-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » mudarlova park development
-
మళ్లీ తెరపైకి ముడసర్లోవ పార్కు
ABN , First Publish Date - 2020-10-31T06:20:01+05:30 IST
ముడసర్లోవ పార్కు అభివృద్ధి ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఏడాదిన్నర క్రితం ద్రోణంరాజు శ్రీనివాసరావు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ పార్కుపై దృష్టిపెట్టారు.

రూ.52 కోట్లతో అభివృద్ధికి ఏడాదిన్నర క్రితం ప్రణాళిక
ఆదాయం రాదని వెనక్కి తగ్గిన వీఎంఆర్‌డీఏ
మరోవైపు పార్కు అప్పగించని జీవీఎంసీ
మంత్రి ఆదేశాలతో మళ్లీ కదలిక
తొలిదశలో రూ.19 కోట్లతో మౌలిక వసతుల కల్పనపై దృష్టి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ముడసర్లోవ పార్కు అభివృద్ధి ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఏడాదిన్నర క్రితం ద్రోణంరాజు శ్రీనివాసరావు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ పార్కుపై దృష్టిపెట్టారు. సుమారుగా రూ.52 కోట్లతో దానిని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఢిల్లీకి చెందిన సంస్థతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయించారు. పనులకు శంకుస్థాపన కూడా చేసేశారు. అయితే అన్నికోట్ల రూపాయలు ఖర్చు చేసినా...దానిపై వచ్చే ఆదాయం పార్కు నిర్వహణకు కూడా సరిపోదని ఒక అంచనాకు వచ్చి పనులను నిలిపివేశారు. తాజాగా మూడు రోజుల క్రితం ముడసర్లోవ రిజర్వాయర్‌లో సోలార్ ప్రాజెక్టు చూడడానికి వెళ్లిన మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్కు అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయంటూ జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులను ప్రశ్నించారు. దానికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక రెండు సంస్థల అఽధికారులు నీళ్లు నమిలారు. దాంతో పరిస్థితి అర్థం చేసుకున్న మంత్రి పనులను ప్రారంభించాలని, తనకు దానిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఇదీ నేపథ్యం
ముడసర్లోవ రిజర్వాయర్ వద్ద ఇరవై ఎకరాల్లో రెండు దశాబ్దాల క్రితం మునిసిపల్ కమిషనర్ విద్యాసాగర్ పార్కు అభివృద్ధి చేశారు. అయితే ఆ పార్కు నగరానికి దూరంగా వుండడంతో సందర్శకులు పెద్దగా వుండేవారు కాదు. ఆ ఏరియా అంతా నిర్మానుష్యంగా వుండడమే దీనికి ప్రధాన కారణం. ఆ తరువాత ఆ ప్రాంతాన్ని సింహాచలంతో కలుపుతూ బీఆర్‌టీసీ రహదారిని నాలుగు వరుసలతో నిర్మించారు. అక్కడకు సమీపంలో హెల్త్‌సిటీకి భూములు కేటాయించారు. దాంతో ఆ ప్రాంతం ఇప్పుడు ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. అయితే ముడసర్లోవ పార్కును మాత్రం పట్టించుకునేవారు లేకపోవడంతో కళావిహీనంగా ఉండిపోయింది. ఈ పార్కు జీవీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తోంది. అక్కడి రిజర్వాయరులో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుచేసిన తరువాత అధికారుల దృష్టి పార్కుపై పడింది. దానిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
రూ.52 కోట్లతో ప్రణాళిక
జీవీఎంసీ దగ్గర పార్కుల అభివృద్ధికి తగినన్ని నిధులు లేకపోవడంతో వీఎంఆర్‌డీఏకు ఆ బాధ్యత అప్పగించారు. కేవలం కార్తీక మాసంలో పిక్నిక్‌లకు, సాధారణ రోజుల్లో ప్రేమికులకు మాత్రమే ఉపయోగపడుతున్న పార్కును అందరినీ ఆకుట్టుకునేలా తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించారు. తొలుత రూ.19 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని, ఆ తరువాత ఆదాయం వచ్చేలా రూ.39 కోట్లతో వాణిజ్యపరమైన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. తొలిదశలో పార్కు ప్రవేశ ద్వారం, యాంఫీ థియేటర్, పిల్లలకు ప్లే ఏరియా, క్యాంటీన్, ఫుడ్ కోర్టులు వంటి పనులు చేపట్టాలని భావించారు.
తొలిదశ పనులకు ప్రణాళిక
పార్కును అభివృద్ధి చేయాలంటే...దానిని జీవీఎంసీ పూర్తిగా వీఎంఆర్‌డీఏకు అప్పగించాల్సి ఉంది. ఆ ప్రక్రియకు రెండు వర్గాలు ముందుకురాలేదు. రూ.52 కోట్లు ఖర్చు చేస్తే...ఆ తరువాత పార్కు నిర్వహణకు అయ్యే వ్యయం, సిబ్బంది, జీతాలు అన్నీ లెక్కలు వేశారు. అందుకు తగ్గట్టు ఆదాయం రాదని, పైగా అటు వైపు ఇంకా ప్రజలు ఆకర్షితులు కావడం లేదని గుర్తించి వీఎంఆర్‌డీఏ అధికారులు మిన్నకుండి పోయారు. ఆర్థిక ఇబ్బందులు కూడా వుండడంతో ఇరువర్గాలు మౌనంగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రి బొత్స సూచనతో తొలి దశ పనులు అయినా చేపట్టాలని అధికారులు పాత ప్రణాళికను పైకి తీస్తున్నారు. ఇవి ముందుకు సాగాలంటే...అధికారికంగా జీవీఎంసీ ఆ పార్కును వీఎంఆర్‌డీఏకి అప్పగించాల్సి ఉంది.