మందులోళ్ల మాయాజాలం

ABN , First Publish Date - 2020-10-31T06:30:46+05:30 IST

విశాఖపట్నం జిల్లాలో కొత్త ఫార్మా కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే వందల ఎకరాల్లో వున్న హెటిరో వంటి కంపెనీలు మరింత విస్తరిస్తున్నాయి. అయితే వీటిలో ఏ రకమైన మందులు తయారు చేస్తున్నారనే దానిపై జిల్లా అధికారులు దృష్టిపెట్టడం లేదు. ప్రతి కంపెనీ నిర్దేశిత (అనుమతి పొందిన) మందులను మాత్రమే తయారుచేయాలి. కానీ అనుమతి లేకుండా ఇతర మందులు కూడా తయారుచేస్తున్నట్టు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తాజాగా వెల్లడించింది.

మందులోళ్ల మాయాజాలం
సాయినార్‌లో ప్రమాద స్థలాన్ని సందర్శిస్తున్న కలెక్టర్‌ వినయచంద్‌ (ఫైల్‌ ఫొటో)

‘సాయినార్‌ సైన్స్‌స్‌’లో అనుమతులు లేని మందులు తయారీ

ఆ సమయంలోనే ప్రమాదం

నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ విచారణలో వెల్లడి

ఇంకెన్ని చోట్ల ఇలా జరుగుతున్నదో..?

లోపాలపై దృష్టి పెట్టని అధికారులు

ఆ కంపెనీని ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేసి, అన్నీ సక్రమంగా వున్నాయని సర్టిఫై చేశాకే విద్యుత్‌ కనెక్షన్‌ పునరుద్ధరించాలని ఆదేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం జిల్లాలో కొత్త ఫార్మా కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే వందల ఎకరాల్లో వున్న హెటిరో వంటి కంపెనీలు మరింత విస్తరిస్తున్నాయి. అయితే వీటిలో ఏ రకమైన మందులు తయారు చేస్తున్నారనే దానిపై జిల్లా అధికారులు దృష్టిపెట్టడం లేదు. ప్రతి కంపెనీ నిర్దేశిత (అనుమతి పొందిన) మందులను మాత్రమే తయారుచేయాలి. కానీ అనుమతి లేకుండా ఇతర మందులు కూడా తయారుచేస్తున్నట్టు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తాజాగా వెల్లడించింది. 

రాంకీ ఫార్మాసిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌లో నాలుగు నెలల క్రితం విషవాయువు (హైడ్రోజన్‌ సల్ఫైడ్‌-హెచ్‌2ఎస్‌) లీకై ఇద్దరు ఉద్యోగులు మరణించారు. అంతకుముందు కూడా అదే కంపెనీలో ప్రమాదం జరిగి ఇద్దరు మరణించారు. అయినా ఆ కంపెనీ నిర్లక్ష్యం వీడలేదు. నాలుగు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో యాజమాన్యంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం కూడా వుందని ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. ఒక రియాక్టర్‌ నుంచి మరొక రియాక్టర్‌లోకి రసాయనం పంపేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొంది. అంతేకాకుండా అనుమతి లేకుండా ‘బెంజి మెడజోల్‌’ అనే మందు తయారుచేస్తున్నట్టు పేర్కొంది. అదే ప్రమాదానికి కారణమని వెల్లడించింది. ఆ విషవాయువు బయటకు రావడం వల్ల పర్యావరణం దెబ్బతిందని, దానికి కంపెనీ రూ.24 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో ఎన్‌జీటీ ఇంత భారీగా జరిమానా విధించడం ఇదే మొదటిసారి. ఈ విషయం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎప్పుడూ భద్రత, ప్రమాణాల గురించే చర్చిస్తున్నామని, అనుమతి లేని మందుల తయారీ కూడా జరుగుతున్నదంటే..ఆ దిశగా కూడా దృష్టిపెట్టాలని భావిస్తున్నారు. 

ఎవరి భద్రత వారిదే...కీలక వ్యాఖ్యలు

పరిశ్రమలపై అధికారులు నిత్యం నిఘా ఉంచలేరని, ప్రమాదాలు జరగకుండా, ఇతర సమస్యలు రాకుండా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు, ప్రమాణాలు పాటించాలని సాయినార్‌ కేసులో ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. సిబ్బందికి అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని, నిపుణులు, శిక్షణ పొందిన వారికే కీలక బాధ్యతలు అప్పగించాలని పరోక్షంగా సూచించింది.  

ఎల్‌జీ పాలిమర్స్‌లోను అంతే!!

ఎల్‌జీ పాలిమర్స్‌లో మే ఏడో తేదీన స్టైరీన్‌ గ్యాస్‌ లీకై 15 మంది చనిపోయారు. వందలాది మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. ఇప్పటికీ వారి ఆరోగ్యం మెరుగుపడలేదు. బితుకుబితుకుమంటూ కాలం గడుపుతున్నారు. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టిన నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్పష్టంచేసింది.

విద్యుత్‌ సరఫరా కూడా నిలిపివేత?

సాయినార్‌ విషయంలో ఎన్‌జీటీ చేసిన వ్యాఖ్యలు అనేక అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. సాయినార్‌ కంపెనీని ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేసి, అన్నీ సక్రమంగా వున్నాయని సర్టిఫై చేశాకే విద్యుత్‌ కనెక్షన్‌ పునరుద్ధరించాలని సూచించింది. ఇది కొత్త విషయం. ప్రమాదాలు జరిగితే విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని ఇంతవరకు ఏ అధికారి ఇప్పటివరకు ఈపీడీసీఎల్‌ని ఆదేశించలేదు. జూన్‌ 29న ప్రమాదం జరిగినప్పుడు దానిని ఒకేసారి మూసివేయడానికి కుదరదని, దశల వారీగా షట్‌డౌన్‌ చేస్తామని పరిశ్రమల శాఖ అధికారులు చెప్పారు. నాలుగు నెలలుగా కంపెనీ మూతపడడం వల్ల ఇప్పుడు ఎలాంటి సిబ్బంది ఉన్నారో, వారి నైపుణ్యం ఏమిటో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Read more