-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » no celebrations on new year
-
న్యూ ఇయర్ వేడుకలకు నో...
ABN , First Publish Date - 2020-12-30T06:05:25+05:30 IST
కొవిడ్-19 రెండో దశ వ్యాప్తిలో వున్నందున హోటళ్లు, పంక్షన్ హాళ్లతోపాటు ఆరుబయట ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఈ ఏడాది అనుమతి ఇవ్వడం లేదని నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్‌సిన్హా తెలిపారు.

హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, ఆరు బయట ప్రదేశాల్లో నిషేధం
రోడ్లపై కేక్‌లు కట్ చేసినా, అరిచినా, ఎక్కువమంది గుమికూడినా కఠిన చర్యలు
బీచ్ రోడ్డులోకి నో ఎంట్రీ
మద్యం సేవించి వాహనాలను నడిపితే వాహనాలు సీజ్
ప్రజలంతా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలి
కొవిడ్-19 రెండో దశ వ్యాప్తిలో ఉన్నందునే జాగ్రత్తలు
నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్‌సిన్హా
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
కొవిడ్-19 రెండో దశ వ్యాప్తిలో వున్నందున హోటళ్లు, పంక్షన్ హాళ్లతోపాటు ఆరుబయట ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఈ ఏడాది అనుమతి ఇవ్వడం లేదని నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్‌సిన్హా తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అయితే ఈ సంవత్సరం కొవిడ్ నేపథ్యంలో వీటికి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. ప్రజలంతా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సీపీ సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో డ్యాన్సులు వంటివి నిషిద్ధమన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రోడ్లపై కేక్‌లు కట్ చేసి వాహనాలకు ఇబ్బంది కలిగించినా, ఎక్కువమంది గుమికూడినా, శుభాకాంక్షలు పేరుతో మహిళలను వేధించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి రోడ్లపై అరవడం, అల్లర్లకు పాల్పడడం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చి ఇరుగుపొరుగున వుండే వారిని ఇబ్బందికి గురిచేయవద్దని సీపీ సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి ఎనిమిది గంటల వరకూ, బార్లు రాత్రి 11 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. ఆయాచోట్ల కొవిడ్ నిబంధనల ప్రకారం వినియోగదారులను అనుమతించడం, విక్రయాలు జరపడం చేయాల్సి ఉంటుందన్నారు. 21 సంవత్సరాలు లోపు వయస్సు వారికి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలకు గురికావాల్సి వుంటుందని విక్రయదారులను హెచ్చరించారు. ప్రార్థనా మందిరాల్లో కూడా కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని స్పష్టంచేశారు. బీచ్‌రోడ్డులోకి వాహనాలకు, సందర్శకులకు అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని నగరవాసులు గమనించి పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.