పరిపాలనా రాజధానిగా విశాఖ.. ఏ కార్యాలయం... ఎక్కడంటే..!
ABN , First Publish Date - 2020-08-01T15:08:49+05:30 IST
విశాఖపట్నం పరిపాలన కేంద్రంగా రాజముద్ర వేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి అనధికార ఆర్థిక రాజధానిగా వున్న విశాఖ... అతిత్వరలో రాష్ట్ర పరిపాలన కేంద్రంగా కూడా మారనున్నది.

రాజముద్ర... ఎగ్జెక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ
మూడు రాజధానులకు గవర్నర్ రాజముద్ర
సీఎంఓ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే...
ఇప్పటికే కొన్ని శాఖలకు కార్యాలయాలు ఖరారు
త్వరలో సీఎం చేతులు మీదుగా భవన నిర్మాణాలకు శంకుస్థాపన
ఆగస్టు 15 తరువాత అమరావతి నుంచి ఒక్కటొక్కటిగా కార్యాలయాల తరలింపు?
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పరిపాలన కేంద్రంగా రాజముద్ర వేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి అనధికార ఆర్థిక రాజధానిగా వున్న విశాఖ... అతిత్వరలో రాష్ట్ర పరిపాలన కేంద్రంగా కూడా మారనున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం సహా వివిధ ప్రభుత్వ శాఖల రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో అత్యధిక శాతం విశాఖలో ఏర్పాటు కానున్నాయి.
ఆగస్టు 15 తరువాత?
ఆగస్టు 15వ తేదీ తరువాత అమరావతి ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకదాని తరువాత మరొకటి విశాఖపట్నం తరలి వస్తాయని అధికార వర్గాల సమాచారం. మంచి మూహూర్తం చూసుకొని రాజధాని నిర్మాణాలకు సీఎం చేతులు మీదుగా శంకుస్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత నవ్య ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని నూతన రాజధానిగా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. దీనిపై ఉత్తరాంధ్రాలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. చట్ట బద్ధంగానే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ గత ఏడాది సెప్టెంబరులో జీఎన్ రావు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని ప్రాంతాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి, పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా డిసెంబరు నెలాఖరున నివేదిక సమర్పించింది. దీనిపై ప్రతిపక్షాలు, అమరావతికి 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన రైతుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆపై బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక అంటూ మరోకటి తెర పైకి తీసుకువచ్చింది. దీంతో విశాఖకు పరిపాలన రాజధానిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయింది. విశాఖలో ఇందుకు అవసరమైన కార్యాలయాలను ఎంపిక చేసుకోవాలని అన్ని శాఖల అధిపతులకు సూచించింది. రెవెన్యూ, ఐటీ, జల వనరులు, ఆర్అండ్బీ, పురపాలన, పట్టణాభివృద్ధి, రిజిస్ట్రేషన్లు... ఇలా అన్ని శాఖల అధిపతులు ఏదో ఒక సమయంలో విశాఖపట్నం వచ్చి, తమ శాఖకు అనుకూలమైన భవనాలను పరిశీలించుకున్నారు. కుటుంబాలతో సహా వస్తే... ఉండేందుకు అవసరమైన నివాసాలను కూడా అదే సమయంలో చూసుకున్నారు.
మారిన పరిణామాలతో ఆగిన తరలింపు
జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్నీ ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించి కేబినెట్‌కు నివేదికను సమర్పించింది. చట్టసభ ఆమోదం కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా... ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేసింది. తరువాత జనవరి 20న అసెంబ్లీ ఆమోదించింది. 22న శాసన మండలి ముందుకు బిల్లును తీసుకువచ్చారు. అక్కడ కూడా ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మండలిలో తెలుగుదేశానికి ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో శాసన మండలిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది.
ఉగాదికి రావాలని మరో యత్నం
తెలుగు సంవత్సరాది ఉగాదినాటికి విశాఖ తరలి రావాలని ప్రభుత్వం మరో యత్నం చేసింది. అది కూడా బెడిసి కొట్టింది. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎన్నికల కమిషనర్ మార్పు, కరోనా వైరస్ వ్యాప్తి ఇలా... ఒక దాని తరువాత మరొకటి రావడంతో వేసవి సెలవుల తరువాత కార్యాలయాలు తరలించాలని యోచించారు. అయితే కరోనా వైరస్ తగ్గకపోవడంతో తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇదే సమయంలో రాజ్యాంగ పరంగా అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చారు. రెండోసారి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తరువాత ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ హరిచంద్ బిశ్వభూషణ్ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు సీఆర్డీఏ చట్టం రద్దుకు కూడా రాజముద్ర వేశారు. దీంతో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారినట్టయ్యింది.
కాపులుప్పాడలోనే సీఎం కార్యాలయం
విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అనగానే.. ఎంపీ విజయసాయిరెడ్డి భీమిలి నియోజకవర్గంలోనే రాజధాని వస్తుందని ప్రకటించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా మధురవాడ ప్రాంతంలో పర్యటించినప్పుడల్లా ‘ఇదంతా రాజధాని ప్రాంతం’ అని అంటుంటారు. సీఎం సలహాదారు అజయ్ కల్లం, సీఎం పేషీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి... తదితరులు విశాఖలో ప్రభుత్వ అవసరాలకు అనువైన భూములు, భవనాల కోసం అన్వేషించారు. మొదట రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. అప్పటికే అందులో కాండ్యుయెంట్ కంపెనీ ఉండడం, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు పోతాయని ఐటీ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఐటీ సెక్రటరీ కోన శశిధర్, ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి విశాఖపట్నం వచ్చి... అటువంటిదేమీ లేదని, అందులో సీఎం కార్యాలయం రాదని ప్రకటించారు. అయితే ఆ పక్కనే మిలీనియం టవర్-2 నిర్మాణాన్ని వేగవంతం చేశారు. దానిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోనున్నారు.
ఏ కార్యాలయం... ఎక్కడ...
రుషికొండ ఐటీ పార్కులో స్టార్టప్ విలేజ్ భవనాన్ని సీఎం కార్యాలయం కోసం వినియోగిస్తారని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ భవనం ఖాళీగా ఉంది. అందులో స్టార్టప్ కంపెనీలన్నింటినీ ఏడాది క్రితమే ఖాళీ చేయించారు.
ఐటీ పార్కులో ఓ రాజకీయ నాయకుడికి చెందిన భవనాన్ని డీజీపీ కార్యాలయం కోసం మాట్లాడారు. మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఉన్న ఆ భవనంలో మరో అంతస్థు నిర్మించే అవకాశం కోసం పరిశీలిస్తున్నారు. ఇది దాదాపు ఖరారైనట్టే.
కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ కార్యాలయం ఉంది. అక్కడ భద్రత ఎక్కువ. అందులోనూ కొన్ని నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. వాటికే సీఎం జగన్ చేతులు మీదుగా శంకుస్థాపన జరుగుతుందని పార్టీ వర్గాల సమాచారం.
బోయపాలెంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అల్లుడికి చెందిన పైడా విద్యా సంస్థల భవనాలను కూడా అజయ్ కల్లం, తదితరులు పరిశీలించారు. అవి ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడతాయి. వీటిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది.
నగరంలోని ఏలేరు గెస్ట్‌హౌస్‌ను జల వనరుల శాఖ రాష్ట్ర కార్యాలయంగా, మర్రిపాలెంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను ఆ శాఖ ప్రధాన కార్యాలయం కోసం వినియోగించుకుంటారని సమాచారం.
రుషికొండ ఐటీ పార్కులో పరిశ్రమలు, ఐటీ శాఖల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
రాష్ట్ర టౌన్‌ప్లానింగ్ కార్యాలయం కోసం మద్దిలపాలెం ఆటోమోటివ్ సమీపాన వీఎంఆర్డీఏ షాపింగ్ కాంప్లెక్స్‌ను రిజర్వ్ చేసి ఉంచారు.
అభివృద్ధిని ఆహ్వానిద్దాం: కేఎస్ చలం, మాజీ వైస్ ఛాన్సలర్
మూడు రాజధానుల నిర్ణయాన్ని అభివృద్ధి కోసం ఆహ్వానించాల్సిందే. విశాఖలో పరిపాలన రాజధాని వల్ల ఉత్తరాంధ్రాతో పాటు కళింగాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాంత అస్తిత్వం నిలబడుతుంది. ఇక్కడి వారికి మంచి జరుగుతుంది.
పరిశ్రమలకు వేగంగా అనుమతులు: ఎం.సుధీర్, ఛైర్మన్, ఏపీ చాంబర్స్
పరిపాలన రాజధాని ఏర్పాటైతే సచివాలయం ఇక్కడే ఉంటుంది. పరిశ్రమలకు అవసరమైన అనుమతులు త్వరగా లభిస్తాయి. వాటి అవసరం విశాఖకే ఎక్కువ అవసరం. నగరం కూడా కొత్త అవసరాలకు తగినట్టు అభివృద్ధి చెందుతుంది. మరోసారి విశాఖకు బూస్ట్ వస్తుంది. పౌర సదుపాయాలు మెరుగుపడతాయి.
భూముల ధరలు పెరగకుండా చూడాలి: పి.కోటేశ్వరరావు, ఛైర్మన్, క్రెడాయ్
విశాఖలో పరిపాలన రాజధాని వల్ల నిర్మాణ రంగం మరింత వృద్ధి చెందుతుంది. అనుబంధ రంగాలతోపాటు నైపుణ్యం కలిగిన వారికి, అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే భూముల ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.