విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా టీడీపీ ప్రచారం: అవంతి

ABN , First Publish Date - 2020-07-18T20:34:03+05:30 IST

విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు.

విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా టీడీపీ ప్రచారం: అవంతి

విశాఖపట్నం : విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం నాడు ఫైర్, పరిశ్రమలు శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఒకసారి పరిశ్రమకు లైసెన్స్ తీసుకున్న తర్వాత కొందరు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరుచూ పరిశ్రమల్లో తనిఖీలు చేయమని అధికారులను ఆదేశించామన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంపెనీల్లో ఫైర్ సేప్టీ మేజర్స్ ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.


ఇకపై ఇలా చేస్తాం..!

కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తప్పనిసరిగా సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించాం. పర్యావరణ పరిరక్షణ ముఖ్యం. పరిశ్రమల్లో నిబంధనలు సమర్థవంతంగా అమలు చేయడానికి కమిటీలు ఏర్పాటు చేశాం. నాలుగు బృందాలుగా పరిశ్రమల్లో తనిఖీలు చేస్తారు. పరిశ్రమలు అభివృద్ధి, ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తున్నాం. పరవాడ ఫార్మాసిటీలో మెరుగైన ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించనున్నాం. అభివృద్ధిని అడ్డుకునే విధంగా కొందరు పోరాటాలు చేస్తున్నారు. 13 జిల్లాల అభివృద్దే మా ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వంలో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే, కంపెనీ యాజమాన్యాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు?. ఓటు వేసిన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని పరామర్శించక పోవడం దుర్మార్గంఅని అవంతి చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-07-18T20:34:03+05:30 IST