విశాఖలో.. కరోనాకు బ్రేక్?

ABN , First Publish Date - 2020-04-14T16:05:47+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందుకు భిన్నంగా..

విశాఖలో.. కరోనాకు బ్రేక్?

వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు నిల్‌

కొవిడ్‌-19 ఆగినట్టేనా?? 

నగరవాసుల్లో చర్చ

మరోవైపు నగరంలోని కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో బాలుడి మృతితో కలవరం

వారం రోజులుగా ఆయాసంతో బాధపడుతున్నట్టు చెబుతున్న స్థానికులు

గుర్తించని యంత్రాంగం

సమాచార సేకరణలో వార్డు వలంటీర్ల విఫలం

ఇంకొకవైపు మూడో విడత సర్వే చేపట్టినట్టు అధికారుల వెల్లడి

అది కూడా 77 శాతం పూర్తయిందట


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందుకు భిన్నంగా విశాఖపట్నం జిల్లాలో వారం రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదు. ఇప్పటివరకు మొత్తం 20 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఈ నెల ఆరో తేదీన నమోదైనదే ఆఖరి కేసు. ఇది నిజంగా శుభపరిణామమే. అయితే ప్రభుత్వం కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్‌ (రెడ్‌ జోన్‌)గా ప్రకటించిన అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్‌లో సోమవారం ఉదయం ఓ బాలుడు మృతిచెందాడు. పోలియో బాధితుడైన ఆ బాలుడు వారం రోజులుగా ఆయాసంతో బాధపడుతున్నాడని స్థానికుల సమాచారం. చుట్టుపక్కలవారు మరణవార్త అందించగా రెవెన్యూ, పోలీస్‌, వైద్య విభాగాల సిబ్బంది వచ్చి...శవం నుంచి నమూనాలు సేకరించుకుని వెళ్లారు. తాము చెప్పేంత వరకు శవాన్ని ముట్టుకోవద్దని ఆదేశించారు. సాయంత్రం 4.30 గంటల తరువాత భౌతికకాయాన్ని జ్ఞానాపురం శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అంటే...ప్రమాదం ఏమీ లేదనే భావించాలి. అయితే ఈ సమాచారం జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లలేదని తెలిసింది.


కరోనా సర్వే ఇలాగేనా?

ఇక్కడ ఓ విషయం గమనించాలి. నగరంలో కరోనా లక్షణాలు వున్నవారు ఎవరైనా ఉన్నారా? అని సిబ్బంది జల్లెడ పట్టి గాలిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రెండుసార్లు ఇంటింటి సర్వే చేయగా, ఈ నెల ఎనిమిదో తేదీన మూడో విడత సర్వే మొదలైందని ప్రకటించారు. ఇందులో కూడా ఈ నెల పదో తేదీ నాటికే 77.97 శాతం పూర్తయినట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబుకు నివేదిక సమర్పించారు. అదే నిజమైతే శ్రీనివాసనగర్‌లో బాలుడు అనారోగ్యంతో వున్న విషయం సర్వే సిబ్బంది గుర్తించి అధికారులకు తెలియజేయాల్సి ఉంది. కానీ అది జరగలేదు. అంటే ఇంటింటికీ తిరగడం లేదు. అయితే ఏమైనా అవుతుందేమోననే భయంతోనే సర్వే సిబ్బంది ఇంటింటికీ వెళ్లడం లేదని అంటున్నారు. ఇది కొంతవరకూ వాస్తవం.


కొవిడ్‌-19 కేసులు నమోదైన ముస్లిం తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లోనే సర్వే సమగ్రంగా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లోనే పూర్తి వివరాలు సేకరించకపోతే...ఇక మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. సర్వే సిబ్బందికీ సమస్యలు ఉన్నాయి. వారిని అక్కడక్కడా అపార్టుమెంట్లు, గ్రూప్‌ హౌస్‌లోకి అనుమతించడం లేదు. వారికి మాస్కులు తప్ప ఇతర రక్షణ పరికరాలు ఏమీ ఇవ్వలేదు. ఇంటింటికి కాలినడకనే తిరగాలి. ఈ పరిస్థితుల్లో కేవలం వారు ఇచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని నగరంలో ఎక్కడా కరోనా లక్షణాలు వున్నవారు లేరని నిర్ధారణకు రావడం సముచితం కాదేమో...అధికారులు ఆలోచించాలి.

Updated Date - 2020-04-14T16:05:47+05:30 IST