గురందొరపాలెంలో మర్డర్‌పై వీడని మిస్టరీ!

ABN , First Publish Date - 2020-05-17T08:43:35+05:30 IST

మండలంలోని గురందొరపాలెంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య మిస్టరీ ఇంకా వీడలేదు.

గురందొరపాలెంలో మర్డర్‌పై వీడని మిస్టరీ!

 హతుని ఇంట్లో కూరగాయల కత్తి ఘటనా స్థలంలో లభ్యం

 అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేసిన పోలీసులు


నర్సీపట్నం టౌన్‌ : మండలంలోని గురందొరపాలెంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య ఎవరు.. ఎందుకు.. చేశారన్న  సమాచారం కోసం రూరల్‌ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సంఘటనా స్థలంలో మృతుని ఇంట్లో కూరగాయలు కోసిన కత్తి లభ్యం కావడం ఇందులో కొత్తకోణంగా కనిపిస్తోంది.  ఇసారపు చిరంజీవి (45) గ్రామ శివారులోని పశువుల పాక వద్ద శుక్రవారం అతికిరాతకంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఘటన జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, గ్రామస్థులెవరూ నోరు మెదపకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదు. నర్సీపట్నం ఇన్‌చార్జి ఏఎస్పీ సతీష్‌కుమార్‌ శుక్రవారం రాత్రి ఘటనా స్థలంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ జాగిలాలు పశువుల పాకలోకి వెళ్లి ఉండిపోయాయి. ఇదిలావుంటే, హతుడు చిరంజీవి ఇంట్లో కూరగాయలు కోసుకునే కత్తి హత్య జరిగిన ప్రాంతంలో లభ్యం కావడంతో దాని చుట్టూనే కథ మొత్తం నడుస్తోంది.  ఇటీవల చిన్న కూతురు వివాహం జరిగింది. పెళ్లి కొడుకు సామాజికవర్గం దాచి వివాహం చేశారని గత కొంత కాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు ప్రచారంలో ఉంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. రూరల్‌ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ రవికుమార్‌, కోటవురట్ల ఎస్‌ఐ సురేష్‌కుమార్‌, గొలుగొండ ఎస్‌ఐ నారాయణరావు శనివారం రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు. అయితే శుక్రవారం నాలుగు గంటల సమయంలో పశువుల పాక వద్ద ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. 

Updated Date - 2020-05-17T08:43:35+05:30 IST