అక్కడ నిశ్శబ్ద రాజ్యం

ABN , First Publish Date - 2020-05-09T07:10:02+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పక్కపక్కనే ఉన్న ఈ ఐదుగ్రామాలు

అక్కడ నిశ్శబ్ద రాజ్యం

నిర్మానుష్యంగా పాలిమర్స్‌ బాధిత గ్రామాలు

లీకేజీ ఘటనానంతరం ఖాళీ చేయించిన అధికారులు

ప్రస్తుతం వీరంతా పునరావాస కేంద్రాల్లో

నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న వీధులు

ఇళ్లకు తాళాలు వేయడంతో పోలీసుల పహారా 

 

విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి):

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. పక్కపక్కనే ఉన్న ఈ ఐదుగ్రామాలు ఒకప్పుడు నిత్యం జనసంచారంతో కళకళలాడేవి. అటువంటి గ్రామాల్లో వీధులన్ని బోసిపోయి ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో 12 మంది చనిపోగా పలువురు ఆస్పత్రిపాలయ్యారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రస్తుతం ఈ ఐదు గ్రామాల్లో ప్రజలను బయటకు తరలించారు. శుక్రవారం కూడా గ్రామాల్లోకి రావడానికి ఎవరూ సాహించలేదు. కట్టుబట్టలతో పరుగులు తీసిన వారిలో కొద్దిమంది మాత్రం ఇళ్లకు వచ్చి అవసరమైన దుస్తులు, ఇంట్లోని విలువైన వస్తువులు తీసుకుని వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు తప్ప ఇళ్లలో ఉండేందుకు సాహసించలేదు.


గ్రామాల్లో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా కనిపించే గ్రామాల్లో పలకరించే మనిషి కరువయ్యాడు. వెంకటాపురం, పద్మనాభనగర్‌, కంపరపాలెం, నందమూరినగర్‌, ఎస్‌సీబీసీ నగర్‌ పక్కపక్కనే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కంపెనీలు, ప్రైవేటు సంస్థలలో పనిచేసే వ్యక్తులు మరికొందరు రైతులు ఈ గ్రామాల్లో ఉన్నారు. దాదాపుగా మధ్యతరగతి కుటుంబాలే అధికం. కొందరు అక్కడి పాలిమర్స్‌లో పనిచేసే ఉద్యోగులు, రోజువారీ కూలీలు కూడా ఉన్నారు. గోపాలపట్నం-సింహాచలం జంక్షన్‌కు దగ్గరలో ఉండే ఈ గ్రామాల్లో అర్ధరాత్రి వరకు సందడి ఉండేది. అటువంటిది గురువారం ఉదయం నుంచి ఊళ్లన్ని బోసిపోయి ఉన్నాయి. గ్యాస్‌లీక్‌తో వేళ్లమీద లెక్కించే కుక్కలు తప్ప మిగిలిన  జంతువులు చనిపోయాయి.


చివరకు బతికి ఉన్న కుక్కలకు తిండేదొరికే పరిస్థితి లేకుండా పోయింది. కంపెనీలో గ్యాస్‌ లీక్‌ పూర్తిగా అరికట్టక పోవడంతో గ్రామాల వైపు ఘాటు వాసన వస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు గ్రామాల్లోకి ప్రజల్ని అనుమతించడానికి అధికారులు నిరాకరించారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రావడానికి మరో 24 గంటలు పడుతుందని మంత్రులే స్వయంగా చెప్పారు. నిపుణుల అంచనా మేరకు శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయానికి గ్యాస్‌ తీవ్రత తగ్గనున్నది. గ్యాస్‌ పూర్తిగా అరికట్టిన తరువాత నిపుణులు ఆ గ్రామాల్లో పర్యటించి ఒక అంచనాకు వస్తేతప్ప ప్రజలకు అనుమతించే అవకాశం లేదు. అప్పటి వరకు ఐదు గ్రామాల ప్రజలు పునరావాస శిబిరాల్లో తలదాచుకోవల్సిందే. 

Updated Date - 2020-05-09T07:10:02+05:30 IST