వైద్యులు లేని ఆస్పత్రి
ABN , First Publish Date - 2020-11-13T05:48:19+05:30 IST
మండలంలో 23 పంచాయతీలకు చెందిన సుమారు 50 వేల మంది ప్రజలకు వైద్య సేవలు అందించే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో ఒక్కరంటే ఒక్క డాక్టర్ కూడా లేరు.
ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో స్టాఫ్‌నర్సులే పెద్ద దిక్కు
రెగ్యులర్ ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయిన కాంట్రాక్టు వైద్యులు
40 రోజులైనా డాక్టర్లను నియమించని అధికారులు
సీహెచ్‌సీగా రెండేళ్ల క్రితం అప్‌గ్రేడ్
ఐదుగురు స్పెషలిస్టులకుగాను ఒక్క పోస్టు కూడా భర్తీకాని వైనం
గైనికాలజిస్టు లేకపోవడంతో ప్రత్యేక వైద్యానికి నోచుకోని గర్భిణులు
సాధారణ రోగులకు సైతం అరకొర వైద్య సేవలు
ముంచంగిపుట్టు, నవంబరు 12: మండలంలో 23 పంచాయతీలకు చెందిన సుమారు 50 వేల మంది ప్రజలకు వైద్య సేవలు అందించే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో ఒక్కరంటే ఒక్క డాక్టర్ కూడా లేరు. సుమారు 40 రోజుల నుంచి వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్సులే పెద్ద దిక్కు అయ్యారు. ఇది పేరుకే సీహెచ్‌సీ.. కనీసం పీహెచ్‌సీ స్థాయిలో కూడా వైద్య సేవలు అందడంలేదని మండలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి శనివారం (వారపు సంత జరిగే రోజు) 150 నుంచి 250 మంది, సాధారణ రోజుల్లో 100 నుంచి 150 మంది వరకు రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటుంటారు. దీనిని రెండేళ్ల క్రితం పీహెచ్‌సీ నుంచి సీహెచ్‌సీకి అప్‌గ్రేడ్ చేశారు. నిబంధనల ప్రకారం ఐదుగురు వైద్య నిపుణులు వుండాలి. కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఇద్దరు సాధారణ వైద్యులే (ఎంబీబీఎస్) సేవలు అందిస్తున్నారు. వీరు ఇటీవల రెగ్యులర్ వైద్యాధికారి పోస్టులకు ఎంపిక కావడంతో ఇతర ఆస్పత్రుల్లో నియమితులయ్యారు. దీంతో సుమారు ఏడు వారాల నుంచి ఇక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. వారి స్థానంలో వైద్యులను నియమించకపోవడంతో స్టాఫ్ నర్సులే పెద్ద దిక్కు అయ్యారు. దీంతో సాధారణ జ్వరాలు, చిన్నాచితకా రోగాలు మినహా ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు మండలం కేంద్రం నుంచి సుమారు 50 కి.మీ. దూరంలో వున్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తున్నది. మారుమూల గ్రామాల నుంచి అయితే 70 నుంచి 80 కి.మీ. దూరం ప్రయాణించాలి.
సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)గా అప్‌గ్రేడ్ చేసిన ఈ ఆస్పత్రిలో ఐదుగురు వైద్య నిపుణులు వుండాలి. ఇంతవరకు ఒక్క స్పెషలిస్టు డాక్టర్‌ని కూడా నియమించలేదు. ప్రధానంగా గైనికాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణిలకు వైద్య సేవలు అందడంలేదు. ప్రధాన్ మంత్రి సురక్షిత్ మంత్రిత్వ అభియాన్ (పీఎంఎస్‌ఎంఏ) పథకం కింద ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు, అలా్ట్రసౌండ్ స్కానింగ్ చేయాలి. కానీ ఇక్కడ గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు జరగడంలేదు. సాధారణ ప్రసవం అయ్యే పరిస్థితి లేకపోయినా, గర్భిణులకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వున్నా.... పాడేరు ఆస్పత్రికి తరలించాల్సి వస్తున్నది.
ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో 40 రోజుల నుంచి వైద్యులు ఎవరూ లేకపోవడంపై డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లక్ష్మణరావుని వివరణ కోరగా, ఇటీవల వరకు పనిచేసిన కాంట్రాక్టు వైద్యులకు రెగ్యులర్ పోస్టులు రావడంతో వెళ్లిపోయారని, వారి స్థానంలో వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.