ఇక పన్నుల బాదుడే!
ABN , First Publish Date - 2020-12-06T06:12:51+05:30 IST
మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, మునిసిపల్ కార్పొరేషన్‌లలో నివాస గృహాలు, దుకాణాలు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

మునిసిపాలిటీల్లో మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను
2021-22 ఆర్థిక సంవత్సరం నుంచే అమలు
జీవో 198ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
వార్షిక అద్దె విలువ విధానానికి మంగళం
నర్సీపట్నం, డిసెంబరు 5 : మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, మునిసిపల్ కార్పొరేషన్‌లలో నివాస గృహాలు, దుకాణాలు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నవంబరు 24న జీవో 198ను విడుదల చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న వార్షిక అద్దె విలువ విధానానికి స్వస్తి పలికి, ఈ కొత్త విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అమలులోకి తీసుకు రానుంది. ఈ మేరకు ఆయా శాఖల కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ దిశగా మునిసిపల్ అధికారులు అడు గులు వేస్తున్నారు. అయితే, కొత్త విధానం వల్ల ఇంటి పన్నుల భారం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తి మార్కెట్ విలువ పెంచినప్పుడల్లా ఇంటి పన్నులు కూడా పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు.
కొత్త విధానంలో పన్ను నిర్ణయం ఇలా..!!
ఈ కొత్త విధానం ప్రకారం నివాస గృహాలు, నాన్ రెసిడెన్షియల్ భవనాలు, ఖాళీ స్థలాలకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ నిర్ణయించిన మార్కెట్ ధర ప్రకారం పన్నులు విధిస్తారు. నివాస గృహాలకు చదరపు అడుగుకు మార్కెట్ విలువ ప్రకారం 0.1 నుంచి 0.5 శాతం, నాన్‌రెసిడెన్షియల్ భవనాలకు 0.2 నుంచి 2శాతం మధ్య పన్ను ఉంటుంది. ఖాళీ స్థలాకు మునిసిపాలిటీలో చదరపు గజానికి 0.2, కార్పొరేషన్‌లో 0.5 శాతం పన్ను నిర్ణయిస్తారు. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పేరుకుపోయి అపారిశుధ్యంగా ఉంటే 0.1, కార్పొరేషన్‌లలో 0.25 శాతం జరిమానా విధిస్తారు.