చేపల మార్కెట్‌ స్థానంలో మెట్రో రైల్వే స్టేషన్‌

ABN , First Publish Date - 2020-08-11T09:52:33+05:30 IST

నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అధునాతన చేపల మార్కెట్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో మెట్రో రైల్వే స్టేషన్‌ రాబోతున్నట్టు ..

చేపల మార్కెట్‌ స్థానంలో మెట్రో రైల్వే స్టేషన్‌

ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపానున్న స్థలంలో నిర్మాణం

అధికారుల యోచన

గత ప్రభుత్వ హయాంలో అధునాతన చేపల మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన

నిధులు కూడా విడుదల


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అధునాతన చేపల మార్కెట్‌ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో మెట్రో రైల్వే స్టేషన్‌ రాబోతున్నట్టు తెలిసింది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో మెట్రో రైల్వే పనులు ఊపందుకున్నాయి. ఏయే మార్గాల్లో మెట్రో రైలు నడిచేది ఇంతకుముందే ఖరారు చేశారు. ఆయా మార్గాల్లో ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషన్‌ చొప్పున ఏర్పాటుచేయాల్సి ఉంది. వీటికి అవసరమైన స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపాన ప్రస్తుతం చేపల మార్కెట్‌ నిర్వహిస్తున్న స్థలం మెట్రో రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి అనువుగా వుంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే అక్కడున్న చేపల మార్కెట్‌ను వేరే ప్రాంతానికి తరలించాలా? శాశ్వతంగా దానిని మూసేయాలా? అనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 


అధునాతన మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన

ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆనుకొని మత్స్యకారులు ప్రతి ఆదివారం చేపల మార్కెట్‌ నిర్వహిస్తున్నారు. దానికి ఆదరణ బాగుండడంతో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో సందర్శించి, అక్కడ చెన్నైలో మాదిరిగా అధునాతన చేపల మార్కెట్‌ను నిర్మించాలని ఆదేశించారు. నాటి వుడా దానికి ప్రతిపాదనలు రూపొందించగా 2106-17 ఆర్థిక సంవత్సరంలో ఆయన చేతులు మీదుగానే శంకుస్థాపన కూడా జరిగింది. 


చేపల మార్కెట్‌ స్థలం విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)ది. దాంతో నిర్మాణ బాధ్యతలను ఆ సంస్థకే అప్పగించారు. గ్రౌండ్‌+4 అంతస్థుల భవనం నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కింద సెల్లార్‌లో పార్కింగ్‌తో పాటు చేపలు నిల్వ చేసుకోవడానికి చిల్లింగ్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అలాగే చేపలు విక్రయించే వారికి 40 కౌంటర్లు, శుభ్రం చేసే వారికి 40 కౌంటర్లు ఇవ్వాలని ఖరారు చేశారు. పైన రెస్టారెంట్‌ ఏర్పాటుచేసి, చేపలతో తయారుచేసిన స్పెషల్‌ వంటకాలు అక్కడ వేడివేడిగా అందించాలనేది ఆలోచన. ఈ ప్రాజెక్టుకు మొదటి దశలో రూ.4.35 కోట్లు, రెండో దశలో రూ.2.95 కోట్లు అవసరమని తేల్చారు.


మొదటి దశ పనులకు మత్స్య శాఖ రూ.1.74 కోట్లు విడుదల చేసింది. ఎన్‌ఎఫ్‌డీబీ (నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు) నుంచి కోటి రూపాయలు, ఎస్‌డీపీ (సెక్టోరియల్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌) నిధుల నుంచి రూ.1.61 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాయి. వుడా వీసీగా బాబూరావునాయుడు వున్న సమయంలో దీనికి ప్రతిపాదనలు తయారు చేయగా, ఆ తరువాత వీసీగా వచ్చిన బసంత్‌కుమార్‌ దీనిపై దృష్టిసారించి టెండర్లు కూడా ఖరారు చేశారు. పనులు ప్రారంభించాలనుకుంటున్న సమయంలో ప్రభుత్వం మారడంతో ప్రాధాన్యాలు మారిపోయాయి. గత ఏడాది చివర్లో ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపనలు


జరిగిన వాటిలో దీనికి స్థానం దక్కకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈలోగా మెట్రో రైలు ప్రాజెక్టు రావడం, దానికి స్థలాల అన్వేషణలో దీనిని ఉపయోగించుకోవాలని భావించడంతో చేపల మార్కెట్‌ నిర్మాణం ఆగిపోయినట్టేనని చెబుతున్నారు. కొత్తగా వేరే చోట స్థలం చూసి అక్కడ నిర్మిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.


మెట్రో అధికారులు చూశారు.. కె.రామ్మోహన్‌రావు,ఎస్‌.ఈ., వీఎంఆర్‌డీఏ

ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గరున్న చేపల మార్కెట్‌ స్థలాన్ని మెట్రో రైలు అధికారులు చూసిన మాట వాస్తవమే. అక్కడ ఓ స్టేషన్‌ నిర్మించాలని అనుకుంటున్నారు. చేపల మార్కెట్‌పై నిర్ణయం తీసుకోవలసి ఉంది. 

Updated Date - 2020-08-11T09:52:33+05:30 IST