మొక్కల పేరుతో మెక్కేశారు!

ABN , First Publish Date - 2020-11-06T06:06:46+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద రహదారులకు ఇరువైపులా చేపట్టిన మొక్కల పెంపకంలో కోటి రూపాయల వరకు నిధులు స్వాహా లేదా దుర్వినియోగం అయినట్టు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది.

మొక్కల పేరుతో మెక్కేశారు!
రోలుగుంట మండలం జె.నాయుడుపాలెం-గుండుబాడు రహదారి పక్కన కానరాని మొక్కలు (ఫైల్‌ ఫొటో)

‘ఉపాధి’ నిధులు రూ.కోటి వరకు స్వాహా

డ్వామా సోషల్‌ ఆడిట్‌లో వెలుగుచూసిన వైనం

డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ డీఆర్‌డీఏకి నోటీసులు

బాధ్యులైన వారి నుంచి రికవరీకి నిర్ణయం

అధికారుల నుంచి సిబ్బంది వరకు నోటీసులు జారీ


విశాఖపట్నం/పాయకరావుపేట రూరల్‌/చోడవరం,  నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద రహదారులకు ఇరువైపులా చేపట్టిన మొక్కల పెంపకంలో కోటి రూపాయల వరకు నిధులు స్వాహా లేదా దుర్వినియోగం అయినట్టు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. మొక్కలు నాటకుండా కొంత మొత్తం... నాటిన మొక్కలకు నీరు పోయకుండా మరికొంత మింగేసినట్టు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) అధికారులకు లేఖ రాశారు.


ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో రహదారులకు ఇరువైపులా, చెరువు కట్టల మీద మొక్కలు నాటడం, వాటిని పెంచడం వంటి పనుల ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించాలని డీఆర్‌డీఏ అధికారులు భావించారు. 2016-17 నుంచి 2018-19 వరకు మూడేళ్లపాటు దీనిని అమలుచేశారు. నిర్వహణ బాధ్యతను ‘వెలుగు’కు అప్ప గించారు. ఈ పథకం మంచిదే అయినప్పటికీ, అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పలు మండలాల్లో నాటింది పది మొక్కలు అయితే, 100 మొక్కలు నాటినట్టు బిల్లులు పెట్టారు. ఇక నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించడంతో కొద్దిరోజులకే అవి చనిపోయాయి. వీటిపై ఫిర్యాదులు రావడంతో ఈ పథకానికి నిధులు మంజూరు చేసిన డ్వామా అధికారులు రెండేళ్ల నుంచి సోషల్‌ ఆడిట్‌ చేస్తున్నారు. జిల్లాలో రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు దుర్వినియోగం అయినట్టు తేల్చారు. ఆ మొత్తం వెనక్కి ఇవ్వాలంటూ డీఆర్‌డీఏకు నోటీసులు జారీచేశారు. దీంతో డీఆర్‌డీఏ అధికారులు...మూడేళ్లపాటు ఈ పథకం అమలును పర్యవేక్షించిన అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరికీ నోటీసులు జారీచేశారు. తొలుత వివరణ ఇవ్వాలని, సోషల్‌ ఆడిట్‌లో పేర్కొన్న విధంగా సొమ్ములు వెనక్కి చెల్లించాలని పీడీ విశ్వేశ్వరరావు ఆదేశించారు. ఇదే సమయంలో మొక్కల పెంపకంపై విచారణకు సంస్థలో పలువురు అధికారులను నియమించారు.

Updated Date - 2020-11-06T06:06:46+05:30 IST