేట వద్ద నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో భూ నిర్వాసితులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు పలు అంశాలను ప్రస్తావించారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
ప్రజాభిప్రాయ సేకరణ సభలో మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు సిహెచ్‌.నరసింగరావు

రసాయన, ఔషధ పరిశ్రమలు పెట్టొద్దు

నక్కపల్లి పారిశ్రామిక పార్కు ప్రజాభిప్రాయ సేకరణ సభలో పలువురు డిమాండ్‌


నక్కపల్లి, నవంబరు 25: మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై బుధవారం రాజయ్యపేట వద్ద నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో భూ నిర్వాసితులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, కాలుష్య కారక రసాయన, ఔషధ పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేశారు. ఎవరెవరు... ఏ అభిప్రాయాలను వ్యక్తం చేశారో వారి మాటల్లోనే....


ఏ పరిశ్రమలు వస్తాయో ఎందుకు చెప్పడంలేదు?

సిహెచ్‌.నరసింగరావు, సీపీఎం రాష్ట్ర నాయకుడు

నక్కపల్లి పారిశ్రామిక పార్కులో ఏ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయో ప్రజలకు సమాచారం ఇవ్వలేదు. ఇక్కడున్న అధికారులైనా ఇప్పుడు చెప్పగలరా? విదేశీ కంపెనీలకు మన సముద్ర తీరాన్ని కట్టబెట్టే కుట్ర ఇది. కరోనా సమయంలో ప్రజాభిప్రాయసేకరణ ఎలా జరుపుతారు? సుమారు నాలుగు వేల ఎకరాల భూసేకరణకు సంబంధించి ఒకేసారి ప్రజాభిప్రాయసేకరణ జరపడం సరికాదు. 


ఇబ్బంది కలిగించే పరిశ్రమలను ప్రోత్సహించను

గొల్ల బాబూరావు, ఎమ్మెల్యే

ప్రజలకు ఇబ్బంది, నష్టం కలిగించే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించను. హెటెరో పరిశ్రమ వల్ల స్థానికులకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించాను. భూసేకరణ, పరిహారం పంపిణీ, తదితర అంశాల్లో కొన్ని అక్రమాలు జరిగినట్టు తెలిసింది. పది రోజుల్లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లతో గ్రామాల వారీగా సమగ్ర పరిశీలన జరిపిస్తాను. మా ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షమే.


అడుగడుగునా అధికారుల పొరపాట్లు

వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే

పారిశ్రామిక పార్కు కోసం భూములిచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీ ఇవ్వలేదు. పైగా కరోనా సమయంలో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టడం తప్పు. అంతేకాక 3,899 ఎకరాల భూములకు సంబంధించి ఒకేసారి ప్రజాభిప్రాయసేకరణ చేయడం మరింత దారుణం. ప్రజాభిప్రాయ సేకరణ గురించి ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఏ పరిశ్రమలు ఏర్పాటవుతాయో చెప్పకుండా ప్రజాభిప్రాయసేకరణ చేయడం ఏమిటి? 


కాలుష్యంతో చచ్చిపోతున్నాం

పిక్కి కామేశ్వరరావు, మత్స్యకారుడు, రాజయ్యపేట 

ఇప్పటికే వున్న రసాయన, ఔషధ పరిశ్రమ కాలుష్యం వల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. ప్రజలు అనేక రోగాలబారిన పడుతున్నారు. కూలి డబ్బులు మందులకే సరిపోవడం లేదు. కాలుష్యం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కొత్తగా రసాయన పరిశ్రమలు పెట్టే ఆలోచనను విరమించుకోవాలి.   


పొంతలేని పాలకుల మాటలు

ఇందుకూరి అవతారం రాజు, రైతు, డీఎల్‌పురం

రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయమని పాలకులు, అధికారులు చెబుతున్నారు. ఇక్కడేమో రసాయన పరిశ్రమలు ఏర్పాటుకు పూనుకుంటున్నారు. రెండు నాలుకల ధోరణి ఏమిటో అర్థం కావడంలేదు. గ్రామీణలను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసే రసాయన పరిశ్రమలను ఏర్పాటు చేయవద్దు.


కాలుష్యంతో ఊళ్లను ఖాళీ చేయాల్సి వస్తుంది

రాజాన రాంబాబు, సీపీఐ నాయకుడు

రసాయన, ఔషధ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా ఊళ్లను ఖాళీ చేయాల్సి వస్తుంది. దీంతో పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిపోతారు. రక్తసంబంధీకులు, బంధువులు చెట్టుకొకరు పుట్టకొకరుగా పోతారు. రాంబిల్లి మండలంలో ఇలాగే జరిగింది. అందువల్ల రసాయన పరిశ్రమలను ఏర్పాటును మా పార్టీ వ్యతిరేకిస్తున్నది.

Updated Date - 2020-11-26T06:14:58+05:30 IST