భూముల సంరక్షణకు ఆధునిక విధానం

ABN , First Publish Date - 2020-12-18T04:36:56+05:30 IST

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) భూముల సంరక్షణకు అధునాతన సాంకేతిక విధానం అనుసరించనుందని, దీనికి జనవరిలో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపడుతున్నట్టు కమిషనర్‌ కోటేశ్వరరావు తెలిపారు.

భూముల సంరక్షణకు ఆధునిక విధానం
కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులతో చర్చిస్తున్న కమిషనర్‌ కోటేశ్వరరావు

జనవరి నుంచి వీఎంఆర్‌డీఏ పైలట్‌ ప్రాజెక్ట్‌

కమిషనర్‌ కోటేశ్వరరావు వెల్లడి


విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి  సంస్థ(వీఎంఆర్‌డీఏ) భూముల సంరక్షణకు అధునాతన సాంకేతిక విధానం అనుసరించనుందని, దీనికి జనవరిలో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపడుతున్నట్టు కమిషనర్‌ కోటేశ్వరరావు తెలిపారు. దీనిపై వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సిస్టమ్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌, ద్రోణ మ్యాప్స్‌కు సంబంధించిన ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. వీఎంఆర్‌డీఏ భూముల్లో ఎక్కడ ఏ చిన్న మార్పు జరిగినా శాటిలైట్‌ సాయంతో గుర్తించి, ఆ వివరాలను అధికారులకు సమాచారం అందిస్తారు. వెంటనే అధికారులు వెళ్లి, అక్కడి భూములను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. వీఎంఆర్‌డీఏ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఇప్పటికే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో వీఎంఆర్‌డీఏ పరిధిలో డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషినింగ్‌ సిస్టమ్‌ ద్వారా సర్వే చేసి, డేటా పొందుపరిచారు. శాటిలైట్‌ ద్వారా ‘చేంజ్‌ డిటెక్షన్‌’ సాఫ్ట్‌వేర్‌తో ఆ భూములను నిరంతరం పర్యవేక్షిస్తారు. మార్పులు జరగ్గానే ఆటోమేటిక్‌గా అధికారులకు సమాచారం వస్తుంది. ఇది ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకోవడానికి ముందుగా మధురవాడ, పరదేశిపాలెంలోని 200 ఎకరాల్లో జనవరి నుంచి పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపడుతున్నారు. అనధికార లేఅవుట్లను గుర్తించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని కమిషనర్‌ కోటేశ్వరరావు తెలిపారు. 


Updated Date - 2020-12-18T04:36:56+05:30 IST