-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » mask is diamond weapon
-
మాస్కే వజ్రాయుధం
ABN , First Publish Date - 2020-12-28T05:51:35+05:30 IST
కరోనా వైరస్ కొత్త స్ర్టెయిన్‌పై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

కరోనా కొత్త స్ర్టెయిన్‌పై ఆందోళన చెందొద్దు...
అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దు
అనవసరంగా జన సమూహంలోకి వెళ్లకండి
తప్పనిసరై వెళ్లినా మాస్క్ ధరించాలి
కొత్త స్ర్టెయిన్ లక్షణాలు...ఆకలి లేకపోవడం, విపరీతమైన తలనొప్పి, గందరగోళం, విరేచనాలు, కండరాల నొప్పులు
‘ఆంధ్రజ్యోతి’తో రాష్ట్ర కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కరోనా వైరస్ కొత్త స్ర్టెయిన్‌పై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అయితే అందరూ అప్రమత్తంగా వుండడం ద్వారా కొత్త స్ర్టెయిన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చునని అంటున్నారు రాష్ట్ర కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు. కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, కొత్త స్ర్టెయిన్‌పై నెలకొన్న ఆందోళనలు, అపోహలు తదితర అంశాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
కరోనా వైరస్ రూపాంతరాల్లో ఒకటి కొత్త స్ర్టెయిన్
కరోనా వైరస్ రూపాంతరాల్లో ఈ కొత్త స్ర్టెయిన్ ఒకటి. దీన్ని వీయూఐ 202012/01 అని పిలుస్తారు. ఇది కొత్త వైరస్ మాత్రం కాదు. వైరస్ జన్యు మార్పిడుల్లో భాగంగా ఈ కొత్తరకం ఆవిర్భవించినట్టు స్పష్టమవుతున్నది. ఈ కొత్తరకం వైరస్ వ్యాప్తి ఎక్కువగా వుంటున్నదని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ వైరస్‌తో పోలిస్తే..ఇది 70 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నది.
ఆందోళన వద్దు..అప్రమత్తంగా ఉందాం..
కొత్తరకం స్ర్టెయిన్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా వున్నా... తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని నివారించేందుకు అవకాశముంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. హోమ్ ఐసోలేషన్‌లో వుండేలా ఆదేశాలు జారీచేశాం. నిరంతర పర్యవేక్షణకు మెడికల్ ఆఫీసర్లు, సర్వేలెన్స్ బృందాలను నియమించాం.
మాస్కే వజ్రాయుధం
కరోనా వైరస్‌గానీ, కొత్త రకం స్ర్టెయిన్‌గానీ... ఏదైనా సరే వ్యాప్తిని నిరోధించాలంటే వున్న ఏకైక మార్గం మాస్క్ ధరించడం. అయితే, చాలామంది మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. బయటకు వె ్లనప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. రానున్న రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు, పండగలు వున్న నేపథ్యంలో జాగ్రత్తగా వుండడం మంచిది. కరోనా కేసులు ఇప్పుడిప్పుడు తగ్గుతున్నాయి. ఈ సమయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మళ్లీ కేసులు పెరిగే అవకాశముంది. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. వ్యాక్సిన్ తీసుకున్నా యాంటీబాడీస్ అభివృద్ధి చెందేందుకు కనీసం 45 రోజులు పడుతుంది. అంటే మరో మూడు నుంచి నాలుగు నెలలపాటు వైరస్ నుంచి మనకు రక్షణ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరికి వాళ్లు మాస్క్ ధరించడం, సామూహిక ప్రదేశాలకు వెళ్లకుండా వుండడం ద్వారానే పాత, కొత్తరకం స్ర్టెయిన్‌లు బారినపడకుండా ఉండేందుకు అవకాశముంది.
కొత్త స్ర్టెయిన్ లక్షణాలు
ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల్లో 46 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సగం కేసులు కొత్తరకం స్ర్టెయిన్‌విగా నిపుణులు చెబుతున్నారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా జన సమూహ ప్రాంతాలకు వెళ్లడం శ్రేయస్కరం కాదు. దీనివల్ల సెకండ్ వేవ్‌లో కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇక కొత్తగా వస్తున్న స్ర్టెయిన్‌తో ప్రస్తుతం ఇబ్బంది లేనప్పటికీ.. రానున్న రోజుల్లో కేసులు నమోదయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కొత్తరకం స్ర్టెయిన్‌కు సంబంధించి లక్షణాల్లో ఆకలి లేకపోవడం, విపరీతమైన తలనొప్పి, గందరగోళం, విరేచనాలు, కండరాల నొప్పులు ఉన్నాయి.
లండన్ నిపుణులతో సమావేశం
కొత్తరకం స్ర్టెయిన్‌పై లండన్‌కు చెందిన వైద్య నిపుణులతో సమావేశం కాబోతున్నాం. దీనిపై మరింత సమాచారాన్ని తెలుసుకుని, దీని నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యచరణను ప్రారంభించనున్నాం.