పట్టపగలే భారీ చోరీ

ABN , First Publish Date - 2020-12-16T06:25:17+05:30 IST

నగరంలో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్డులోని మహారాణి పార్లర్‌ సమీపంలో గల ఒక వ్యాపారి ఇంట్లో దొంగలు చొరబడి 60 తులాల బంగారం, కిలోన్నర వెండి వస్తువులను అపహరించుకుపోయారు.

పట్టపగలే భారీ చోరీ
తెరిచివున్న బీరువాలోని లాకర్‌

అక్కయ్యపాలెంలో60 తులాల బంగారం,

కిలోన్నర వెండి అపహరణ


విశాఖపట్నం/సీతంపేట, డిసెంబరు 15: నగరంలో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్డులోని మహారాణి పార్లర్‌ సమీపంలో గల ఒక వ్యాపారి ఇంట్లో దొంగలు చొరబడి 60 తులాల బంగారం, కిలోన్నర వెండి వస్తువులను అపహరించుకుపోయారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్డుకు అనుకుని జలమూరి బంగార్రాజు, రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. తమ నివాసానికి సమీపంలో సాయినాథ కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ నిర్వహిస్తున్నారు. బంగార్రాజు ప్రతిరోజూ ఉదయాన్నే దుకాణానికి వెళ్లి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ఆయన భార్య రమాదేవి దుకాణంలో ఉండేవారు. ఎప్పటిలాగే బంగార్రాజు సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వెళ్లగా, ఆయన భార్య దుకాణం వద్దకు వచ్చారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు బంగార్రాజు ఇంటికి తాళం వేసుకుని దుకాణానికి వెళ్లారు. రాత్రి 9.30 గంటల సమయంలో రమాదేవి దుకాణం నుంచి ఇంటికి రాగా తలుపులకు తాళం కనిపించలేదు. దీంతో తన భర్త ఇంటికి తాళం వేయడం మరిచిపోయి వుంటారని భావించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే...బెడ్‌రూమ్‌లోని బీరువా తెరిచి ఉండడం, వస్తువులన్నీ చిందరవందరగా పడి వుండడంతో ఆందోళనకు గురై, విషయాన్ని ఫోన్‌లో తన భర్తకు తెలిపింది. దీంతో బంగార్రాజుతోపాటు దుకాణంలో పనిచేసే వారంతా ఇంటికి వెళ్లారు. బీరువా లోపల వుండే లాకర్‌ పగులగొట్టి ఉంది. లాకర్‌లో పెట్టిన సుమారు 60 తులాల బంగారు అభరణాలు, కిలోన్నర వెండి వస్తువులు కనిపించలేదు. చోరీ విషయాన్ని సోమవారం రాత్రి పది గంటల సమయంలో నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మంగళవారం ఉదయం క్రైమ్‌ డీసీపీ సురేష్‌బాబు, ఏసీసీ శ్రావణ్‌కుమార్‌, సీఐ సింహద్రినాయుడు ఘటనా స్థలానికి మరోమారు వెళ్లి పరిశీలించారు. చోరీ జరిగిన ఇంటికి సమీపంలోని ఒక మెడికల్‌ షాప్‌లో సీసీ కెమెరాలు వుండడంతో వాటి ఫుటేజీని సేకరించి పరిశీలిస్తున్నారు.


కష్టార్జితం...దొంగలపాలు

నర్సీపట్నానికి చెందిన తాను చిన్నతనంలోనే నగరానికి వచ్చానని, అప్పటినుంచి కష్టపడి సంపాదించినదంతా దొంగలపాలైందని బంగార్రాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కథనం ప్రకారం...ఒక్కగానొక్క కూతురుకు ఇటీవలే పెళ్లి చేశారు. అల్లుడు, కూతురు బెంగళూరులో ఉంటున్నారు. వివాహ సమయంలో వారికి పెట్టిన బంగారు ఆభరణాలు బంగార్రాజు వద్దనే ఉంచారు. ఇవి కొద్దిరోజుల కిందటి వరకూ బ్యాంక్‌ లాకర్‌లో ఉండేవి. అయితే లాకర్‌ తాళాన్ని బంగార్రాజు పోగొట్టుకోవడంతో ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. బ్యాంకు అధికారులు అతని లాకర్‌ను పగులకొట్టి, కొత్త లాకర్‌ను తిరిగి కేటాయించారు. అయితే బంగార్రాజు ఆభరణాలను ఆ లాకర్‌లో పెట్టకుండా, కొద్దిరోజులు ఇంట్లోనే వుంచుదామనే భావనతో  తెచ్చి బీరువా లాకర్‌లో దాచారు. రే పోమాపో వీలుచూసుకుని కొత్తలాకర్‌లో వాటిని భద్రపరచాలనే ఆలోచనలో వుండగా...ఇలా జరిగింది.


పోలీసుల అదుపులో అనుమానితులు

ఈ కేసులో కొంతమంది అనుమానితులను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. స్టేషన్‌ పరిఽధిలోని ఒక ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిగా వున్న ఒక మైనర్‌ను కూడా విచారిస్తున్నట్టు తెలిసింది. సీసీ కెమెరాల ఫుటేజీలో సమాచారం ప్రకారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలోనే చోరీ జరిగి వుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బంగార్రాజు ఇంటి సభ్యుల కదలికలపై బాగా అవగాహన వున్నవారే చోరీకి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-16T06:25:17+05:30 IST