నిపుణులతో రసాయనిక కంపెనీలు తనిఖీ

ABN , First Publish Date - 2020-05-10T06:43:39+05:30 IST

విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వున్న రసాయనిక కర్మాగారాలను నిపుణుల బృందంతో తనిఖీ చేయిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

నిపుణులతో రసాయనిక కంపెనీలు తనిఖీ

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు


మహారాణిపేట (విశాఖపట్నం), మే 9: విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వున్న రసాయనిక కర్మాగారాలను నిపుణుల బృందంతో తనిఖీ చేయిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌లతో కలసి ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటన, తదనంతర చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఆ ప్రాంతంలో పరిస్థితులపై పూర్తి అధ్యయనం కోసం ద్విసభ్య కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ విషవాయువు గాఢత, ట్యాంక్‌ల  ఉష్ణోగ్రత క్రమంగా తగ్గాయని తెలిపారు. ఇప్పటివరకు 12 మంది మృతిచెందారని, 11,336 మంది విషవాయువు వల్ల ఇబ్బంది పడ్డారని వివరించారు. 585 మంది అస్వస్థతకు గురికాగా 173 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, మిగిలిన వారిలో 90 శాతం మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీ ఆర్‌కే మీనా, జీవీఎంసీ కమిషనర్‌ సృజన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T06:43:39+05:30 IST