ఫోన్‌లో వైద్యం

ABN , First Publish Date - 2020-04-24T09:11:29+05:30 IST

నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన రాజేష్‌కుమార్‌ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. నెలలో కనీసం రెండుసార్లు

ఫోన్‌లో వైద్యం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసరమైన వారికి

సేవలు అందిస్తున్న వైద్యులు

లక్షణాలను బట్టి మందులు

వాట్సాప్‌ ద్వారా ప్రిస్ర్కిప్షన్‌

రోగికి అందించే సలహాలు, సూచనలను బట్టి ఆన్‌లైన్‌లోనే ఫీజు వసూలు

సాధారణ రోజులతో పోలిస్తే కొంత తక్కువ తీసుకుంటున్న వైనం


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన రాజేష్‌కుమార్‌ కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. నెలలో కనీసం రెండుసార్లు వైద్యుని వద్దకు వెళుతుండేవాడు. లాక్‌డౌన్‌తో ఆస్పత్రులు మూతపడడంతో కొద్దిరోజులు ఇబ్బందిపడ్డాడు. అత్యవసర పరిస్థితిలో ఒకసారి తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడికి ఫోన్‌ చేశాడు. సమస్యను విన్న ఆయన గతంలో వాడుతున్న మందుల్లో స్వల్ప మార్పులు చేసి ప్రిస్కిప్షన్‌ను వాట్సాప్‌లో పంపించారు. డాక్టర్‌ అందించిన ఆన్‌లైన్‌ సేవలకు ప్రతిఫలంగా సదరు రోగి ఫీజును ఫోన్‌ పేలో చెల్లించాడు.


లాక్‌డౌన్‌తో గతంలో ఎన్నడూ లేని విధంగా అందరూ రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే సాధారణ ప్రజలకు ఫర్వాలేదు గానీ, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారు పొందే చికిత్స అత్యవసరం కిందకు రాదు..అలా అని  వైద్యుడి వద్దకు వెళ్లకపోతే వ్యాధి తిరగబెడుతుంది.


ఈ నేపథ్యంలో నగర పరిధిలో కొంతమంది వైద్యులు తమ వద్ద చికిత్స చేయించుకుంటున్న రోగులకు ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నారు. రోగి ఇబ్బందులను ఫోన్‌లోనే తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తున్నారు. అత్యవసరమైతే కొన్ని రకాలు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చెబుతున్నారు. ఆ రిపోర్టులను బట్టి గతంలో వాడుతున్న మందులను కొనసాగించడం లేదా మార్పులు చేయడం చేస్తున్నారు. మందుల ప్రిస్ర్కిప్షన్‌ను వాట్సాప్‌లో పంపిస్తున్నారు. 


మానసిక స్థైర్యం.. 

అనారోగ్య సమస్యలతో బాధపడే పలువురు లాక్‌డౌన్‌ కారణంగా వైద్య సేవలకు దూరం కావడంతో మానసికంగా కుంగిపోతున్నారు. డాక్టర్‌కు చూపించుకోకపోవడం వల్ల తన అనారోగ్య సమస్య పెరిగిపోయి వుంటుందన్న భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి రోగులకు వైద్యులు ఫోన్‌లోనైనా సేవలు అందించడం వల్ల మానసికంగా బలంగా వుండేందుకు అవకాశం ఉంటుంది. రోగి మానసికంగా బలంగా వున్నప్పుడే మందులు ఎక్కువ ఫలితాన్నిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ఉద్దేశంతోనే రోగులకు కొంతమంది వైద్యులు ఫోన్‌లో అందుబాటులో వుంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారని నగరానికి చెందిన ఓ ఎముకల వైద్య నిపుణుడు తెలిపారు. 


డిజిటల్‌ పేమెంట్‌.. 

రోగికి అందిస్తున్న సేవలు, ఫోన్‌లో వెచ్చిస్తున్న సమయాన్ని బట్టి వైద్యులు కొంతమొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే ఫీజుగా తీసుకుంటున్నారు. అయితే ఇది సాధారణ రోజుల్లో తీసుకునే మొత్తంలో సగం మాత్రమే వుంటోందని పలువురు రోగులు చెబుతున్నారు. 

Updated Date - 2020-04-24T09:11:29+05:30 IST