పరిహారంపై తేల్చకుండానే...

ABN , First Publish Date - 2020-11-25T06:48:14+05:30 IST

నక్కపల్లి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పా టుకు సంబంధించి భూము లకు పరిహారం, స్థానికులకు ఉపాధిపై ఒకవైపు విపక్షాలు, రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఆందోళనలు కొనసాగిస్తుండగా...మరోవైపు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

పరిహారంపై తేల్చకుండానే...
ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్న వేదిక

నక్కపల్లి పారిశ్రామిక పార్కుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ

వ్యతిరేకిస్తున్న విపక్షాలు, రైతులు

రైతులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం

పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్‌

జనావాసాల మధ్య రసాయన, పెట్రో కెమికల్‌ కంపెనీల ఏర్పాటుపై మరికొందరి అభ్యంతరం

మత్స్యకారుల జీవనంపై ప్రభావం(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

నక్కపల్లి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పా టుకు సంబంధించి భూము లకు పరిహారం, స్థానికులకు ఉపాధిపై ఒకవైపు విపక్షాలు, రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఆందోళనలు కొనసాగిస్తుండగా...మరోవైపు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. బుధవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)  విస్తృత ఏర్పాట్లుచేసింది. 


రెండేళ్ల క్రితం అధ్యయనం

నక్కపల్లి పారిశ్రామిక పార్కుపై ఎల్‌ అండ్‌ టీ సంస్థ రెండేళ్ల క్రితం అధ్య యనం నిర్వహించి ఏపీఐఐసీకి నివేదిక అందజేసింది. అందులో పేర్కొన్న అం శాల ప్రకారం...పార్కులో పారిశ్రామిక ఉత్పత్తి ప్రారంభించిన 25 సంవత్సరాల తరువాత ఉత్పాదన మొత్తం రూ.లక్ష కోట్లు వుంటుందని అంచనా వేసింది. అదేవిధంగా 30,800 మందికి ప్రత్యక్షంగా, అంతకు రెండున్నర రెట్లు మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది.


ప్రతిపాదిత ప్రాంతంలో అరుదైన మొక్కలు, వన్యప్రాణులు

నక్కపల్లి మండలంలో ఏర్పాటుచేయనున్న పారిశ్రామిక పార్కుకు 8.4 కి.మీ. దూరంలో గల పాయకరావుపేట అభయారణ్యంలో అత్యంత అరుదైన మొక్కలు ఉన్నాయి. ఇంకా 11 వన్యప్రాణ జాతులున్నాయి. నెమలి ఈ ప్రాంత అడవిలో ఉంది. అంతరించిపోతున్న జాతుల జాబితాలో వున్న అలెగ్జాండ్రైన్‌ పారాకీట్‌, పెయింటెడ్‌ స్టార్‌ ఇక్కడ కనిపించాయి. పరిశ్రమల కాలుష్యం నుంచి అరుదైన మొక్కలు, జీవజాతుల రక్షణకు ఎవరు గ్యారంటీ ఇస్తారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. 


కాలుష్యంపై ఆందోళన

నక్కపల్లి పారిశ్రామిక పార్కు కోసం మండలంలోని రాజయ్యపేట, చందనాడ, డీఎల్‌.పురం, బుచ్చిరాజుపేట, వేంపాడు గ్రామాలకు చెందిన రెండు వేల మంది రైతుల నుంచి ఏపీఐఐసీ భూములు సేకరించింది. అయితే ఎక్కువగా రసాయన, పెట్రో రసాయన, ఔషధ పరిశ్రమలు వస్తాయని అధికారులు చెబుతుండడంతో కాలుష్య ప్రభావం ఎక్కువగా వుంటుందనే ఆందోళన ఆయా గ్రామాల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే హెటిరో డ్రగ్స్‌ నుంచి వచ్చే కాలుష్యం, వ్యర్థ జలాల కారణంగా ఈ ప్రాంతవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సముద్రంలో చేపల వేట లేక మత్స్యకారులు వలసపోతున్నారు. ఇప్పుడు ఈ పారిశ్రామిక పార్కుతో మరింత దుర్భర పరిస్థితులు వస్తాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


మత్స్యకార గ్రామాలపై ప్రభావం

కంపెనీలు ఏర్పాటుచేయనున్న ప్రాంతంలో గల 14 మత్స్యకార గ్రామాల్లో 5,127 కుటుంబాలకు చెందిన 20,500 మంది ప్రజలు జీవిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు స్థానికులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ఎంతవరకు లభిస్తుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 


ముందు పరిహారం సంగతి తేల్చాలి

నక్కపల్లి పారిశ్రామిక పార్కు కోసం భూములు ఇచ్చిన రైతుల్లో ఇంకా చాలామందికి పరిహారం అందలేదు. 2013 భూసేకరణ చట్టం మేరకు పరిహారం చెల్లించాలి. భూముల్లో గల చెట్లకు కూడా పరిహారం ఇవ్వాలి. పారిశ్రామిక పార్కులో రసాయన, పెట్రో రసాయన పరిశ్రమలు నెలకొల్పాలనుకుంటే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేసి పరిసర గ్రామాలను తరలించాలి. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉపాధి విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలి. రోజువారీ కూలీలు, సెక్యూరిటీ గార్డులు, కలాసీ ఉద్యోగాలు కాకుండా చదువుకు తగిన ఉద్యోగాలు ఇవ్వాలి. 

- వంగలపూడి అనిత, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే

Read more