వచ్చే నెల ఒకటి నుంచి కొత్త మోటారు వాహనాల చట్టం అమలు.. గీత దాటితే మోతే!

ABN , First Publish Date - 2020-12-11T06:09:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన కొత్త మోటారు..

వచ్చే నెల ఒకటి నుంచి కొత్త మోటారు వాహనాల చట్టం అమలు.. గీత దాటితే మోతే!

ఉల్లంఘనులకు భారీగా జరిమానా

హెల్మెట్‌ లేకుంటే రూ.1,035

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కు రూ.5,035

మైనర్లకు వాహనం ఇస్తే రూ.5,035

రెండోసారైతే రెట్టింపు జరిమానా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన కొత్త మోటారు వాహనాల చట్టం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి రాబోతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి విధించే అపరాధ రుసుము ఈ చట్టం ప్రకారం భారీగా పెరగనున్నది. 


రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది. నిబంధనల ఉల్లంఘనులకు ఇప్పటివరకూ విధిస్తున్న అపరాధ రుసుమును భారీగా పెంచింది. ఒకసారి ఉల్లంఘించినవారు మరోసారి అదే ఉల్లంఘనకు పాల్పడితే జరిమానా రెట్టింపు విధించనున్నది. దీనివల్ల అందరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తారని, తద్వారా ప్రమాదాలు తగ్గుతాయన్నది రాష్ట్ర ప్రభుత్వ భావనగా పోలీసులు పేర్కొంటున్నారు. కొత్తచట్టాన్ని వచ్చే నెల ఒకటి నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు నగర పోలీసులు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా మొదట కొత్తచట్టం, పెరిగిన జరిమానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జరిమానా విధించే సమయంలో వాహనాలను రెండు కేటగిరీలుగా విభజించాలని చట్టంలో ఉంది. ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలను ఒక కేటగిరీగానూ, భారీ వాహనాలను మరొక కేటగిరీగా విభజించాలని పేర్కొంది. ఇప్పటివరకూ ఎవరైనా హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.135 జరిమానా వసూలు చేస్తున్నారు. ఇకపై దీనికి రూ.1,035 వసూలు చేయనున్నారు. రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు. అలాగే సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే ప్రస్తుతం రూ.535 వరకూ జరిమానా వసూలు చేస్తున్నారు. ఇకపై గరిష్ఠంగా రూ.5,035 వరకూ వసూలు చేయనున్నారు. రెండోసారి పట్టుబడితే రూ.10,035 జరిమానా విధిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ప్రస్తుతం రూ.1,035 వరకూ జరిమానా విధిస్తుండగా...ఇకపై దీనిని రూ.ఐదు వేలకు పెంచనున్నారు.


రెండోసారి కూడా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా పట్టుబడితే రూ.10,035 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాహనాన్ని పరిమితికి మించిన వేగంతో నడిపితే ప్రస్తుతం రూ.135 వసూలు చేస్తుండగా దీనిని రూ.1,035కి పెంచారు. ఏదైనా జంక్షన్‌లో రెడ్‌ సిగ్నల్‌ వయలేషన్‌కు పాల్పడితే ప్రస్తుతం రూ.135 వసూలు చేస్తుండగా...ఇకపై రూ.1,035 వసూలు చేయనున్నారు. మైనర్లకు వాహనం ఇస్తే ప్రస్తుతం రూ.535 జరిమానాగా వాహన యజమాని నుంచి వసూలు చేస్తుండగా ఇప్పుడు దీనిని రూ.5,035కి పెంచారు. ప్రమాదకరంగా వాహనాన్ని నడపడం, రేసింగ్‌ వంటి నేరాలకు పాల్పడిన వారి నుంచి ప్రస్తుతం రూ.1,035 వసూలు చేస్తుండగా ఇకపై రూ.ఐదు వేలు వసూలు చేయనున్నారు. రెండోసారి అదే ఉల్లంఘనకు పాల్పడితే రూ.10,035 వసూలు చేయనున్నారు. వాహనానికి రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.రెండు వేలు, రెండోసారి పట్టుబడితే ఐదు వేలు జరిమానా విధిస్తారు. పర్మిట్‌ లేని వాహనం నడిపితే రూ.పది వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు జరిమానా విధిస్తారు. పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తే ఏకంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు సిఫారసు చేస్తారు. అంబులెన్స్‌లు, ఫైర్‌ ఇంజన్లు వంటి ఎమర్జన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే ఏకంగా రూ.పది వేలు జరిమానా విధిస్తారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చట్టం ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు నగర ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు.


Updated Date - 2020-12-11T06:09:27+05:30 IST