144 కరోనా కేసుల్లో కొత్త రికార్డు

ABN , First Publish Date - 2020-07-10T09:52:00+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. రోజూ రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు ..

144  కరోనా కేసుల్లో కొత్త రికార్డు

జిల్లాలో 1,807కు చేరిన పాజిటివ్‌లు

జీవీఎంసీ 98వ వార్డులో 15 మందికి వైరస్‌

ఆలయాల్లో 12 మంది ఉద్యోగులకు....

గోపాలపట్నంలో 8, అల్లిపురంలో 4, వెంకోజీపాలెంలో 3 కేసులు

చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి

15కు చేరిన కొవిడ్‌ మరణాలు


విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్‌ మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. రోజూ రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం 144 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1807కు చేరింది. జీవీఎంసీ 98వ వార్డులో 15 మంది, గోపాలపట్నం ప్రాంతంలో ఎనిమిది మంది, వైరస్‌ బారిన పడ్డారు. దేవదాయశాఖ పరిధిలోని వివిధ ఆలయాల్లో పని చేస్తున్న 12 మంది సిబ్బందికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. జిల్లాలో వైరస్‌ బారినపడిన వారిలో 879 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 913 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా వైరస్‌ బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందగా, కొవిడ్‌ మరణాల సంఖ్య 15కు చేరింది. 


98వ వార్డు పరిధిలో 15 మందికి..

జీవీఎంసీ 98వ వార్డు పరిధిలో గురువారం 13 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సింహాచలనగర్‌కు చెందిన ఓ యువకుడికి రెండో తేదీన పాజిటివ్‌ రాగా, అతని కాంటాక్ట్‌ హిస్టరీగా భావించిన సుమారు 85 మందికి నాలుగో తేదీన కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. గురువారం వచ్చిన ఫలితాల్లో 15 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీరిలో ఏడుగురు సింహాచలనగర్‌ కాలనీకి చెందినవారుకాగా, గోశాల నిర్వాసితుల లే అవుట్‌లో ఒకరు, గోశాల కూడలి వద్ద ఒకరు, గాంధీనగర్‌లో తండ్రీకొడుకులతోపాటు మరో ఇద్దరు, పాత అడివివరంలో ఒక దినపత్రిక విలేకరితోపాటు మరొకరు వున్నారు. సింహాచల దేవస్థానం కేశఖండనశాలలో పనిచేస్తున్న వారిలో పలువురు సింహాచలనగర్‌ ప్రాంతానికి చెందిన వారు కావడంతో గురువారం కేశ ఖండనశాలను మూసి వేశారు.  


దేవదాయ శాఖలో 12 మందికి...

దేవదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాల్లో 12 మంది ఉద్యోగులు వైరస్‌ బారినపడ్డారు. అర్చకులు, అధికారులు, సిబ్బందికి ఇటీవల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, గురువారం వచ్చిన ఫలితాల్లో వీరికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో వన్‌టౌన్‌లోని నాలుగు ఆలయాలకు చెందిన ఆరుగురు, నక్కవానిపాలెం ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ అర్చకుడు, తొమ్మిదో వార్డు(పాత)లో ఏఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన అర్చకుడు, పదో వార్డులో కేఆర్‌ఎంకాలనీలో వుంటున్న ఉద్యోగి వున్నారు. మరో వంద మంది ఉద్యోగుల ఫలితాలు రావాల్సి ఉంది.  


గోపాలపట్నంలో మరో ఎనిమిది..

గోపాలపట్నంలో మరో ఎనిమిది మంది కరోనా వైరస్‌బారిన పడ్డారు. దోభీ కాలనీలో 2, కొత్తపాలెంలో 3, పాతగోపాలపట్నంలో 1, గోపాలపట్నంలో 2 కేసులు నమోదయ్యాయి. 


వేములవలసలో ఐదుగురికి...

ఆనందపురం మండలం వేములవలసలో ఐదుగురు వైరస్‌బారిన పడ్డారు. వీరిలో 24 ఏళ్ల యువతి, 44 ఏళ్ల మహిళతోపాటు ఇద్దరు సచివాలయ సిబ్బంది, పూల మార్కెట్‌కు చెందిన మహిళ వున్నారు. 


అల్లిపురంలో నాలుగు...

అల్లిపురం నేరెళ్లకోనేరు ప్రాంతానికి చెందిన నలుగురు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఓ వృద్ధుడు(60), ఓ మహిళ(40), 16 ఏళ్ల బాలిక, 15 ఏళ్ల బాలుడు ఉన్నారు. అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌ ప్రకటించి దారులన్నీ మూసి వేశారు. 


పెదవాల్తేర్‌ పరిధిలో మూడు.... 

పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన ఒకరితోపాటు ఈస్ట్‌ పాయింట్‌ కాలనీకి చెందిన వ్యక్తికి, పాండురంగాపురంలో మరో వ్యక్తికి వైరస్‌ సోకింది. 


జోడుగుళ్లపాలెంలో ముగ్గురికి..

 జోడుగుళ్లపాలెంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతానికి చెందిన 13, 15 ఏళ్ల బాలికలతోపాటు 25 ఏళ్ల యువకుడు వైరస్‌ బారినపడ్డారు. 


ఎంవీపీ కాలనీలో రెండు.. 

ఎంవీపీ కాలనీ సెక్టార్‌-10లో 35 ఏళ్ల వ్యక్తి, అప్పుఘర్‌లో 24 యువకుడు వైరస్‌బారిన పడ్డారు. 


మహారాణిపేట పరిధిలో..

మహారాణిపేట పరిధి ఆంథోనినగర్‌లో ఓ యువకుడు(30), రామ్‌నగర్‌లో ఓ మహిళ(45)కు కరోనా సోకినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు.


డాక్టర్స్‌ కాలనీలో....

డాక్టర్స్‌ కాలనీకి చెందిన మహిళ(60)కు కరోనా సోకింది. బ్రెయిన్‌ సమస్యతో ప్రథమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈమెకు వైరస్‌ సోకినట్టు అధికారులు గురువారం నిర్ధారించారు. 


సుజాతనగర్‌లో..

పెందుర్తి పరిధి సుజాతనగర్‌ 80 అడుగుల రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వ్యక్తి(53)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతనితో కాంటాక్ట్‌ అయిన వారిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. 


జలవనరుల సీఈ కార్యాలయంలో...

త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలోని ఉత్తరాంధ్ర జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీరు కార్యాలయంలో ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యుంది. దీంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 


మరో ఇద్దరు మృతి 

కరోనా బారినపడి చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు పురుషుడుకాగా మరొకరు మహిళ. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు రోజుల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 15కు చేరింది.

Updated Date - 2020-07-10T09:52:00+05:30 IST