పీఎల్‌జీఏ వారోత్సవాలతో పోలీసులు అప్రమత్తం

ABN , First Publish Date - 2020-12-03T06:28:10+05:30 IST

మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యా

పీఎల్‌జీఏ వారోత్సవాలతో పోలీసులు అప్రమత్తం
పాడేరు ఐటీడీఏ రేకుల కాలనీలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌ బృందం


ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీలు

పాడేరురూరల్‌, డిసెంబరు 2: మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ రాజ్‌కమల్‌ ఆదేశాల మేరకు సీఐ పి.పైడపునాయుడు పర్యవేక్షణలో ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ బృందం బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పట్టణంలోని ఐటీడీఏ రేకుల కాలనీలో ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకున్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహించారు. 


సీలేరులో...

సీలేరు: పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కావడంతో సీలేరు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్‌ఐ రంజిత్‌ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటున్నారు. జలవిద్యుత్‌ కేంద్రం, జెన్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల వద్ద నిఘా పెట్టారు. కాగా సీలేరు మీదుగా నడిచే నైట్‌ సర్వీస్‌లను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. 


కించుమండ సంతలో...

డుంబ్రిగుడ: పీఎల్‌జిఏ వారోత్సవాల నేపథ్యంలో  మండల పోలీసులు పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కించుమండ సంతలో ఎస్‌ఐ గోపాల్‌, సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. శివారునున్న సొవ్వ, గసభ, కొల్లాపుట్టు, తూటంగి, రంగిలిసింగి పంచాయతీల పరిధిలో గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.,


 ముంచంగిపుట్టులో....

ముంచంగిపుట్టు: మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కావడంతో మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, కుమడ, పెదబయలు, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో పోలీసులు బలగాలు మోహరించాయి. ఎస్‌ఐ పి.ప్రసాదరావు ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పలు రహదారుల్లో బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.  


Updated Date - 2020-12-03T06:28:10+05:30 IST