పంచగ్రామాల భూ సమస్యపై సీఎంకు లేఖ

ABN , First Publish Date - 2020-11-01T05:11:59+05:30 IST

పంచగ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భూ యజమానులను హక్కుదారులుగా గుర్తించాలని, క్రయవిక్రయాలు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసినట్లు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజ శర్మ తెలిపారు.

పంచగ్రామాల భూ సమస్యపై సీఎంకు లేఖ
సమావేశంలో మాట్లాడుతున్న అజ శర్మ

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ

సీతమ్మధార, అక్టోబరు 31: పంచగ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భూ యజమానులను హక్కుదారులుగా గుర్తించాలని, క్రయవిక్రయాలు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసినట్లు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజ శర్మ తెలిపారు. సీతమ్మధారలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన లేఖలోని అంశాలు వివరించారు. 2019లో జీవో నబర్‌ 794 ద్వారా వేసిన కమిటీకి అదనంగా మరో ముగ్గురు సభ్యులను జోడిస్తూ ఈనెల 29న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 854 జారీ చేసిందన్నారు. అయితే గత కమిటీ వేసి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం మాత్రం ప్రభుత్వం సూచించలేదన్నారు. తాజాగా కమిటీలో ముగ్గురిని కలపడం వల్ల ప్రభుత్వం ఏమి ఆశిస్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు. ఈ జీవోలోని రెండు అంశాలు పరిశీలిస్తే అసలు ప్రభుత్వానికి సమస్యపై అవగాహన ఉందా? అన్న సందేహం కలుగుతోందన్నారు. సింహాచలం భూ క్రమబద్ధీకరణకు ఈ జీవోలు జారీచేసినట్లు పేర్కొన్నారని, తక్షణం భూములపై సమగ్ర సర్వే జరపాలని డిమాండ్‌ చేశారు. కక్షిదారుగా ఉన్న దేవస్థానం ఈవోను ఈ కమిటీకి కన్వీనర్‌గా నియమించడం ఏ రకంగానూ సహేతుకం కాదన్నారు. తక్షణం ఈవోను కమిటీ నుంచి తొలగించాలని కోరారు. అలాగే ఈ సమస్యపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉన్న స్థలాల క్రయవిక్రయాలకు, నిర్మాణాలకు అనుమతించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రంచగ్రామాల ప్రజా, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై.కె.నాయుడు, కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-01T05:11:59+05:30 IST