-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Mining investigation should be conducted
-
గనుల తవ్వకాలపై విచారణ నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-06-22T09:45:17+05:30 IST
ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో ఇష్టానుసారంగా గనుల తవ్వకాలపై సమగ్ర విచారణ

జనసేన నేత విజయ్‌కుమార్ డిమాండ్
విశాఖపట్నం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో ఇష్టానుసారంగా గనుల తవ్వకాలపై సమగ్ర విచారణ జరపాలని జనసేన నాయకుడు సుందరపు విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ’ఉల్లంఘనులు’ పేరిట ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై రెవెన్యూ, గనుల శాఖ అధికారులు వాస్తవాలు విచారణ చేయాలన్నారు. గనులు తవ్వుతున్న బినామీలు ఎవరనేది వెల్లడించాలన్నారు. గనుల శాఖ ఎప్పటి నుంచి టెంపరరీ పర్మిట్లు జారీచేసింది?, ఇంతవరకు ఎన్ని క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వారు? ప్రభుత్వానికి చెల్లించిన సీనరేజ్ ఎంత అనేది చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
డి.ఫారం భూములను చదును పేరిట దళితులు, పేద వర్గాలను బెదిరించి తీసుకున్న బడా నేతలు, తవ్వకాల తరువాత వ్యవసాయానికి అక్కడ కొండవాలు ప్రాంతాలు అనువుగా ఉన్నాయా? అనేది రెవెన్యూ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. లేకపోతే గ్రావెల్ తవ్విన లీజుదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీజుల బూచితో కొండల్లో విలువైన చెట్లు తొలగించడానికి అటవీశాఖ అనుమతి తీసుకోలేదని వివరించారు. రాంబిల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలో బౌద్ధప్రాంతానికి ఆనుకుని గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని ఆరోపించారు. స్థానికులు చిన్నపాటి నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇచ్చిన పురావస్తుశాఖ, గ్రావెల్ తవ్వితే మౌనంగా ఉండడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.