యువకుడి మృతదేహంపై వీడిన మిస్టరీ.. ప్రియురాలి కుటుంబసభ్యులే..

ABN , First Publish Date - 2020-08-12T13:17:27+05:30 IST

నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన..

యువకుడి మృతదేహంపై వీడిన మిస్టరీ.. ప్రియురాలి కుటుంబసభ్యులే..

యువకుడిది హత్యే..

పెద్దచెరువు వద్ద లభ్యమైన యువకుడి మృతదేహంపై వీడిన మిస్టరీ

మృతుడు ఎస్సీ కాలనీకి చెందిన గారా కిశోర్‌

ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమంటూ మృతుని తండ్రి ఆరోపణ

నిందితులను అరెస్టు చేయాలని పోలీస్‌స్టేషన్‌ వద్ద బంధువుల ధర్నా


నర్సీపట్నం(విశాఖపట్నం): నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన యువకుడిది హత్యగా పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ఎస్సీ కాలనీకి చెందిన గారా కిశోర్‌గా గుర్తించారు. సీఐ స్వామినాయుడు మంగళవారం తెలిపిన వివరాలిలాఉన్నాయి. తన కుమారుడు కిశోర్‌(18) ఈనెల 4వ తేదీ నుంచి కనిపించడం లేదని ఎస్సీ కాలనీకి చెందిన గారా నర్సింగరావు 7వ తేదీన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఒక యువతిని ప్రేమిస్తున్నానని కుమారుడు తనతో చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐ తెలిపారు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సోమవారం నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభించిందని సీఐ తెలిపారు. బంధువులు మృతదేహం కిశోర్‌దని గుర్తించారన్నారు. దీనిపై ప్రాథమిక ఆధారాలు, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా

కిశోర్‌ హత్యకు అతను ప్రేమించిన యువతి బంధువులే కారణమని, నిందితులను అరెస్టు చేయాలని మృతుని బంధువులు మంగళవారం మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు. అనుమానితులను విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.


Updated Date - 2020-08-12T13:17:27+05:30 IST