ఏడి‘పింఛన్‌’

ABN , First Publish Date - 2020-02-08T11:37:47+05:30 IST

జిల్లాలో 40 వేలకు పైగా పింఛన్లు రద్దు చేసేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు...

ఏడి‘పింఛన్‌’

  • పెన్షన్‌ రద్దుతో లబ్ధిదారుల గగ్గోలు
  • నోటికాడ కూడు లాగేశారని ఆవేదన
  • ఒక్కొక్కరికి ఒక్కో వ్యధ

(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

జిల్లాలో 40 వేలకు పైగా పింఛన్లు రద్దు చేసేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు...ఏ ఆధారం లేదని ఎన్నో దరఖాస్తులు పెట్టుకుంటే ఏళ్ల కిందట పింఛన్లు మంజూరయ్యాయి. ఎవరిపైనా ఆధార పడకుండా ఆ డబ్బుతో ఏదో బతుకులు ఈడుస్తున్నామని వారు భావిస్తుంటే...ఇప్పుడు ప్రభుత్వం అర్ధంతరంగా వాటిని రద్దు చేసేసింది. ఇప్పుడు తామెలా బతికేదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నోటి కూడా ముద్ద లాక్కున్నారని వాపోతున్నారు.

పింఛన్లు రద్దయి వారం రోజులైంది. పింఛన్లపైనే ఆధారపడి బతికే కుటుంబాల్లో వారం రోజులుగా తిండితిప్పలు లేవు. అందరిలోను ఒకటే ఆందోళన. పింఛన్లు మళ్లీ ఎలా వస్తాయనే. రద్దు చేసినందుకు అధికారులు చూపిస్తున్న కారణాలు చూసి అంతా తెల్లబోతున్నారు. ఏ దిక్కూ లేని 80 ఏళ్ల తల్లిని ఇంట్లో వుంచుకుని సాకుతున్న ఓ వితంతువుకు పింఛన్‌ (ఆమె తల్లిది కూడా) రద్దు చేసేశారు. అదేమంటే...ఒకే రేషన్‌ కార్డులో ఇద్దరికి పింఛన్లు వస్తున్నాయని సెలవిచ్చారు. ఇంకొక వృద్ధుడికి ఇల్లు 750 అడుగుల విస్తీర్ణంలో ఉందని పింఛను తీసేశారు. అదేంటి బాబూ ఇల్లు వుంటే పింఛను ఇవ్వరా? అంటూ వాపోతున్నాడు. ఇలా ఎవరిని కదిపినా కన్నీటి కథలే. బతుకు వ్యధలే. పింఛన్‌ రూ.250 పెంచారనే సంతోషం ఎంతోకాలం వుండనివ్వలేదని, పూర్తిగా ఆశారని, ఇదెక్కడి పాలన అంటూ అంతా శాపనార్థాలు పెడుతున్నారు. 

Updated Date - 2020-02-08T11:37:47+05:30 IST