‘ఇంటికే రేషన్‌’ వాయిదా

ABN , First Publish Date - 2020-12-29T06:30:11+05:30 IST

‘ఇంటి వద్దకే రేషన్‌’ పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. సరకుల సరఫరాకు అవసరమైన వాహనాలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరకపోవడమే ఇందుకు కారణమని అధికార వర్గాల సమాచారం.

‘ఇంటికే రేషన్‌’ వాయిదా

పూర్తిస్థాయిలో రాని వాహనాలు

మొత్తం 828 వాహనాలు....ఇప్పటివరకు వచ్చింది 122 మాత్రమే!

ఫిబ్రవరి నుంచి అమలు


విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘ఇంటి వద్దకే రేషన్‌’ పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. సరకుల సరఫరాకు అవసరమైన వాహనాలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరకపోవడమే ఇందుకు కారణమని అధికార వర్గాల సమాచారం. వారం, పది రోజుల్లో వాహనాలన్నీ వచ్చేస్తాయని, ఫిబ్రవరి నుంచి ఇంటికే రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. 


జిల్లాలో 12.5 లక్షల మంది కార్డుదారులకు 2,176 డిపోల ద్వారా సరకులు పంపిణీ చేస్తుంటారు. అయితే కార్డుదారులకు జనవరి నుంచి ఇళ్ల వద్దే సరకులు అందజేయాలని ప్రభుత్వం భావించింది. కాగా ఇంటింటికీ రేషన్‌ పంపిణీకి 828 వాహనాలు అవసరమని అధికారులు గుర్తించారు. వారం క్రితం రాజస్థాన్‌ నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు వచ్చిన 120 టాటా వాహనాలను విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పంపించారు. విశాఖపట్నానికి తొలివిడతగా కేటాయించిన 140 వాహనాలు విజయవాడలో నిలిచిపోయాయు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు రైల్వే అధికారులతో సంప్రతింపులు జరపడంతో 122 వాహనాలు విశాఖ చేరుకున్నాయి. టాటా కంపెనీ సరఫరా చేసే వాహనాలను పీఎంపాలెంలో సాంకేతిక ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి తరలిస్తారు. అక్కడ తనిఖీ చేసిన తరువాత డిపోలకు కేటాయిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు. ప్రతి వాహనంలో జీపీఎస్‌ సిస్టమ్‌, తూనిక యంత్రం, ఈ-పోస్‌ మిషన్‌, ఎల్‌ఈడీ బల్బు, డీలరు కూర్చునేందుకు కుర్చీ ఉంటాయన్నారు. కాగా ఇంటింటికీ సరకుల పంపిణీ కోసం ప్రతి డిపో పరిధిలో కార్డుదారుల మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరోవైపు వాహనాల లబ్ధిదారులకు బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించి డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. కాగా ఇంటింటికీ సరకుల పంపిణీ వాహనాలను సంక్రాంతి రోజున ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అదేరోజు జిల్లాలో కూడా ఎంపిక చేసిన డిపోల నుంచి ప్రయోగాత్మకంగా  ప్రారంభించి...తరువాత ఫిబ్రవరిలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-12-29T06:30:11+05:30 IST